గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

విద్యాదేవత ... సరస్వతీ సూక్తము .... భావము.

 జైశ్రీరామ్.

విద్యాదేవత

సరస్వతీ దేవి విద్యాధి దేవతగా ఆరాధింప బడుచుండుట అనాదిగా వచ్చిన 

సంప్రదాయము.  మానవజాతి ఉచ్చరించిన మొదటి వాజమ్యమగు 

ఋగ్వేదమునందే జ్యోతిర్మయమై, శబ్దమయమై, బహురూప సమన్వితమైన 

సరస్వతీదేవి దర్శనమిచ్చును. మొట్టమొదటగా సరస్వతిని దర్శించిన 

ప్రాచీన ఋషులు చేసిన సంకీర్తనములలో కొంత భాగము నేడు మనకు 

లభ్యమయిన ఋగ్వేద సంహితయందు ఋక్కుల రూపమున 

లభ్యమగుచున్నది.  ఈ ఋక్కులు భావగర్భితములు, మంత్రశక్తి సంపన్నములు.

స్వయం సంపూర్ణమైన మూర్తిని ప్రతిపాదించునవి కనుక ఋగ్వేదమందలి 

సరస్వతీ సూక్తమునకు గల ప్రాధాన్యమును గూర్చి వేరుగా నొక్కి చెప్పనక్కరలేదు.  

సరస్వతీ సూక్తపారాయణము సర్వవిద్యా ప్రదాయకమై మనోవాక్కాయ కర్మలను 

పవిత్రము చేసి భోగ మోక్షము లను ప్రసాదించును. మననుండి ఉచ్ఛ్వాస 

నిశ్వాసలు అప్రయత్నముగా నెట్లు వెలువడునో అట్లే కంఠధ్వనియు, 

దానిచే నిర్మితములయిన అకారాది క్షకారాంతము వర్ణములును వెలువడును. 

వాని యందు అంతర్వాహినిగా భావస్వరూపమై సరస్వతి ప్రవహించి ఉచ్ఛారణ 

రూపమునొందును. క్రమశిక్షణ, సంస్కారము,వాజ్మయ రూపమున నీమె 

నుపాసించువారి నోటివెంట శుభములే వెలువడును. శత్రుత్వము, విభేదము, 

రాగ ద్వేషాదులు కల్గించు వాక్కులు గాని, వానిని పుట్టించు భావములు కాని    

సంభవింపవు.  అంతర్వాహినిగా ప్రవహించి వచ్చుచున్న ఈ సరస్వతి వేగము 

ఊహ కతీతము. ఆమె నుపాసించువారి బుద్ధి వేగము కూడ నట్టిదే.

 కవుల వాక్కులలో అర్ధ తాత్పర్యములనబడు తీరములను బ్రద్దలు కొట్టుకొని 

ఈ నది పరవశయై ప్రవహించును.తామరతూళ్ళు తిన్న హంస కంఠధ్వనులు

(శ్వాసనుండి పుట్టిన కంఠధ్వనులు) ఈమె నుండి వెలువడును. 

బాహ్య ప్రపంచమున జీవుడు వాక్కుల రూపమున వ్యవహారము చేయును. 

వాని లోపల నియమ రూపమైన సరస్వతి గృహము నందున్న భార్యవలె 

కనపడకుండ దాగియుండిఅన్నిటిని సమకూర్చి పెట్టుచుండును. 

ఇందలి మంత్రములు ఋగ్వేద సంహిత లోనివి. మంత్రము చివరి అంకెలు 

ఋగ్వేద మందలి మండలము, సూక్తము,ఋక్కులను సూచించును.

సరస్వతీ సూక్తము

ఋగ్వేద మంత్రము.

అర్ధము

ఇయ మదదాత్ రభస మృణచ్యుతమ్

దివో దాసం వధ్ర్యశ్వాయ దాశుఅషే

యా శశ్వంత మా చఖాదావసం పణిమ్

తాతే దాత్రాణి తవిషా సరస్వతి

 ( 6-61-1)

వధ్ర్యశ్వునకు ఋణవిమోచనము కలిగించి దివోదాసుడను 

పుత్రుని ప్రసాదించినయీ సరస్వతి, శాశ్వమైన ఆయువునొసగి 

సంపన్నునిగాజేసినది. నీసామర్ధ్యము, నీ దానగుణము ఉదాత్తము 

( అట్టి నీకు నమస్కారము)

ఇయం శుష్మేభి ర్బిసఖాఇవారుజత్

సానుగిరీణాం తవిషేభిర్మిభి:

పారవతఘ్నీమనసేసువృక్తిభి: 

సరస్వతీమావివాసేమధీతిభి: (6-61-2)

గిరిసానువుల పైకినెగిరిన అలలతోఈ సరస్వతివేగమున ప్రవహించుచుండగా

తమ్మితూడులను దిన్న్ఝ్హ్ఝహంసల ఋతములు పుట్టుచున్నవి. 

