జైశ్రీరామ్.
శ్రీ
వసంత తిలక సూర్య
శతకము.
రచన. చింతా రామకృష్ణా రావు.
51. ఉర్వీజనాళికి మహోన్నత భక్తినిమ్మా. - సర్వత్ర సౌఖ్యములు సంపదలొప్పనిమ్మా.
పర్వంబులన్ జగతి వర్ధిల, సాగనిమ్మా. - గర్వాపహా! సుగుణ కల్పక సూర్యదేవా!
52. రేయింబవళ్ళనొనరింతువు నీవె దేవా. - మాయావృతంబయిన మాపఁగఁ జాలుదీవే.
శ్రేయంబులన్ కలుఁగఁ జేతువు నీవె మాకున్. - సాయంబుగా నిలుము సంస్తుత సూర్యదేవా!
53. నీటిన్ సృజించె విధి. నీవటనాకసానన్ - వాటంబుగా తిరిగి వారిద పంక్తి చేరన్
నీటిన్ గ్రహించి కడు నేర్పుననిత్తువయ్యా. - పాటించి నిన్ గొలుతు భక్తిని సూర్యదేవా!
54. హే దేవ! చిద్విభవ! హే దిన రాజ! సూర్యా! - ఈ దీనునిన్కరుణనేలుమ లోకబంధూ!
మోదంబుతో కనుచు మోహము బాపుమయ్యా. - శ్రీ దుండ! వందనము చేకొను సూర్యదేవా!
55. నీకే కదా జగతి నిత్యము కన్పడున్ నీ - రాకే కదా శుభము ప్రాగ్దిశనుండి తెచ్చున్.
మాకే కదా సకలమంగళముల్లభించున్. - శ్రీ కారపూర్వక సుచేతన సూర్యదేవా!
56. ధారాగతిన్ చలువధారలు భూమికీయన్ - రేరేనికిన్ గొలిపి ప్రేమను కాంతి కల్మిన్
58. అంతంబు లేని కరుణాకర! లోకబంధూ! - సాంతంబు నన్ గనుమ సద్గుణమిచ్చి నాకున్.
శాంతస్వరూప! విలసన్నుత! శాంతినిమ్మా. - భ్రాంతుల్ విడన్ తరుము వర్థిల సూర్యదేవా.
97. దర్పోద్ధతుల్ కలరు, తప్పవు దండనాదుల్. - కర్పూరహారతులు గౌరవమొంది పొందన్.
తూర్పారఁబట్టి యిక త్రుంచుము దుర్జనాళిన్ - కార్పణ్యమున్ మడఁచు జ్ఞానద! సూర్యదేవా!
107. జ్ఞానాగ్ని దగ్ధ నిజ కర్ములఁ జేయు మమ్మున్, - ప్రాణప్రదంబయిన భక్తిని కొల్పు మాకున్.
నీ నామ సంస్మరణనే విడనీక, మాలో - ప్రాణంబుగానిలుము రక్షక సూయదేవా!
108. మాంగళ్య నామ కొనుమా జయ మంగళంబుల్. - మాంగళ్య రూప! శుభ మార్గ చరా! శుభంబుల్.
మాంగళ్య తేజ! గుణ మాన్యుఁడ! మంగళంబుల్ - మాంగళ్య మూర్తివయ మంగళ సూర్య దేవా!
స్వస్తి.
ఆదిత్యాయ నమస్తుభ్యమ్
పండితాభిప్రాయములు.
అవధాని రత్న, సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర !
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోzస్తు తే ||
అసామాన్య ప్రజ్ఞా పాటవాలు శ్రీ చింతా రామకృష్ణా రావుగారి తోబుట్టువులు. సరససుధాధారాపాతము వీరి కవిత్వ గుణత. అత్యంత సరళపదబంధముతో, అర్థౌచిత్యముతో వైదర్భీరీతిలో వీరి కలమునుండి కవితామృతధారలు జాలువారినవి. సంస్కృతములో ప్రసిద్ధమైన వసంతతిలక వృత్తాన్ని ఆలంబనగా చేసుకొని ఆంధ్రభాషను ఉద్దీపింపజేస్తూ సాగిన వీరి పద్యాలు పఠిస్తూంటే పద్యాలు చదువుతున్నామా? వినువీధిలో విహరిస్తున్నామా? అనే సందేహం కలుగక మానదు.
