జైశ్రీరామ్.
9. ఓం రౌద్రాయ నమః.
తరల - ద్విపదద్వయ గర్భ సీసము.
శరణమంచును నిన్ను సన్నుతి సల్పినన్ - గరుణింతువే నీవు కమలనయన!
వరమునిమ్మని మేము భక్తిని పల్కగా - వరమిత్తువే మాకు భక్తవరద!
చరణ దాసులఁ గాచు సన్నుత సామివే - నరసింహుఁడా! కొల్పు నాకు శక్తి.
వరదయానిధి! భక్తి భావ వివర్ధనం - బొనరింతువే! నిత్య పూజ్య దేవ!
గీ. దుష్ట సంహార *రౌద్ర*! మా కష్టములను - దుష్టులను పాపి తొలఁగించు, శిష్టరక్ష!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
9వ సీస గర్భస్థ తరలము. (న భ ర స జ జ గ .. యతి 12)
శరణమంచునునిన్ను సన్నుతి సల్పినన్ గరుణింతువే!
వరమునిమ్మని మేము భక్తిని పల్కగా వరమిత్తువే!
చరణ దాసులఁ గాచు సన్నుతసామివే నరసింహుఁడా!
వరదయానిధి! భక్తి భావ వివర్ధనంబొనరింతువే!
9వ సీస గర్భస్థ ద్విపద ద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం.గ.1సూ.గ ..
యతి 3వ గణము 1వ అక్షరము)
1.శరణమంచును నిన్ను సన్నుతి సల్పి, - వరమునిమ్మని మేము భక్తిని పల్క.
2.చరణ దాసులఁ గాచు సన్నుతసామి - వరదయానిధి! భక్తి భావ వివర్ధ.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ తామరపూవులవంటి కన్నులు కలవాఁడా! శరణు వేడుచు
నిన్ను సన్నుతించినచో నీవు కరుణింతువుకదా. ఓ భక్త వరదా! భక్తితో మేము నిన్ను వరములీయమని అడిగినంతనే
మాకు వరములిత్తువు కదా! ఓ నరసింహుఁడా! నీ చరణ దాసులను కాపాడు పొగడఁబడెడి స్వామివి కదా, నాకు శక్తిని
కలుఁగఁ జేయుము. నిత్యము పూజింపఁబడువాఁడా!
శ్రేష్ఠమైన దయా స్వభవమునకు స్థానమైనవాఁడా! నీవు భక్తి
భావనమును వృద్ధి చేసెడివాడవుకదా!
దుర్మార్గులను సంహరించు ఓ రౌద్రుఁడా! ఈ శిష్ట రక్షకుఁడా! దుర్మార్గులను
లేకుండా చేసి మా కష్టములను తొలగించుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.