గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 56 నుండి 60 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 జైశ్రీరామ్.

56. ధారాగతిన్ చలువధారలు భూమికీయన్ 

రేరేనికిన్ గొలిపి ప్రేమను కాంతి కల్మిన్

నీరేజబాంధవుఁడ! నిత్యమనేక శక్తుల్ 

కారుణ్యమున్ గొలిపి కాచితె సూర్యదేవా! 

57. స్వార్థంబు లేని భగవానుఁడ! భాస్కరా! మా 

స్వార్థంబుఁ బాపి మము చక్కఁగనుంచలేవా?

సార్థక్యమున్ గొలుపు సద్వర జన్మకున్, నిన్ 

బ్రార్థింతు భక్తిమెయి భవ్యుఁడ! సూర్య దేవా! 

 

58. అంతంబు లేని కరుణాకర! లోకబంధూ! 

సాంతంబు నన్ గనుమ సద్గుణమిచ్చి నాకున్.

శాంతస్వరూప! విలసన్నుత! శాంతినిమ్మా. 

భ్రాంతుల్ విడన్ తరుము వర్థిల సూర్యదేవా.

 

59. బ్రహ్మంబు నీవనుచు ప్రాగ్దిశ కాంతుమయ్యా 

బ్రాహ్మీముహూర్తమున పావన రూప నీకై.

బ్రహ్మన్ జరించగను బాటను చూపువాఁడా! 

బ్రహ్మాండమీవె శుభవర్ధక సూర్యదేవా!.

 

60. ఆకాశ గామివయి హారతులందువాఁడా. 

నీకెవ్వరీడగు పునీతుఁడ సృష్టిలోనన్?

రాకేశుఁడైన తనరారును నీదు దీప్తిన్. 

శ్రీకామితార్థదుఁడ! చిన్మయ! సూర్యదేవా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.