జైశ్రీరామ్.
91. ఏమేమి? కాల గతి నెప్పటికేని నీలో
నేమార్పు లేకునికి హేతువు కానరాదే!
ధీమంతులిట్టులనె దీపితులౌదురేమో!
సోమప్లవుండవయి శోభిలు సూర్యదేవా!
92. స్వోత్కర్ష లేని గుణ సుందర! త్విట్పతీ! నీ
యుత్కృష్టతన్ దెలుప నుర్విని చాలలేనే.
సత్కార్యముల్ గనుచు సత్యము పల్కనిమ్మా.-
మత్కామ్యమున్ గను. సమంచిత సూర్యదేవా!
93. శ్రీమద్ద్యుమంతుఁడ! వశించు మనమ్మునన్ నీ
నామంబు నే పలుకు నైపుణినీయ నాకున్.
బ్రేమన్ సదా కనుచు, విజ్ఞత కొల్పి కావన్.
మామీద చూపుమభిమానము సూర్యదేవా!
94. నిత్యాన్నదానమును నే పచిరింపఁజాలన్.
సత్యోన్నతిన్ దెలిసి చక్కగ పల్కనెంతున్.
స్తుత్యుండ నీదు కృపతో నడిపించుమట్లే.
నిత్యంబు నిన్ గొలుతు నేర్పున సూర్యదేవా!
95. విద్యాసుగంధమునపేక్షను పొందనున్నన్
సద్యఃఫలంబగును చక్కఁగ నీకు మ్రొక్కన్.
హృద్యాద్భుతంబగు ప్రవృద్ధియు కాన వచ్చున్.
సద్యోవిభాతి గల సన్నుత సూర్యదేవా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.