పృథివ్యప్తేజోవాయురాకాశాలనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞదీక్షయందుండు సోమయాజి అను ఎనిమిది రూపాలు శివుని అష్టమూర్తులు. వీరిలో సర్వభూతములకు చైతన్య ప్రదుడైన, కర్మసాక్షియైన సూర్యభగవానుడు కులమతజాతులకతీతంగా ప్రతి ఒక్కరి చేత నిత్యపూజ లందుకొంటున్నాడు. శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము అను వీటిని పూజించే ఆచారాన్ని పంచాయతనమంటారు. ఇలా పంచాయతన దేవతార్చనములో సూర్యడు ప్రాధాన్యత వహించినాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు శరీర కారకుడు. అందుకే శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు సూర్యుని స్తుతించి అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మయూరుడు అనే కవి సూర్య శతకాన్ని రచించి కుష్టురోగవిముక్తుడైనాడు. ఇలా వేద, వేదాంగ, సాహిత్యాలలో సూర్యదేవునికి ప్రత్యేక స్థానమున్నది. అందుకే శ్రీ సూర్యదేవుడు ప్రాతఃస్మరణీయుడు.
“జీవాత్మవై ప్రబలి జీవులనుందువీవే. - నీవేడి ప్రాణమయి నిత్యము నిల్పు మమ్మున్.
శ్రీవిశ్వనాథుఁడవుశ్రీహరివీవెమాకున్.-నీవారమయ్య.మననీయుమ,సూర్యదేవా!”
.12
అనే ఈ పద్యంలో "అహం వైశ్వానరో భూత్వా", "ఆదిత్యానామహం విష్ణుః" అనే భగవంతుని వచనాలను మృదుమధురంగా వ్యక్తపరచినారు శ్రీ చింతా రామకృష్ణారావు గారు.
"సప్తాశ్వముల్ కనఁగ సప్త వివర్ణ మాలల్ - లుప్తంబయెన్ తెలుపు లోపల చేరియుంటన్.
గుప్తార్థమిందు కనుగొన్న ప్రభాత వేళన్ - దీప్తంబగున్ మహిత తేజము సూర్యదేవా! " .27
అనే ఈ పద్యంలో శ్రీ చింతా రామకృష్ణా రావు గారు తమ అంతరిక్ష శాస్త్రవిజ్ఞానాన్ని అద్భుతంగా వెలువరించారు. సప్త వర్ణాలు అనేవి అసలు లేనే లేవు. ఉన్నది ఒక్క శ్వేతవర్ణం మాత్రమే. అందులోనే తక్కిన వర్ణాలన్నీ విభిన్నంగా కనబడుతున్నాయి. అదే అంతరార్థాన్నే ఈ పద్యం వివరిస్తున్నది.
"పచ్చందనంబునకు భాస్కర! హేతువీవే. - మెచ్చున్ నినున్ ధరణి మేలగు కాంతినొప్పన్.
నచ్చున్ గదా ప్రకృతి నవ్యమనోజ్ఞ కాంతిన్. - సచ్చిత్ ప్రభాస గుణసన్నుతసూర్యదేవా! .31
నీటిన్ సృజించె విధి. నీవటనాకసానన్ - వాటంబుగా తిరిగి వారిద పంక్తి చేరన్
నీటిన్ గ్రహించి కడు నేర్పుననిత్తువయ్యా. - పాటించి నిన్ గొలుతు భక్తిని సూర్యదేవా!” .53
అనే ఈ పద్యాలలో సూర్య కిరణాలలో వర్షహేతువైన కిరణాలు వేరుగా కలవని, సస్యశ్యామలత్వాని కవసరమైన కిరణజన్య సంయోగక్రియను గూర్చి వర్ణించినారు.
“దివ్యాంగులన్ కనుమ దీన జనార్తహారీ! - భవ్యాత్ము లాదుకొన,వారికి మేలు కల్గున్.
సవ్యంబుగా బ్రతుకు సాగఁగఁ జేయుమయ్యా! - నవ్యంబుకాన్ సతమనంతుఁడ! సూర్యదేవా!” .47
అనే ఈ పద్యంలో శ్రీ చింతారామకృష్ణారావు గారికి దివ్యాంగులపై ఉన్న అపార కారుణ్యము, దివ్యాంగులను ఉద్ధరించవలెననే తపన వ్యక్తమౌతున్నది.
“పాదాభివందనము భక్తిగ చేయు వారిన్ - మోదంబుతో గనుచు పూజ్యతఁ గొల్పు వాఁడా!
