గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).15వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజమునుల్లంబు పొంగ కనఁగన్ 

తల్లీ వరంబిడుమ, సల్లాపమందయిన కల్లల్ ప్రవర్తిలకనే 

యుల్లాసమున్ గొలిపి సల్లోచనంబులిడి యుల్లంబునన్ మెలఁగుచున్

ఫుల్లాబ్జ నేత్రవుగ ముల్లోకముల్ నడుపు తల్లీ కృపం గను సతీ!  

భావము.

ఓ సతీమాతా! వికసించిమపద్మనేత్రవుకదా ముల్లోకములనూ నడిపెడి 

తల్లివే కదా,  నేను అబద్ధమును చూడఁ జాలను, లోకమున ఎల్లప్పుడూ 

మనసుపొంగే విధముగా నిజమునే గ్రహించు విధముగా నాకు 

వరమొసగుమమ్మా.  సల్లాపములాడు సమయమునందైననూ సరే 

అబద్ధములు ప్రవర్తిల్లకుండునటుల చేసి ఉల్లాసమును నాకుఁ గొలిపి, 

మంచినే చూచునట్టి కనులను ప్రసాదించి, నా మనసులోనే నీవు ఉంటూ

నన్ను కృపతో చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.