గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 15వ శ్లోకం. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 

జైశ్రీరామ్.

శ్లోశాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా

సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ 15  

110. ఓం *శాఙ్కర్యై* నమః

నామ వివరణ.

శంకరుని అర్థాంగి మన అమ్మ.

తే.గీ*శాంకరీ! * నీదు కృపచేత శంక లుడిగి 

నిత్య సంస్కారమున్ గల్గి నేను సతము

వెలుగు నట్లుగ చేయు నావేల్పు వీవె,

వందనంబులు చేసెద నందుకొనుము.

111. ఓం *వైష్ణవ్యై* నమః

నామ వివరణ.

విష్ణు సంబంధమయిన తల్లి మన అమ్మ వైష్ణవి.

తే.గీ*వైష్ణవీ! * నీవె నాయింట వరలుమమ్మ,

నిన్ను సేవించు భాగ్యమున్ నేను గనుదు,

కన్నవారికి సంతస కారణమగు

నన్ను నమ్మిన వారికిన్ మన్నననిడు.

112. ఓం *బ్రాహ్మ్యై* నమః

నామ వివరణ.

భ్రహ్మ యొక్క అంశతో నొప్పారు జ్న్ని మన అమ్మ.

కం*బ్రాహ్మీ!* నీ కృప కలిగిన

బ్రహ్మయు తల వ్రాత మార్చి బ్రతుకఁగఁ జేయున్,

బ్రహ్మోపదేశమప్పుడు

బ్రాహ్మణులే నిన్నుఁ జూపి వర్ధిలఁ గనిరే.

113. ఓం *సర్వదేవనమస్కృతా*యై నమః

నామ వివరణ.

అందరు దేవతలచేత నమస్కరింపబడు తల్లి.

తే.గీ*సర్వ దేవ నమస్కృతా! * సహజ సుగుణ

భాసితులనిలఁ గావుమావరలఁ జేయ,

దుష్ట దుర్మార్గవర్తులన్ దునిమి, ధర్మ

రక్షణంబును జేయుమా, ప్రస్తుతింతు.

ఓం *తస్మై* నమః.

నామ వివరణ.

కంవందనమందుమ *తస్మై!*

సుందర సుకుమార గాత్ర! సుజనోద్భాసా!

మందస్మితమున సృష్టికి

విందగు దైవముగ నుండి, ప్రీతిఁ గనెదవే.

114. ఓం *సేవ్య దుర్గా*యై నమః.

నామ వివరణ.

సేవింపఁబడు దుర్గమమయిన తల్లి మన అమ్మ.

తే.గీ. *సేవ్య దుర్గా!* మహాదేవి! చిత్తమందు

నాకు నీవుండుమోయమ్మ! శ్రీకరముగ,

సేవలందింతు మదిని సద్భావపూర్ణ!

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *దుర్గాసేవ్యా*యై నమః

నామ వివరణ.

సేవించుచున్న దుర్గ కలది మన అమ్మ.

కం*దుర్గాసేవ్యా!* ఖలు సం

సర్గంబులు పాపుమమ్మసదయను గనుచున్,

దుర్గతి పాపుదు వీవే

మార్గము నీవే సుగతికి మహిత గుణాఢ్యా!.

115. ఓం *కుబేరాక్ష్యై* నమః

నామ వివరణ.

కేవలం తన చూపుతో మనిషిని ధనవంతులను చేయగల తల్లి మన అమ్మ.

తే.గీ.   *కుబేరాక్షి*నీ చూపు లొంద లేక

పేదలై జనులిద్ధరన్ వెతలఁ దేల

నీవు చూడకయుండుట నీకు తగదు,

పేదవారిని కరుణించి యాదుకొనుము.

116. ఓం *కరవీరనివాసిన్యై* నమః

నామ వివరణ.

గన్నేరు పూలను నివాసముగా కలది మన అమ్మ.

కంశుభ *కరవీర నివాసిని!*

యభయము నీ వలన నాకు, ననుపమ వరదా!

శుభ సంహతి చేకూర్చుచు

నభిమానులఁ గావుమీ వహర్నిశలందున్.


జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.