నీ దారిలో నడుచు నిర్మల తత్త్వమిమ్మా. - బోధన్ మదిం గొలిపి,ప్రోచెడి సూర్యదేవా!” .81
అను ఈ పద్యం సూర్య నమస్కారములు చేస్తే లభించే ప్రయోజనాన్నీ, ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నది.
ఇలా ఈ శ్రీ సూర్య దేవుని అష్టోత్తరశతకంలో ఎన్నెన్నో విలువైన శాస్త్ర విషయాలు లెక్కలు మిక్కిలిగా ఆవరించి చదువరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ కావ్యం ప్రాతఃకాలంలో పారాయణము చేసుకొనుటకు ఎంతో అనువుగా ఉన్నది. పద్యధార కావలెనని కోరుకొను కవిపండితులకు శ్రీ వసంతతిలక సూర్య శతకము పద్య విద్యాపాటవాన్ని పెంపొందించేదే కాకుండా సకలాభీష్టసిద్ధిని కలుగజేస్తుందని నమ్ముతున్నాను. నాపై అనురాగంతో అభిప్రాయాన్ని అందజేయమని పునఃపునః శ్రీ వసంతతిలక సూర్య శతకమును చదివే అవకాశాన్నిచ్చిన బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమశ్శత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అభినందన పంచ రత్నములు.
శ్రీ రామ కృష్ణ కవిచే శతకంబు కూడెన్ - నోరార సూర్యుని మనోహరుజేరి కొల్వన్
వారించి దుఃఖబడబానలమాదిదేవుం - డీరూపమెంచి కృతకృత్యులజేసె తెల్పన్ ||
భవదీయాద్భుత భావనాగరిమతో భావించి సప్తాశ్వునిన్ - కవితాధారసుధారసాననభిషేకంబిట్లొనర్పంగ,
వై
భవమొప్పారగ సూర్యదేవుని నమోవాకంబులన్ భక్తి సం - స్తవనంజేయరె పాఠకోత్తములు చింతా రామకృష్ణాహ్వయా !
ధౌతస్వాంత! కవీంద్ర! శ్రీసహిత చింతా రామకృష్ణాహ్వయా!
చేతఃపద్మమొసంగి భక్తియుతులై శ్రీ సూర్య నారాయణుం
బ్రాతఃకాలము రోజుకొక్కొకటియౌ పద్యమ్మునన్ గొల్వగా
నేతత్సత్ శతకమ్మునేర్పడె తరించెన్ పాఠకవ్యూహమున్ ||
శ్రేయఃకారణమెన్ని లోకమునకై శ్రీకారముంజుట్టి ధౌ
రేయుండై భువి సూర్యదేవుని సమర్చింపంగ పద్యావళిన్
మీ యత్నంబున మీకు మాకును లసన్మిత్రుండు సంతుష్టుడై
ఆయుర్దాయమొసంగు రోగపరిహారంబంతగావించుచున్ ||
ఆయురారోగ్యమైశ్వర్యమస్త్వటంచు
- నాదిదేవుండు సూర్యుడే అభయహస్త
మాదరంబుగ మీకివ్వనాత్మదలతు - భక్తి, రామకృష్ణారావు వర్య! సతము.
ఇట్లు
బుధజన విధేయుడు
అవధాని రత్న, సాహిత్య శిరోమణి
డా.మాడుగుల అనిల్ కుమార్
యం.ఏ; బి.యెడ్; పీహెచ్.డి.
సంస్కృత విభాగాధ్యక్షులు,
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల,
తిరుపతి.
కృతికర్త పరిచయము
భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చింతా రామ కృష్ణా రావు. M.A.,.
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా
మూడు
ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)
3) ఆంధ్రసౌందర్యలహరి.
4) ఆంధ్రామృతమ్,
పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక
స్వీయ రచనలు.
5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస
గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం
మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము.
(ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము.
(ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు
భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర
శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య
శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష
శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ
చిత్రకవితలు.
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ
స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ
సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ
దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత
చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి
శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత
118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
30) శ్రీమన్నారాయణ
శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ
పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య
శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ
సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర
నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద
గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున
మూడు మకుటములతో మూడు శతకములు.)
36) శ్రీ శిరిడీశ
దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి
(శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత
విభిన్నవృత్త శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా
కందపద్యములు,
సీతాన్వయముగా తేటగీతి
పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో
సుందరోత్పల నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక.
(చిత్రకవితా ప్రసూనములు.)
41) స్వతంత్ర భారత
వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత పాద
ఉత్పలమాలిక.
//స్వస్తి.//
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.