గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 4వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

4. ఓం మహాబలాయ నమః.                                                                                                                                        

అతివినయ వృత్త గర్భ సీసము.

హరివి నినుఁ గనిన తరిని నను నిలుపు - మయ నృహరీ! కాంచుమయ్య నన్ను.

వరద! ప్రణతులయ, పరమపథ వర - లమునిడుమా! నాదు లక్ష్యమరసి.

తలప ఘనము కద ధరను గన, ఘనుఁడ - నిను మదిలోనుంచి నిత్యముగను.   

సరిగఁ గనఁబడుమ కరుణఁ గని, కనుల - కును. ప్రవరాత్మలోతున వసించు.  

గీకనక కశిపునిఁ గరుణించి కనుచు పరమ - పదము నిడిన  *మహాబలా *! ప్రణుతిఁ గొనుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

4 సీస గర్భస్థ అతివినయ వృత్తము. ( .. యతి 11)

నినుఁ గనిన తరిని నను నిలుపుమయ నృహరీ

ప్రణతులయ పరమపథ వర ఫలమునిడుమా!

ఘనము కద ధరను కన ఘనుఁడ నిను మదిలో.

కనఁబడుమ కరుణఁ గని, కనులకును ప్రవరా!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహాబలా! నీవు మా శ్రీహరివి. నిన్ను నేను చూచు

సమయమున నీ యందు నన్ను నిలిపి, నన్ను చూడుము. ఓ వరదుఁడా! నీకు నమస్కారములు. నా యొక్క లక్ష్యమును

తెలుసుకొని, పరమపదమనెడి శ్రేష్ఠమైన ఫలితమును నాకు ప్రసాదించుము ఘనుఁడా ఆలోచింపఁగా మానవులు

నిన్ను ఎల్లప్పుడు మనసులో నిలిపి భూమిపై నిన్ను చూచుట గొప్పయేకదా! హిరణ్యకశిపుని కరుణించి చూచి అతనికి

పరమ పదమును ప్రాప్తింప చేసితివి. నా నమస్కారములు స్వీకరింపుము!   గొప్ప శ్రేష్ఠుఁడా! నన్ను కరుణతో చూచి, నా

కనులకు సరిగా కనిపించుము. నాహృదయపులోతులలో నీవు నివసించుము.  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.