ఓం శ్రీమాత్రే నమః.🙏🏿
భారత మాతకు ముష్కర రక్త సిందూర తిలకం.
శా. శ్రీమన్మంగళ భారతావని శుభశ్రీభావ సంపూజ్యులన్,
క్షేమానందము లందరున్గనుచు భాసించన్ మదిన్ గోరు సత్,
ప్రేమోద్భాసిత దివ్యమూర్తులను, సద్విజ్ఞాన సంస్కారులన్,
బ్రేమన్ గాంచెడి మాత, లోకముననే వేదప్రభాతేజమై.
ఉ. శాంతియు సౌఖ్యమున్ సుఖము, సజ్జనపాళి కనంగనెంచుచున్,
భ్రాంతి విదూరులై మెలఁగు భవ్యులు, ధర్మమునాల్గుపాదముల్
సాంతము నొప్పునట్టులుగ నాశనుచేసెడివారు, గ్లాని యొ
క్కింతయు కల్గనీయరుగ యీప్సితధర్మపు వర్తనంబునన్.
ఉ. భారత జాతి శాంతగుణ భాస్కరతేజమటంచు నెంచుచున్,
నేరములెన్ని చేసిన గణింపక, శాంతిగనుందురంచు, సం
స్కారవిహీన ముష్కరులు కాల్చుచునుండిరి భారతీయులన్,
ధీరులు భారతీయులని దేవుని సాక్షిగ తెల్పకుందురా?
శా. ధర్మగ్లాని సహింపరార్యులిచటన్, దాష్టీకమున్ గాంచి రా
ధర్మాధర్మము లెంచి చూచినను సద్ధర్మంబె చూపట్టగా
మర్మంబింతయు లేక దుష్ట జనులన్ మాయింతురిద్ధాత్రిపై,
కర్మల్ పండిన ముష్కరాధములకున్ గల్పింతురే మృత్యువున్.
ఉ. హిందువులన్ గణించుచును హేయముగా మగవారినెంచి వా
రందరిప్రాణముల్ గొనిరి యగ్నిశరంబులతోడ ముష్కరుల్,
ముందికనేమియౌనొ? కనలున్ మన పాక్కని యెంచ నేరరే?
సందుల దాగినారమిక చక్కగనుంటిమటంచు నెంచిరే.
శా. సిందూరంపు కళావిదూరులుగ మా స్త్రీజాతినే జేసినా
రందున్ ముష్కరజాతి యొక్కటియె యంచాదుష్టులన్ గుర్తుగా
సిందూర్ దాడిని మట్టుఁబెట్టిరి జగఛ్ఛ్రేయంబుగానెంచుచున్,
సౌందర్యాద్భుత భారతీ ప్రతిభతో శక్తిన్ గనన్ జేసిరే.
చ. విజయము భారతీయ సుపవిత్ర దళత్రయ రక్షకాళికిన్,
విజయము హైందవార్ణవ ప్రవిస్తర ధర్మవివర్ధకాళికిన్,
విజయము మోది మేధకును, విస్త్రుత భారతజాతికంతకున్,
విజయము ధర్మబద్ధులకు, విజ్ఞులకెల్లను శ్రీనృసింహుఁడా!
ఉ. మంగళమౌత భారత సమస్త జనాళికి, భావపాళికిన్,
మంగళమౌత హిందువుల మంగళభావనపాళికెప్పుడున్
మంగళమౌత వేదచయ మంగళభాస్కరతేజమంతకున్
మంగళమౌత శాంభవికి, మంగళమౌమన మాతృభూమికిన్.
🙏🏿
అమ్మ దయతో🙏🏿
చింతా రామకృష్ణారావు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.