జైశ్రీరామ్.
1. నిషేధాక్షరి :-
భ, ర,ల,వ,శ,ష అక్షరాలు ఎక్కడా రాకుండా సరస్వతీ దేవిని సంబోధిస్తూ కంద పద్యంలో స్తుతించండి.
కం. బాసకు మాత మదంబయె ,
నే సంస్తుతి చేయ, జనని నిత్యానందం
బే సమధికముగనిడునుగ,
బాసించును మదముగ మది పండించు కృతిన్.
2. సమస్య:-
బంధంబున్ పెనవేసుకొంచు జగతిన్ బ్రఖ్యాతుఁడౌ యా ఫిరోజ్
గాంధీ చిత్తము గెల్వ నెంచి విలసత్ కల్యాణి యా యిందిరా
గాంధీ పాపిట దీసి దువ్వుకొనె రాగం బొప్ప కేశoబులన్,
సౌందర్యమ్మది మోమునన్ మనమునన్ చూపట్టుటొప్పున్ గదా.
3. దత్తపది:-
ఇదిగో! బీరముచూపుటొప్పు నని నీవేలా గనన్ నేరవో?
మది చింతింపగ రాదుధాత్రిపయి ధర్మం బీర నిల్పన్ వలెన్,
మదులన్ జిక్కుడు పంచకంబన మిమున్, మన్నించి చేయన్ దగున్,
మది మన్నించుట మాటలోర్చుటయును క్షేమంబౌనొ? చింతింపుమా.
4,వర్ణన :-
కుట్టు సూదిని సీసా పద్యంలో వర్ణించండి
ఆధునికతకిలననుపమ వస్త్రంబె సాటి లేనిది కన సంఘమందు,
అట్టి వస్త్రంబును కుట్టెడి సూదికి గలబెజ్జమింతె, తా కానరాదు,
ఆబెజ్జమందునామరిన్ దారమేవ్ పట్టుగా బట్టను పట్టి నిలుపు,
శస్త్రచికిత్సకున్ పట్టైఅ దారంబు కుట్టాఅ సూదియె గట్టిదిలను,
నూది కాలిలో ముల్లును సులభగతిని
తీయ నుపయోగపడుచు నమేయమైన
ముఖ్యమైనట్టి పనిముట్టు పూజకొఱకు
పూలుగ్రుచ్చుటకుది తగు,పూజ్యులార!
5. న్యస్తాక్షరి :-
1పాదం -13 - వి
2పాదం -14- ద్యా
3పాదం -7-దే
4పాదం - 3-వీ అనే అక్షరాలను ఉపయోగిస్తూ
మత్తేభ వృతంలో నేటి విద్యా వ్యవస్థ తీరు తెన్నులను వర్ణించoడి .
విద్యా వ్యవస్థ తీరు తెన్నులను వర్ణించoడి .
జయమార్గంబును వీడె బోధనము(౧౩)విశ్వాసంబు క్రోల్పోయె, నే
డయినన్ గానదునేర్వదీ ప్రభుత, వి(౧౪)ద్యాసంస్థలన్ బోధనన్
ప్రియమున్ గొల్పర(౭)దేలనో?శుభగతిన్, విశ్వాసమున్ గొల్పగా,
ప్రియ(౩)వీణావరపాణి సత్కృయె ప్రాప్తించంగ వాంఛించెదన్.
6. ఆశువు:
మొబైల్ ఫోన్ వ్యసనానికి గురైన యువత స్థితిని వర్ణిస్తూ ఒక పద్యాన్ని చెప్పండి
చరవాణీసమలంకృతాద్భుతకరుల్, చాంచల్యచిత్తుల్, ప్రవి
స్తర లోకజ్ఞులు, నిత్యభాషణచణుల్ తాదాత్మ్యతన్నైహికం
బరయంనేరని జాలవర్తనులు దాహంబైన కానంగలే
రరయంగావలెశ్రీహరీ యువతనీయాపన్నులన్ గావగన్.
2.ఆశావాద దృక్పథం గొప్పతనాన్ని వివరించండి
ఆశ గలవారలెపుడు నిరాశపడక
సాధనముచేయుచుందురు చక్కగాను,
భాషణంబునసౌమ్యులై వరలుచుండి
సిద్ధసంకల్పులగుదురు. చిత్రమిదియె.
శ్రమైక జీవన సౌందర్యాన్ని వివరించండి
పొందుడు శ్రమైక జీవన
సౌందర్యము సుజనులార! శాశ్వత సుఖులై
యుందురు సతతము భువిపయి,
నందంబది జీవికిల యనంతశుభదయై.
7.చిత్రానికి పద్యం:-
జీవనాధారమౌ వృక్ష మీవె నరుక
నీదు ఆత్మయే నిన్ను సమాధి చేయు,
వృక్షములు పెంచి కాంచుము వృద్ధి నీవు,
తప్పునెఱుగుచు మానుము, ముప్పు తప్పు.
8.అప్రస్తుతం:-
అందరూ పైకి రావాలి అని కోరుకునే వారెవరు ?
కొందరు మంచివారితో సంచైంచేవారు,
అశోకుడు అంటే ఓ రకంగా మూర్ఖుడు అని అర్థమా?
మూర్ఖుఁడు నిత్యశోకుఁడు, ఎవరిమీదో ఒకరిమీద అలా ఏడుస్తూనే ఉంటాడు.
అట్టి వాడు కాని వాడు అశోకుఁడు..
భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది.
వారి మాటల్లో ఆంతర్యమేమిటి"
పరిశుద్ధాత్మవై వడ్డించుదానా. అన్నాడు భర్త,
కోరినంత తినండి అంది భార్య.
సన్యాసికీ, సన్నాసికీ తేడా ఏమిటి?
సంసారంనుండి విడువడిన మనసు కలవాడు సన్యాసి,
సంసారంలోనే ఉంటూ విడువలేక నిత్యం బాధలు పడేవాడు సన్నాసి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.