గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 99 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

నిను సేవించెడివాఁడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,

ఘనుఁడౌ బ్రహ్మకు, పద్మగర్భునకుఁ, గాకన్నీర్ష్యచేఁ గొల్పు, తా

తనువున్ దీప్తిని గల్గి యా రతిపునీతన్ మార్చు, నిస్సారమౌ

తనువున్ వీడి నిరంతముక్తిని గొనున్ తా సాంబునే దల్చుచున్. 99

భావము.
అమ్మా భగవతీ ! నిన్ను ఉపాసించేవారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను) లక్ష్మీదేవినీ ( సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు .రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని , జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.