ఓం నమశ్శివాయ.
శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి
అక్కయ్య
నాలుగు రోజుల క్రితమే నాతో మాటాడారు. నాపద్యాలను ప్రశంసిస్తూ నాలో కవితోత్తేజాన్ని పెంపొందింపచేసేవారు. ఆ మధ్య నేను విశాఖపట్టణం వెళ్ళితే అది తెలిసి నాకు ఫోన్ చేసి ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి మిత్రులందరినీ అక్కడికి చేర్చి నన్నెంతగానో ఆదరించి నేను మరువలేనంతటి ఆప్యాయత చూపించారు. అట్టి అక్కయ్య నిన్న రాత్రి రెండు గంటలకు కీర్తిశేషులయ్యారనే వార్త హృదయానికి అశనిపాతమైంది. ఇంతవరకు మనముందున్న అక్కయ్య ఇంక లేరన్న సత్యాన్ని మనస్సు అంగీకరించటం లేదు. ఐనా ఆ పరమాత్మ చిత్తం.శారదామాత పాదాలచెంతకు వాడని పుష్పంగా చేరిపోయారు.
శివశివా! యేమి యీ దుస్స్థితి,
చం. మనసది వెన్న, మాటలవి మార్దవపూర్ణము, కన్నెపల్లికిన్,
వినయవిధేయతల్ ఘనము, పిన్నలనైనను గౌరవించు, వే
దనలను మానసంబుననె తాను భరించుచు సంతసంబునే
ఘనముగఁ బంచునందరికి, కాలుని పాలికి నెట్లుపోయెనో?
చం. చనితి విశాఖపట్టణము, సన్నుతయౌ వరలక్ష్మి యక్కయే
చనువుగ తమ్ముఁడా యనుచు, స్వాగతవాక్యము పల్కి రమ్మనన్,
జనితిని వారి సన్నిధికి, చక్కగ నన్ను ప్రసాదుగారిదౌ
ఘనమగునింటిలోపలికి గౌరవమొప్పగ చేరఁజేసిరే.
ఉ. స్నేహితులందరిన్ బిలిచి చేర్చిరి యచ్చటి కప్పుడే సము
త్సాహముతోడ, భోజనము సన్నుతరీతిని బెట్టెనక్కయే,
మోహవిదూర, సత్కవనపుష్పములన్ ననునింపె నాడు, సం
దేహములున్న తీర్చెడిది, దేవునివద్దకు నెట్లువోయెనో?
మ. కృతులన్ బెక్కు రచించె, సన్నిహితులన్ గూర్మిన్ మదిన్ నిల్పె, సం
స్తుతయై సజ్జనపాళిచే, బిరుదులన్ శోభాయమానంబుగా
కృతులన్ జేసిన గుర్తుగా గొనిరి, తత్ కీర్తిన్ దిశల్ నింపిరే,
నుతయౌ శ్రీవరలక్ష్మి సోదరిని నేనున్ గొల్తు శ్రద్ధాంజలిన్.
శా. నన్నున్, దమ్ముఁడ! యెట్టులుంటివి? సతిన్ సాధ్విన్ మదిన్ దల్పుచున్
గన్నుల్ నీటిని నింపుటాపి బ్రతుకన్ గాంక్షింపుమా, యంచు నా
కెన్నోమాటలు చెప్పుచున్ గడకు తా నేగెన్ హరిన్ జేరగన్,
కన్నేపల్లి సహోదరీమణికి నా కన్నీటి వీడ్కోలిదే.😢🙏🏼
వరలక్ష్మి అక్కయ్యకు శ్రద్ధాంజలి ఘటిస్తూ
చింతా రామకృష్ణారావు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియఁజేసుకొనుచున్నాను. శివశివా.😢
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.