జైశ్రీరామ్.
10. ఓం సర్వాద్భుతాయ నమః.
గజవిలసిత గర్భ సీసము.
పరమదీక్షగను నీ పద పద్మముల్ కని - న కనులు కనులగున్ నా నరహరి!
నుతియించుచుండి శ్రీపతి నిన్ గనన్ బరి - ణతి కలుగు మదికిన్ క్షితిజులకును.
జగమందు నీవు ప్రాపుగనుంటివో వర - లుదు నిరతము హరీ! మది నిలువుమ.
సరి లేనివాఁడ! శ్రీ పరమేశ్వరా! సిరి - ని, నినుఁ గనఁ దగనా? నిగమసార!
గీ. ప్రేమఁ గనుమ *సర్వాద్భుత* నామ, మమ్ము! - పాప హరణంబు చేయుమో పరమ పురుష!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
10వ సీస గర్భస్థ గజవిలసిత వృత్తము. (భ ర న న న గ .. యతి 8)
నీ పద పద్మముల్ కనిన కనులు కనులగున్ - శ్రీ పతి నిన్ గనన్ బరిణతి కలుగు మదికిన్.
ప్రాపుగనుంటివో వరలుదు నిరతము హరీ - శ్రీ పరమేశ్వరా! సిరిని, నినుఁ, గనఁ దగనా?
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమునప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ నరహరీ! గొప్ప దీక్షతో నీ పాదపద్మములను చూచినకన్నులే కన్నులగును కదా. ఓ లక్ష్మీ వల్లభా! జనులకు నిన్ను పొగడుచు నిన్ను చూచుచుండినచో మనసుకు పరిణతికలుఁగును. ఓ శ్రీ హరీ! లోకములో నీవు ఆధారముగా ఉన్నచో ఎల్లప్పుడూ వరలుదును. నన్ను మనసులో నిలుపుము. సాటిలేనివాఁడా! వేదసారమైన ఓ మంగళప్రదుఁడవగు పరమేశ్వరా! మాలక్ష్మీదేవి తల్లిని, నిన్నూ చూచుటకు నేను సరిపోనా? ఓసర్వాద్భుత నాముఁడా! మమ్ములను ప్రేమతో జూడుమా. ఓ పరమ పురుషా! మాలోని పాపమును నశింపఁజేయుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.