గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2024, గురువారం

వేపి నచ్చిక - శ్రీ కవితా ప్రసాద్, రాజమహేంద్రవరము.

జైశ్రీరామ్. 

 ఇటీవల కర్ణాటకలోని బెలగావిలో యజమానితో తీర్ధయాత్రకు వెళ్లి ఓ కుక్క అక్కడ తప్పిపోయి పదిరోజుల అనంతరం 250 కి॥మీ ప్రయాణించి మళ్లీ యజమాని ఇంటికి చేరిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కకు విశ్వాసమే కాదు.. ప్రేమకూడా ఉంటుందని తెలిపే ఆ సంఘటనపై ప్రముఖ కవిపండితులు శ్రీకవితా ప్రసాద్ గారి స్పందన ఇది. 

వేపి నచ్చిక - కవితా ప్రసాద్, రాజమహేంద్రవరము.

మ.  కమలేశాఖ్యుఁ డొకండు పండరిపురిన్ గాఢంపు భక్త్యాత్ముఁడై

క్రమముం దప్పక తీర్థసేవకయి సాగన్ వాడుకయ్యెన్! ప్రమో

ద మనస్కుండయి యేగెనీ సమను శ్రద్ధావంతుఁడై సారమే

యమునుం బెంపుడు దాని వెంటఁగొని బోదత్యంతమై యెడ్దనున్! 1


మ.  శునకం బత్తొగఁ బండరీపురమునుం ౙూడంగ వెన్వెంటఁ బో

యెను దోడ్తో యజమానికిన్! కటకటా! యెట్లో విడెన్ దారినిన్!

కనిపెట్టంగను లేక యెంతయును దా గాలించియున్ దుఃఖమున్

దనలోలో బిగ పట్టి చేరె నతఁడున్ దైన్యంబుతోఁ గొంపకున్!  2


ఉ.  ఇంతటి పిల్లఁదెచ్చి మన యింటిని పిల్లల మాడ్కిఁ బెంచితిన్!

సుంతయు ధ్యాస తప్పె నది ౘూడ్కికి దూరము వోయెనెట్టులో!

నంతయుఁ గ్రొత్తౘోటు గద! యౘ్చట నాఁకలి యెట్లు దీరునో!

జంతువు! నోరులేదెటుల సాగునొ దానికి జీవనంబికన్!

అంతటి దూరమేనును బ్రయాణమునం గొని పోవనేలకో?

చింత వడంగసాగెను విశేషముగా యజమాని బెంగతో! 3


ఉ.  దగ్గర దాపు కాదె యది దారిని నెవ్విధి గుర్తు పట్టెనో!

తగ్గని పూన్కితోడను శతద్వయమయ్యెడు మైళ్ళ దూరమున్

లగ్గుగఁ జేసి పైనమును లక్ష్యమునున్ యజమానిఁ జేరుటన్

నెగ్గె భళా! యిదబ్బురము నెచ్చెలికార మదెంత గొప్పదో! 4


ఉ.  ఎంతయు సంభ్రమంబు కమలేశున కయ్యెను వాల మూపుౘున్

జెంతకు భౌ భవంౘు దరిఁ జేరిన పెంపుడు కుక్కఁ ౙూడఁగా

స్వాంతము! నాస్తిపాస్తులను పంౘుక సేమము ౘూడనట్టి దు

స్సంతతి కంటె మేలుగద శ్వానము మాటలు రానిదయ్యునున్! 5


ఉ.  ధర్మజు వెంటనంటిన కృతజ్ఞముఁ ౙూచి మహాప్రయాణమం

దర్మిలిఁ, దాను వేఁడెఁగ నగారిని నా శునకంబుఁ తోడుతన్

సర్మముఁ జేర నొప్పఁగను! సామ్యము విశ్వస నీయతం గనన్

చర్మపు ధారులందున భషమ్మున కేదియు లేదు  కావుటన్! 6

చూచారా ఎంతహృద్యంగా భావాన్ని పద్యంరూపంలోచెప్పారో.

ప్రజాపత్రిక(98480 96374)నుండి ఈ కవిత సేకరింపఁబడింది.

కవికి, ప్రజాపత్రికకు కృతజ్ణతలు. 

జైహింద్.

Print this post

1 comments:

కవితా ప్రసాద్ చెప్పారు...

🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.