జైశ్రీరామ్.
76. క్షీరాన్నమున్ గొనఁగ చిత్తమదేల నీకున్?
శ్రీరమ్య భోజ్యములు చేఁ గొనరాదొ నీవే.
మారాము చేయకుము. మాయెడ జాలి లేదా?
శ్రీరామ సేవ్య గుణశేఖర! సూర్యదేవా!.
77. సాహిత్య మార్గమది చక్కఁగ నిన్నుఁ జూపున్.
మోహాదులే తొలఁగు, ముక్తిద! నిన్నుఁ జూడన్.
సాహిత్యమీవె. విలసన్నుత! కొల్పు మాకున్.
దేహస్థ! కొల్పుమయ దీప్తిని సూర్యదేవా!
78. నీ వృత్తమున్ దెలుప నేనెటు చాలువాఁడన్?
జీవాళి కెమ్మెయిని జీవము నీవె కాదా.
భావింప సాధ్యమెటు? భక్తికె లొంగువాఁడా!
నీవారలన్ గనుమ నేర్పున సూర్యదేవా!
79. ఆకాశ హర్మ్యమున హాయిగ సంచరించే
లోకేశుఁడా! శుభ విలోకన భాగ్యమిమ్మా.
శ్రీ కల్పనా చతుర! చిన్మయ తేజమిమ్మా.
నీకున్నతుల్ తెలుపనిమ్మయ. సూర్యదేవా!.
80. నీవే మహాత్ముఁడవు. నిర్మల దివ్య తేజా!
నీవే జగత్పతివి నిర్భర పుణ్యభాసా!
నీవే ప్రపూజ్యుఁడవు నిత్యము మాకు పృథ్విన్.
నీవే మమున్ నడుపు నేతవు సూర్యదేవా!..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.