కూలములనొరసికొని బ్రద్దళూ కొట్టగల వేగమున ప్రవహించు నీ 

సరస్వతి రూపమున వసింతుముగాక! బుద్దిబలము రూపమునమేము 

ఎడబాటులేక ఆమెయందు వసింతుముగాక. 

సరస్వతి దేవనిదో నిబర్హయ

ప్రజాంవిశ్వస్య వృసయస్యమాయిన:

ఉతక్షితిభ్యో ననీరనిందో

విష మే భ్యోఆస్రనో వాజినీవతి (6-61-3)

వేగవంతములైన ప్రవాహములు గలదానా! సర్వసతీ ! దేవతలను 

నిందించువారిని చీల్చుము. అసుర మాయల నుండి సర్వజీవులను 

రక్షింపుము. క్షీణదశనుండి నదులను కాపాడుము. మిట్టపల్లములనుండి  

జలములను కాపాడుము. 

ప్రణోదేవీ సరస్వతీ

వాజేభిర్వాజినీవతీ

ధీనామవిత్ర్యవతు  (6-61-4)

వేగవంతములైనప్రవాహములు యగు సరస్వతి మా బుద్దులను 

పరిపాలించునదియై, తనప్రవాహవేగములతో మ్ముకాపాడు గాక!

యస్త్యాదేవి సరస్వతి

ఉపబ్రూతే ధనేహితే

ఇంద్రం నవృత్ర తూర్యే (6-61-5)

ఓ సరస్వతీ! యుద్దమునవృత్రుని జయించిన ఇంద్రుని స్తుతించునో నిన్నెవడు 

స్తుతించునో అతనికి ధనము, హితము కలుగును

త్వందేవి సరస్వత్యనా

వాజేషు వాజిని

రదా పూషేన: సనిమ్ ( 6-61-6)

ఓ సరస్వతీ! వేగవంతులైనదేవతల సృష్టిలో నీవు వేగముయెక్క

స్వరూపము గలదానవు. అట్టి నీవు మమ్ము రక్షింపుము. పూష అను దేవతను 

స్తోత్రము చేసిన ఫలితమువలె మాకు పంటిక్రిందికి నిలుచున్నట్టి  

ఆహారమును ( మంచి యుచ్చారణతో వాజ్మయ స్వరూపమగు జ్ఞానమును ) 

దానము చేయుము.

ఉతస్యాన: సరస్వతిఘోరా హిరణ్యవర్తిని:

వృత్రఘ్నీవష్టి సుష్టుతిమ్ (6-61-7)


కిరణమయములైన అంచులు కలిగి ప్రవర్తించు చున్న సరస్వతి రూపము 

వృత్రాసురుని వధకై ఏర్పడినది.  అట్టి ఘోర రూపము స్తుతిపాత్రమై 

వసించును గాక!

8. యస్యా అనంతో అహృతస్తు

ఏష శ్చరిష్ణు రర్ణవ: |

అమశ్చరతి రోరువత్ ||ఋ 6-61-8

ఏ సరస్వతి యొక్క అనంతమైన సముద్రాకృతి అపహరింప వలనుపడదో; 

మహారావము చేయుచు మాయందు సహవసించి చరించు చున్నదో 

అట్టి తత్త్వము మమ్ము రక్షించుగాక!

సానో విశ్వా అతిద్విష:

స్వ సౄరన్యా ఋతావరీ

అతన్న హేవ సూర్య: ||  ఋ 6-61-9

విశ్వమున ద్వేషించువారిని జయించి, వారి సోదరీ గణమైన స్వేచ్ఛాప్రవృత్తి గల 

స్వైరిణులను గూడ తిరస్కరించి, అన్యులను అతిక్రమించి ఋతముచేత 

ఆవరింపబడినదై మించును గాక: అహస్సును సూర్యుడతిక్రమించువట్లు 

అతిక్రమించును గాక!

ఉత న: ప్రియా ప్రియాసు

సప్త స్వసాసు జుష్టా

సరస్వతీ స్తోభ్యాభూత్ ||   6-61-10

ఏడుగురు సోదరీమణులతో కూడినది, నిత్య సంతోష స్వరూపిణి, 

మాకు ప్రియులైన దేవతలలో ప్రియతమమైనది యగు సరస్వతి 

ముక్తకంఠములైన మా కీర్తనములకు లక్ష్యమగు గాక!

