గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).1వపద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్

అష్టోత్తరశత సతీ అశ్వధాటి

(సతీ శతకము).

రచనచింతా రామకృష్ణారావు.

1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ శక్తినెన్నుచు సదా.

ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే.

నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము మిగులన్,

ఆశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ!

భావము.

సతీమాతా! సద్గుణు లయిన మహాత్ములు ఎల్లప్పుడూ నీ శక్తిని గుర్తించుచు

నీ కృపకై ఆశించుచూ ఉందురమ్మా. జ్ఞానపూర్ణుడయిన శివునికి ఆశ

గొలుపు చున్నదాని వయి నీ యొక్క శక్తినే ఆ పరమేశ్వరునిలో

కలుగుచేసితివికదా తల్లీ! నీలో గల శక్తిని ప్రశంసించుటకు నాకు ఉన్న శక్తి

చాలదు కదా మాతా. కావున మిక్కిలిగా నాకు ధీశక్తిని ప్రసాదించుమమ్మా.

దిగంతముల వరకు ప్రకాశించు నీ ధీశక్తిని కొంచెమయినను చూచుదును. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.