జైశ్రీరామ్.
66. రైతన్నలన్ గనుచు రక్షణఁ గొల్ప రావా!
పోతన్న రైతు. ఘన మోక్షదుడయ్యె ధాత్రిన్.
భాతిన్ రచించెనుగ భాగవతామృతమ్మున్.
రైతుల్ కృపాళురు. సురక్షక! సూర్యదేవా!
67. ప్రాతర్నమామి యని భక్తిగ నిన్నుఁగొల్తున్.
భూతాత్మవీవెకద పూజ్యుఁడ పుణ్యమూర్తీ!
శీతాంశు కీర్తి వికసింపఁగ చేయుదీవే.
నీ తీరు నెన్నుదును నిత్యము సూర్యదేవా!
68. అజ్ఞాన మేచికమునంతము చేయువాఁడా!
విజ్ఞాన రోచులకు వేల్పయి కొల్పు వాఁడా!
ప్రజ్ఞాప్రభాస! వర భాస్కర భవ్య తేజా!
సుజ్ఞానమిమ్మికను శోభిల సూర్యదేవా!
69. భాసా! శిరీష సుమ వర్ణమునొప్పువాఁడా!
శేషాహియున్ పరవ శించఁడె నిన్నుఁ దెల్పన్?
నీ సామ్య మెన్న ధరణిన్ దగువారు లేరే.
నా సన్నుతుల్ గొనుమనంతుఁడ! సూర్యదేవా!
70. జీవాత్మవై వెలుఁగు శ్రీకర దివ్య తేజా!
భావార్ణవోద్భవుఁడ! వర్థిలఁ జేయువాఁడా!
సేవింతు నిన్ దెలిసి చిత్తము పొంగ నాలో.
నీవేకదా విధివి నిర్జర సూర్యదేవా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.