గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 8వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

8. ఓం ఉగ్రలోచనాయ నమః.

జ్ఞాన వృత్త గర్భ సీసము.

బలమైన నీ పాదములను బట్టితి. నేని - క విడఁ జాలన్, హరీ! కావుమీవు

ప్రగణిత శ్రీ పాదయుగళమే నిలిచెన్ న - ను నిలుపంగన్ గృపన్ ఘనతరముగ.

కలిగిన పాపాళి తొలగఁగాఁ గనవచ్చు - నిను నృసింహా! సదా కనుము నన్ను.

సుగణితా! దీపించును గద నీదగు దివ్య - ప్రతిభ దేవా! నన్ను వరలఁజేయ.

గీ. జ్ఞాన గర్భ సుసీసస్థ కల్పతరువ! - *ఉగ్రలోచనా*! నన్నుననుగ్రహించు.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

8 సీస గర్భస్థ జ్ఞాన వృత్తము. ( .. యతి 10)

నీ పాదములను బట్టితి నేనిక విడఁజాలన్ - శ్రీపాద యుగళమే నిలిచెన్ నను, నిలుపంగన్.

పాపాళి తొలగఁగాఁ గనవచ్చు నిను నృసింహా! - దీపించును గద నీదగు దివ్య ప్రతిభ దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! శ్రీ హ్రీశక్తివంతమైన నీ పాదములను నేను

పట్టుకొంటిని. ఇంక విడువను. నన్ను కాచువాడవు నీవే సుమా. మిక్కిలి పొగఁడఁబడెడివాఁడా! లక్ష్మీప్రదమైన నీ

పాదద్వయమే నన్ను నిలఁబెట్టుటకు నిలిచెను. నాకు సంతోషమునొసగును.   నరసింహా! నన్నంటియున్న పాపములు

తొలగిపోవు విధముగా నిన్ను చూడవచ్చును. నీవు నన్ను ఎల్లప్పుడూ చూచుచుండుము. మంచిగా గణింపఁబడువాఁడా!

నన్ను వరలునట్లు చేసినచో నీ యొక్క దివ్యమైన ప్రభ వరలును కదా. జ్ఞాన వృత్తమును గర్భమునందు కలిగిన సీస

పద్యమున వరలుచున్న కల్పతరువా! ఉగ్రలోచనా! నన్ను అనుగ్రహించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.