గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 14వ శ్లోకం. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

జైశ్రీరామ్.

శ్లోసహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ

గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా 14

103. ఓం *సహస్రాదిత్యసఙ్కాశా*యై నమః

నామ వివరణ.

వేయిమంది సూర్యులతో సమానమయిన ప్రభాపూర్ణ మన లక్ష్మీమాత.

అరిషడ్వర్గమునే యడంచెడి  *సహస్రాదిత్య సంకాశ!* నీ

సరియెవ్వారలు భక్త రక్షణమునన్ సారస్వతోద్భాసితా!

పరమేశాని నినున్ మదిన్ సతతమున్ బ్రార్థించువాడన్, ననున్

దరిచేర్చంగను చాలుదీవె కృపతో ధాత్రిన్ ననున్ బ్రోవుమా.

104  ఓం *చన్ద్రికా*యై నమః

నామ వివరణ.

చల్లని ప్రకాశమగు వెన్నెల ఏది కలదో అది మన అమ్మయే.

చలువల్ పంచెడి *చన్ద్రికా!* హరి నుతా! సంస్కార సత్ సంపదన్

గలుగన్ జూడుము నాకు నెప్పుడును, రాకాచంద్ర సంకాశ! నీ

తలపే పాప నివారణంబు కనగన్, ధర్మార్థసంసిద్ధికై

తలతున్ నిన్ సతతంబు, కావుము కృపన్ ధైర్యప్రదా! సన్నుతుల్.

105. ఓం *చన్ద్రరూపిణ్యై* నమః

నామ వివరణ.

చంద్రుని యొక్క రూపము ఏది కలదో అది అమ్మయే, చంద్రుని రూపమున

ఉన్న తల్లి మన అమ్మ.

తే.గీ.  *చన్ద్ర రూపిణీ!* నీ ముఖ చంద్రబింబ

మునకు దాసోహమను హరి ముద్దుగాను,

బంధనములకు లోనైతి పాప గతుల

నుంటిఁ గాపాడుమా నమ్మియుంటి నిన్ను.

106. ఓం *గాయత్ర్యై* నమః

నామ వివరణ.

సాధకులచే గానము చేయఁబడుచు రక్షించఉ జనని  మన అమ్మ గాయత్ర్రీ

స్వరూపిణి.

శా.  *గాయత్రీ!* పరదేవతా! భగవతీ! కల్యాణ సంపత్కరీ!

శ్రేయోదాయక సత్యమార్గ ముననే చిత్తంబు నే నిల్పుచున్

మాయామోహములన్ విడన్ గొలిచెదన్ మాన్యా! నినున్ నిత్యమున్,

నా యజ్ఞానము పారద్రోలుచు కృపన్ నన్ గావుమా నిత్యమున్.

కం.  *గాయత్రీ!* జపియించెద

శ్రేయంబును బొందఁ గోరి శ్రీకరమౌ నా

మాయను బాపెడి మంత్రము,

నాయజ్ఞానమును బాపి నను గావుమిలన్.

107. ఓం *సోమసమ్భూత్యై* నమః

నామ వివరణ.

సోమునిఫాలమున ధరించిన జ్ఞానిచంద్రమండల మధ్యస్థ అమ్మ. ఉమా పరమేశ్వరుల వలన సంభూతమయిన జనని.

తే.గీ*సోమ సమ్భూతి!* వర సతీ! శుభ నిధాన!

ప్రేమతో నిన్నుఁ గొలువనీ విశ్వవేద్య!

చంద్రవంకను దాల్చిన చక్కనమ్మ!

వందనంబులు చేసెద నందుకొనుము.

తే.గీ.  *సోమ సమ్భూతి!* నాపైన బ్రేమ జూపి

నీ సహస్రనామావళిన్ నేర్పు మీర

వ్రాయఁజేసెదవోయమ్మ పద్యములను.

వందనంబులు చేసెద నందుకొనుము.

108. ఓం *సావిత్ర్యై* నమః

నామ వివరణ.

సవితుని ప్రకాశముతో విరాజిల్లు తల్లి సావిత్రి.

శా. *సావిత్రీ! * కరుణామయీ! శుభనిధీ! శాంతిన్ బ్రసాదించుమా,

సేవాభావము నీపయిన్ గొలుపుమా, చిద్భాసవై వెల్గుమా,

నీవాడన్, సుతుడన్, దయాన్వితవు, నిన్నే గొల్చు నన్ గావుమా,

భావావేశముతోడ పద్యముల నిన్ వర్ణింపఁగాఁ జేయుమా.

109. ఓం *ప్రణవాత్మికా*యై నమః

నామ వివరణ.

ప్రణవమునే ఆత్మగా కలది మన అమ్మ.

శాసేవింతున్ *బ్రణవాత్మికా* సతతమున్ సిద్ధిన్ గనన్ నిన్ను నేన్,

భావంబందున నిల్చియుండుమ కృపన్ పద్యాళిలోఁ బ్రేమతో,

జీవాత్మన్ బరమాత్మలోన కలుపన్ సిద్ధంబుగానుంటి సద్

భావంబున్ వరసేవనా కుశలతన్ వర్ధిల్లనిమ్మా భువిన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.