జైశ్రీరామ్.
శ్లో. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ
స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” (శంకర భగవత్పాదులు)
తే.గీ. మోక్షకారణమగునది పూర్ణభక్తి,
గొప్పదదియంచు శంకరుల్ చెప్పినారు,
స్వస్వరూపానుసంధానమే స్వయముగ
ముక్తినిడు భక్తిగాఁ జెప్పె పూజ్యులార!
భావము. మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమేఽనగా తనరూపముననే ఆ భగవంతుని నిలుపుకొనుటయే భక్తి అనబడును.
భాగవతంలో నవవిధభక్తులు ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది.
శ్లో. శ్రవణం కీర్తనం విష్ణోః - స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం - సఖ్యమాత్మ నివేదనమ్.
పోతన భాగవతములో దీనినే ఈ విధముగ చెప్పెను.
మ. తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
ఆ నవవిధభక్తులు.
1. శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న జ్ఞానానికి మార్గం చూపుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
2. కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
3. స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
4. పాదసేవన భక్తి : భగవంతుని పాదాలు సేవించడం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
5. అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి.
6. వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు.
7. దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు, హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
8. సఖ్య భక్తి : భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
9. ఆత్మ నివేదన భక్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.