గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 47వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

47. కాత్యాయనీ జనని సత్యస్వరూపిణివి, నిత్యంబు నిన్నుఁ గొలుతున్.

సత్య స్వరూపముగ నిత్యంబు నేఁ గను మహౌన్నత్య భావ కలితా! 

ముత్యాల జల్లులటు స్తుత్యంబులౌ పదము లత్యంత ప్రేమనిడుమా. 

గత్యంతరంబగుచు స్వాస్త్యంబునీయ  నిలు, సత్యా! హృదిన్ శుభ సతీ! 

భావము.

శుభ కరమయిన సత్యా!  ఓ సతీ మాతా! ఓ కాత్యాయనీ మాతా! నీవు సత్యమే 

స్వరూపముగా కలదానవు. నిన్నెల్లప్పుడూ నేను సేవింతునమ్మా. సత్యము 

యొక్క స్వరూపముగా నిత్యమూ నేను చూచెడి గొప్ప భావముతో కూడుకొనిన 

దాని వమ్మా. సత్యముయొక్క స్వరూపమును కనఁబరచు పదములను 

ముత్యాల జల్లులనునట్లుగా నాకు ప్రేమతోనొసగుమమ్మా. నీవే నాకు 

గత్యంతర మగుచు నాకు స్వాస్త్యమును ఇచ్చుటకై నా హృదయములో 

స్థిరముగా ఉండుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.