గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2025, శనివారం

అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిల వృత్తము.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

13 - 5 - 2025న నేను అవధానశిక్షణాశిబిరమున చెప్పిన అవధానంలో 

చిత్రకవిత్వం అనే అంశంలో అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిల వృత్తము 

విని నేను చెప్పిన సూచనననుసరించి తమ్ముఁడు చిరంజీవి 

మరుమాముల దత్తాత్రేయశర్మ అష్టావధాని 

అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిలను వ్రాసి 

డా.జీ.యం. రామశర్మగారినే అబ్బుర  పరచుట మీ అందరికీ తెలిసిన విషయమే. 

ఆ పద్యమును గమనింపుడు.

అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిల వృత్తము.

వాసరాపురి వాగ్భవా! నుత వాక్సతీ! శ్రుతి వైభవా!

వాసవాదుల ద్రష్టవా! విభ వాఙ్మయీ! శుభ దాయివా!

వాసితాత్మభువాణివాయన వాసికెక్కిన దానివా!

వాసినొప్పెడి నిత్యవా! హృది వాఙ్మివై యలరారవా!

మత్తకోకిల గర్భస్థ మధురాక్కర.

వాసరాపురి వాగ్భవా! వాక్సతీ! శ్రుతి వైభవా!

వాసవాదుల ద్రష్టవా! వాఙ్మయీ! శుభ దాయివా!

వాసితాత్మభువాణివా! వాసికెక్కిన దానివా!

వాసినొప్పెడి నిత్యవా! వాఙ్మివై యలరారవా!


అష్టదళపద్మ బంధ మధురాక్కర.

చెప్పినవెన్వెంటనే గ్రహించి ఇంత చక్కగా తాను స్వయంగా వ్రాసిచూపగానే 

నా ఆనందానికి అవధులే లేవంటే మీరు నమ్మకపోరు. ఇది సత్యం కాబట్టి.

అదే విధంగా

చి.వింజమూరి సంకీర్త్య్ కూడా అప్పటికప్పుడు వ్రాసి ప్రదర్శించడం మనమందరం చూచాముకదా.

అష్టదళపద్మబంధ మధురాక్కర గర్భ మత్తకోకిల

రామనామము బల్క రా! మది రాముడేమన తోడురా,

రామరాజ్యమె మేలు రా! భువి రామరూపము గోరరా,

రాముడేమన దిక్కు రా! మరి రామపాదము పట్టరా,

రామునిన్ భజియించరా! సఖ రాక్షసాంతకు గొల్వరా.

మత్తకోకిల గర్భస్థ మధురాక్కర.

రామనామము బల్క రా! రాముడేమన తోడురా,

రామరాజ్యమె మేలు రా! రామరూపము గోరరా,

రాముడేమన దిక్కు రా! రామపాదము పట్టరా,

రామునిన్ భజియించరా! రాక్షసాంతకు గొల్వరా.

అదేవిధంగా

శతావధాని చి. ఉప్పలధడియం భరత్ శర్మ చక్కని పద్యం వ్రాసి నాకు 

పంపించాడు. చలా బాగా వ్రాశాడని నేను చెప్పనక్కరలేదు. మీరే చూడండి.

అష్టదళపద్మబంధ మ్త్ధురాక్కర గర్భ మత్తకోకిల

మా! యశేషజగద్గమా! జనమాన్యవైభవమూలమా! 

మాయఁ గాల్చు మహత్వమా! సిరిమాత! విష్ణుకళత్రమా! 

మా యమేయసుఖాంకమా! బుధమాన్యసచ్చరితా! రమా! 

మా యగారము చేరుమా! నిను మాటి మాటికిఁ గొల్వమా.

మత్తకోకిల గర్భస్థ మధురాక్కర.

మా! యశేషజగద్గమా! మాన్యవైభవమూలమా! 

మాయఁ గాల్చు మహత్వమా! మాత! విష్ణుకళత్రమా! 

మా యమేయసుఖాంకమా! మాన్యసచ్చరితా! రమా! 

మా యగారము చేరుమా! మాటి మాటికిఁ గొల్వమా.


ఈ విధంగా అవధానంలో బంధ గర్భ చిత్రరచనలు చేస్తుంటే అవధాఅనానికే 

మరింత వన్నె తెస్తాయనుటలో ఏమాత్రం సందేహం లేదు. 


నా మాటను గౌరవించి చెప్పినది గ్రహించి వెంటనే పద్యరచన చేసి నాకు ఆనందం 

కలిగించి ఈ ముమ్మూర్త్రులకు ఆత్రినాథులు ఆయురారోగ్యానందైశ్వర్యాల

నందించుచు మంచి చిత్రకవులుగా కూడా తీర్చిదిద్దాలని మనసారా 

కోరుకొంటున్నాను.

చిత్రకవితాభిమాని

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.