జైశ్రీరామ్.
51. ఉర్వీజనాళికి మహోన్నత భక్తినిమ్మా.
సర్వత్ర సౌఖ్యములు సంపదలొప్పనిమ్మా.
పర్వంబులన్ జగతి వర్ధిల, సాగనిమ్మా.
గర్వాపహా! సుగుణ కల్పక సూర్యదేవా!
52. రేయింబవళ్ళనొనరింతువు నీవె దేవా.
మాయావృతంబయిన మాపఁగఁ జాలుదీవే.
శ్రేయంబులన్ కలుఁగఁ జేతువు నీవె మాకున్.
సాయంబుగా నిలుము సంస్తుత సూర్యదేవా!
53. నీటిన్ సృజించె విధి. నీవటనాకసానన్
వాటంబుగా తిరిగి వారిద పంక్తి చేరన్
నీటిన్ గ్రహించి కడు నేర్పుననిత్తువయ్యా.
పాటించి నిన్ గొలుతు భక్తిని సూర్యదేవా!
54. హే దేవ! చిద్విభవ! హే దిన రాజ! సూర్యా!
ఈ దీనునిన్కరుణనేలుమ లోకబంధూ!
మోదంబుతో కనుచు మోహము బాపుమయ్యా.
శ్రీ దుండ! వందనము చేకొను సూర్యదేవా!
55. నీకే కదా జగతి నిత్యము కన్పడున్ నీ
రాకే కదా శుభము ప్రాగ్దిశనుండి తెచ్చున్.
మాకే కదా సకలమంగళముల్లభించున్.
శ్రీ కారపూర్వక సుచేతన సూర్యదేవా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.