గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2024, బుధవారం

కవి శిఖామణి చింతా రామకృష్ణారావు గారికి కవికల్పభూజ బిరుదు ప్రదానము సందర్భముగా పంచ పద్యసుమాలు .. డా. నలవోలు నరసింహా రెడ్డి

జైశ్రీరామ్.

 జాతీయ తెలుగు సాహితీ పీఠము …

     తేనియల్ చిందు నా భాష తెలుగుభాష
            డా. నలవోలు నరసింహా రెడ్డి  

  .         కవి శిఖామణి చింతా రామకృష్ణారావు గారికి 
  .                        పంచ పద్యసుమాలు 
ఉ. ఆతడు నిండుకుండ, మరియాదకు తెల్లని మంచు కొండ, ప్ర 
ఖ్యాతికి పూల దండ, గగనంబున నెత్తిన ఝండ పాండితిన్,    
భూతలమంత నిండ విర బూచిన మండ తెలుంగు  పద్యపుం 
రాతల  లోన గండ, తన లాస్యము శిష్యుల కండ,  నుండెడిన్ 

ఉ . మెత్తని వాడవీవు, సుతి మెత్తని భావము నీది, అన్యులన్   
మొత్తగ బోవు , గుండియలు మోసులు వారగ పండితాళురన్    
చిత్తములోన  మెచ్చు కొను చిత్తము  నీది, నీదు సేవయే 
పొత్తము నందు వ్రాసికొన బోలును ఓ కవి రామకృష్ణుడా! 

ఉ. అందరి వాడు, స్నేహమున హద్దులెరుంగని వాడు, కైతలో 
ముందరి వాడు, నెల్లరకు మోదము గూర్చెడు వాడు, చల్లనౌ
డెందము వాడు, నెయ్యెడల టెక్కులు జేయనివాడు, దర్పమున్ 
జెందని వాడు, సాదు గుణ శీలుడు  మాకవి రామకృష్ణుడున్ 

ఉ. మంచికి మారు పేరు, అభి మానుడు పెద్దల పట్ల, యెన్నడున్వం
చన సేయ నేరడు, వివాదము లందున దూరబోడు, దీ  
పించెడు  సౌమ్య శీలుడయి యెల్లరి  గుండెల  కొల్ల గొట్టు ని 
ర్వంచిత  బుద్ధి శీలునకు రంజిల నా యభినందనంబులున్    

మ. చిర కాలంబును గల్గు గావుత ! శుభాశీస్సుల్ సిరుల్ సంపదల్ ! 
కొరతేమాత్రము లేక జీవితమునన్ కొంగ్రొత్త భాగ్యంబులున్ 
వరలున్  గాత! ధరాతలంబునను దివ్యంబై యశో వల్లికల్ 
విరియున్ గాత! నిరంతరంబు మిము దీవించంగ వాగ్దేవి తాన్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.