గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 16వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

16. ఓం చక్రిణే నమః.

శార్దూల వృత్త గర్భ సీసము.

పగ వాని ప్రార్థన భారమంచనకనే - ప్రహ్లాదు రక్షింపవా మహాత్మ!

యిల మానప్రాణములెల్లఁ గాచితివిగా! - మాన్యుండ! రక్షింపుమా ధరిత్రి.

మది జ్ఞాన శ్రేయ సుమాధురుల్ గొలుపుచున్ - గర్తవ్యమున్ జూపఁ గామ్యదాత!

శ్రితమౌని ప్రార్థిత శ్రీయుతుండ! కనుమా - మమ్మున్, మదిన్ నిల్పుమా ముకుంద!

గీ. వక్రతను బాపు *చక్రి*! ప్రవర్తనమున - సత్య జీవనగతినిమ్ము శాశ్వతముగ.   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

16 సీస గర్భస్థ శార్దూల వృత్తము. ( .. యతి 13) 

వాని ప్రార్థన భారమంచనకనే ప్రహ్లాదు రక్షింపవా!

మానప్రాణములెల్లఁ గాచితివిగా! మాన్యుండ! రక్షింపుమా.

జ్ఞాన శ్రేయ సుమాధురుల్ గొలుపుచున్ గర్తవ్యమున్ జూపఁగా,

మౌని ప్రార్థిత శ్రీయుతుండ! కనుమా మమ్మున్, మదిన్ నిల్పుమా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పగతురకు సంబంధించిన వాని ప్రార్థన బరువని పలుకక

ప్రహ్లాదుని రక్షించితివి కదా. భూమిపై వాని మానప్రాణములను రక్షించితివి.కదా. మాన్యుడా! కామితములనొసగువాడా!

మనసులలో జ్ఞానము శ్రేయము సుమాధురిని కల్పించి కర్తవ్యమును చూపుచు భూమిని కాపాడుము.

ఆశ్రయింపఁబడిన మునులచే ప్రార్థింపబడు లక్ష్మీ సమన్వితుఁడా! ముకుందా. మమ్ములను కనుము. నీ మదిలో

నిలుపుము. చక్రీ! మా ప్రవర్తనలో వంకరను పోఁగొట్టుము. సత్యమైన జీవన గతిని శాశ్వతముగా మాకిమ్ము

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.