ఆ పప్రుషీ పార్థివాని

ఉరు రజో అంతరిక్షమ్

సరస్వతీ నిదస్పాతు  ||ఋ6-61-11

సరస్వతి సర్వాంతర్యామి భావమై పూరణము చేయుచున్నది కనుక, 

నిందలనుండి అనగానిందలు జేయు స్వభావము నుండి ఎల్లరను రక్షించి 

మంచి వాక్కుగా వెలువడుగాక

త్రిషధస్థా సప్త ధాతు:

పంచ జాతా వర్ధయంతీ

వాజే వాజే హవ్యాభూత్ ||  6-61-12

మూడు నివాసముల యందున్నదియు, ఏడుగురు బ్రహ్మలకు 

ఐదు జాతుల రూపమున నుద్భవించుచున్నదియు నగు సరస్వతి 

వేగమునకొక్క హవిస్సు రూపమున వర్ధిల్ల జేయునది అగుగాక ! 

దేవీం వాచ మజనయంత దేవా: తాం

విశ్వరూపా: పశవో వదంతి |

సానో మంద్రేష మూర్జం దుహానా ధేను:

వాగస్మానుప సుష్టు తైతు ||  8-100-11

దేవతలు దేవియగు వాక్కును పుట్టించిరి.  విశ్వరూపులైన జీవులు ఆమెను 

ఉచ్చరించుచున్నారు.  మాలో అంతర్లీనమైన కుతూహల స్వరూపమై యుండి 

పాడియావు వలెనిలిచి యున్న ఈ వాక్కు తన్ను చేరనిచ్చి మాచే స్తుతింపబడినదై 

ఆత్మ శక్తిగా మమ్ములను పొందుగాక !

చత్వారి వాక్పరిమితా పదాని

తాని విదుర్బ్రాహ్మణా యే మనీషిణ: |

గుహా త్రీణి విహితా నేంగయంతి

తురీయం వాచో మనుష్యా వదంతి || ఋ 1-164-45

మన వాక్కునకు గల పదములన్నియు నాల్గు విధములుగ నున్నవి.  

అందు మూడు గుహయందుంచబడినవై కదలిరావు.  నాల్గవరూపము అగు 

వాక్కునుమనష్యులు పలుకుచున్నారు. ఎవ్వరీ నాల్గు వాక్కులను తెలియుదురో 

వారే వేదమను ప్రజ్ఞగల బ్రాహ్మణు లనబడుదురు.

ఉతత్వ:  పశ్యన్ న దదర్శ వాచమ్

ఉతత్వ: శృణ్వన్ న శృణోతి ఏనామ్ |

ఉతోత్వస్మై తన్వం విసస్రే

జాయేవ పత్యు: ఉశతీ సువాసా: ||    ఋ 10-71-4

మానవుడు ఈ వాక్కు అను దేవతను చూచుచునే దర్శనము చేయడు. 

వినుచునే ఈమెను వినడు. ఐనను, వానియందు వినుచు, వానియందు వినబడుచు

చక్కని నివాసమందు మంచి భార్యవలె నీమె వానియందు ప్రవేశించి యున్నది.

అంబీతమే నదీతమే దేవితమే సరస్వతి |

అప్రశస్తా ఇవ శ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృధి ||   ఋ 2-41-16

సరస్వతీ! నీవు ఉత్తమమైన మాతృదేవతవు; నదులలో శ్రేష్ఠమైన దానవు; 

దేవతలలో ఉత్తమురాలవు; నీవప్రకాశమూర్తివలె నున్నావు. ఐనను

మాకు ప్రశస్తిని కలుగజేయుము.

పావకా న: సరస్వతీ

వాజేభిర్వాజినీవతీ

యజ్ఞం వష్టు ధియావసు: ||ఋ   1-3-10

ఓ సరస్వతీ!  నీవు పవిత్రము చేయగల స్వభావము గలదానవు.  

వేగవంతములలో వేగస్వరూపమై దాగియున్న శక్తిని, బుద్ధి బలము చేత

నిర్వహింప బడినదై నీ స్వరూపము సంపత్కరమై మా యజ్ఞమునందు 

వసించి యుండును గాక!

ఆనో దివో బృహత: పర్వతా దా

సరస్వతీ యజతాగంతు యజ్ఞమ్ |

హవం దేవీ జుజుషాణా ఘృతాచీ

శగ్మాంనో వాచముశతీ శృణోతు ||     ఋ  5-43-11

మా యజ్ఞమున స్తుతింపదగిన దేవియగు సరస్వతి వెలుగుల లోకమునుండి 

దిగివచ్చును గాక! ఎత్తైనపర్వతము నుండి దిగివచ్చును గాక! దిగివచ్చుటకై 

నా పిలుపును అనుసరించినదై, నేతిచే పదను చూపినదై, సుఖకరమైన 

నా వాక్కు నందు వసించుచు ఈ వాక్కును వినుగాక!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.