గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 7వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

7. ఓం స్తంభజాయ నమః.

మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.

మంచి చెడ్డలు వీడి, మాన్యుల మార్చి, వం - చనఁ జేయుచున్ వారి ఘనతఁ బాపి,

కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుం - డిరి బాధలన్ దుష్ట పరులు భువిని.

వంచితాత్ములనెంచి వంచనఁ బాపి, కా - వుమ మాన్యులన్ నీవు విమల చరిత!

మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్. - నరసింహుఁడా! నీదు కరుణఁ జూపి.

గీ. దుష్ట సంహారమును చేసి శిష్ట జనులఁ - సాకి రక్షించు సుజన హృత్  *స్తంభజా*!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

7 సీస గర్భస్థ మత్తకోకిల. ( .. యతి 11)  

మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి వంచనఁ జేయుచున్

కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పుచుండిరి బాధలన్.

వంచితాత్ములనెంచి, వంచనఁ బాపి, కావుమ మాన్యులన్,

మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్యతన్! నరసింహుఁడా!

7 సీస గర్భస్థ ద్విపద ద్వయము. (2పాదములు. ప్రతీ పాదమున 3ఇం..1సూ.. యతి 3 గణము 1   

                                          అక్షరము ప్రాస నియతి కలదు)

1.మంచి చెడ్డలు వీడి మాన్యుల మార్చి - కొంచెమైనను భీతిఁ గ్రుంగక కొల్పు.

2.వంచితాత్ములనెంచి, వంచన బాపి, - మంచి పెంచుచు, పెంచు మమ్ముల మాన్య!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భూమిపై దుర్మార్గులు మంచిచెడులను పూర్తిగ విడిచిపెట్టి,

మంచివారిని సహితము మాయమాటలతో మార్చివేయుచు, వారి ఔన్నత్యమును నశింపఁ జేయుచు, పాపభీతి

కొంచెమైనను లేనివారై వారిని బాధపెట్టుచుండిరి. సుజనుల హృదయములందుండు స్తంభ జాతా! దుష్ట స్వభావులను

సంహరించి, శిష్టులను కాపాడి, పోషించు విమలచరిత్రుఁడవైన నరసింహుఁడా! నీకరుణఁ జూపి మోసస్వభావము

కలవారిని నీవు గ్రహించి, వారిలోగల వంచన స్వభావమును పోఁగొట్టి, మంచివారికి రక్షణ కల్పించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.