గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 19వ శ్లోకం. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోసర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ   

వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా 19

136. ఓం *సర్వతీర్థస్థితా* యై నమః

నామ వివరణ.

అన్ని తీర్థములయందూ ఉండునట్టితల్లి.

తే.గీ.  *సర్వ తీర్థ స్థితా!* నేను  చక్కగ నిను

మనసులో కనినంత సమస్త తీర్థ

సేవనా ఫలమొదవును చిత్రమిదియె,

నిన్ను భావింపనిమ్మింక సన్నుతముగ.

137. ఓం* శుద్ధా*యై నమః

నామ వివరణ.

అత్యంత శుద్ధముగానుండు జనని మన అమ్మ.

కం.  *శుద్ధా!* భక్తి సమృద్ధిని,

శ్రద్ధను నీపైన నాకు  చక్కగ నిపుడే,

రాద్ధాంతము చేయక నా

బుద్ధిని కరుణించి నిలుపుప్రోచుట కొఱకై.

138. ఓం *సర్వపర్వతవాసిన్యై* నమః

నామ వివరణ.

సమస్తమగు పర్వతములపైననూ వసించు లోకమాత.మత్తకోకిల.

.కో.  *సర్వపర్వత వాసినీ!* నిను చక్కగా మది నిల్పనా?

గర్వహీనుఁడనమ్మ! నన్నిఁక కాంచవచ్చును చక్కగా

నిర్వివాదము నీ కృపామతి, నీవె నన్నిఁక కాంచుమా,

సర్వరక్షణ భారవాహిని! సన్నుతింతును  నీదయన్.

139. ఓం *వేద శాస్త్రప్రభా*(దేవ్యై)యై నమః

నామ వివరణ.

వేదప్రకాశ స్వరూపిణి యగు దేవి లోకమాత.

తే.గీ.  *వేద శాస్త్రప్రభా!* దేవి! విశ్వ వేద్య!

నీదు ప్రభలతో కవితలన్ నిండనిమ్ము,

నీదు ప్రభలను వర్ణింప నేను జాల,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *వేదశాస్త్రప్రమాణ్యై* నమః

తే.గీవేద శాస్త్ర ప్రమాణిగా విదితమీవు

*వేద శాస్త్రప్రమాణి!*  నిన్ బోధఁ గలిగి ,

సాధనము చేయ లభియించు చక్కగాను

నీదు దర్శన భాగ్యమ్ము, నిశ్చయముగ.

ఓం *దేవ్యై* నమః.

తే.గీ.  *దేవి!* నీ పాద సన్నిధిన్ దివ్యమయిన

భావనంబులు పొందుచు భవ్యమైన

కావ్యకర్తగా నగుదును కరుణఁ జూపి

నీవె కావ్యమై వెల్గుమా, నీరజాక్షి!

140. ఓం *షడఙ్గాదిపదక్రమా*యై నమః

నామ వివరణ.

శిక్ష, నిరుక్తి, ఛందస్సు, జ్యోతిషము, వ్యాకరణము, కల్పకము, అను

షడంగములను క్రోడీకరించు జనని.

. వేద పవిత్ర తేజ! సుమపేశల సన్నుత దేహవౌ *షడ

ఙ్గాదిపదక్రమా!* శరణు, కంజదళాయత నేత్ర! యీ షడ

ఙ్గాదిపదక్రమం బెఱుఁగ, కాంచగ నేర షడంగ సారమౌ

నీదగు దివ్య తేజమును, నీవె కనంబడు చిత్త భాసివై.


జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.