గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).19వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

19. శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల నేకాంతమందునఁ గనెన్ 

శ్రీకారమే కృతుల కాకారమున్ గొలుప శ్రీ కావ్యముల్ వెలిసెగా. 

శ్రీకారమీవెయని యా కాళిదాసెఱిఁగి చేకొంచు నిన్ నిలిపెనే  

ఓ కాళికా! హృదయమేకాగ్రతన్ నిలుప నాకిమ్ము బాసను సతీ! 

భావము.

ఓ సతీ మాతా! మంగళస్వరూపుఁడయిన కాళిదాసు మహాకవి నీ 

మహత్తరమయిన కాంతులు మనసు ఉల్లసిల్లగా ఏకాంతములో మదిలో తాను 

చూచెను. శ్రీ కారమే తన రచనలకు ఆకారమును గొలుపగా 

మంగళప్రదమయిన కావ్యములు అతనిద్వారా వెలసినవి కదా. నీవే ఆ 

శ్రీకారమని, ఆ కాళిదాసు  గ్రహించి హృదయపూర్వకముగా స్వీకరించి నిన్ను 

నిలిపెను.  ఓ కాళికా మాతృ స్వరూపిణీ! హృదయము ఏకాగ్రమగు విధముగా 

చేసి, నాకు చక్కని భాషను ప్రసాదించుము తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.