గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2025, బుధవారం

పంచాస్యంబును వెంటనంటి తరిమెన్శ్వానంబు చిత్రంబుగన్ . ఈ సమస్యకు పద్మశ్రీ గరికపాటి వారు, డా.నరాల రామారెడ్డిగారు, వారితో పాటు నేను చేసిన పూరణలు.

జైశ్రీరామ్.

మొన్న 9 వ తేదీ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించే అవధాన శిక్షణా తరగతుల్లో 

పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మహోదయులు ప్రసంగంలో ఒక సమస్యను 

ఉదాహరించారు .

“ పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్ ”

దీనికి వారి పూరణ

ప్రాంచత్కావ్య మధూళికావితతిగీర్వాణీపదంబంటగా

పంచెన్ గట్టిన భారతీసతియునై భార్యాసహాయుండునై 

సంచీ చేకొని కూరగాయలకు బాజారేగుచో సాహితీ

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.


ఈ సమస్యకు డా.నరాల రామారెడ్డి మహితాత్ముని పూరణము.

కించిద్రూపము వంగ ( బాంగ్ల )దేశము క్రికెట్ క్రీడారణక్షోణిలో

మించెన్ విశ్వవిజేత భారతమునే మేలైన బ్యాటింగుతో

కంచుంఢక్కను వ్రక్కలించెనవురా !క్రాంతిన్ విజృంభించుచున్.

పంచాస్యంబును వెంటనంటి తరిమెన్శ్వానంబు చిత్రంబుగన్ .


ఇదే సమస్యకు నా పూరణము.

పంచాస్యంబది కూనలన్ దినుటకై వంచించి, యేతెంచగా

నెంచెన్ దానికి చిక్కకుండునటులన్ హృద్యంపు ధైర్యంబుతో

వంచించెన్ వెనువెంటనుండి కరచెన్ పర్వెత్తె నాసింహమే ,

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానంబు చిత్రంబుగన్.

జైహింద్. 

Print this post

1 comments:

Saraswathi Nagaraajan చెప్పారు...

అన్ని పూరణలు అద్భుతం ఆర్యా 🙏🙏🌺🌷💐

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.