గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 15 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీశరదిందు చంద్రికల్ సరితూగనంతటి నిర్మలదేహంపు నెలతవీవు,

పిల్ల జాబిలి తోడనల్లమెలతలొందు నుతకిరీటమునొప్పు యతివవీవు,

కోరికల్ తీర్చెడి తీరైన వరముద్ర,భయమును బాపు నభయపు ముద్ర,

స్పటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి

తే.గీయొప్పు నీకు వందనములు గొప్పగాను

చేయు సుజ్జనులకునబ్బు శ్రీకరముగ

మధువు, గోక్షీర, ఫలరస మాధురులను

మించు వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. 15 ॥ 

భావము.

అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు, పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు, స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.