जय श्री राम्.
మీ కళ్ళు 75% మూసి చూడండి
जय श्री राम्.
కనిపిస్తుంది.
రూపకర్తలకు పాదాభివందనములు.
ఉ. శ్రీ రఘురామ! వందనము చేసెద నీ వర భక్తపాళిదౌ
స్మేర ముఖారవిందములఁ జిందెడి శ్రీరఘురామ సత్ సుధన్
గోరి గ్రహించువారి పదకుట్మల బద్ధ ప్రశస్త ధూళికిన్,
వారలయోధ్య నుండు పరివారము, శ్రీకర జానకీపతీ! ౧.
ఉ. నీ వర నామ దర్శనము నేర్పుగఁ గల్గు విధంబునన్ మహ
ద్భావన చేసి యాలయము వాస్తుప్రకారమయోధ్యలోన నా
దేవగణంబు గాంచునటు తీరుగ నిర్మితి చేసినార లా
దేవగణంబె భూమిపయి, దివ్యుఁడ! శ్రీకర జానకీపతీ!. ౨.
చం. కలిని యడంచి, శ్రీ కృతయుగంబును ధాత్రిని గొల్పి, నిత్యమున్
మలినము లేని జీవితము మానవపాళికిఁ గూర్చనెంచుచున్
వెలసితివా? పరాత్పరుఁడ! పేశల దివ్యమనోజ్ఞ రూప! స్వ
స్థలమున సుస్థిరంబగును, సారస నేత్రుఁడ! జానకీపతీ! ౩.
చం. నెనరున, భక్తిభావమున, నిత్యము నీ మహనీయ నామమున్
ఘనముగ నన్నియున్ శుభముగా జరుగన్ విలిఖించి ముందుగా
పనిపడి యేది వ్రాసినను వ్రాయుట మాకలవాటు నీ కృపన్,
ప్రణతులు నీకు, మా పనులు భాసిలఁ జేయుము, జానకీపతీ! ౪.
ఉ. జానకి తోడు కాగ మనసార ఘనంబగు కార్యముల్ ప్రభూ!
ధీనిధివై యొనర్చితివి, ధీయన సీతయె లోఁ దలంపఁగా,
నేనును జానకీ సతిని, నిన్నును నామదిలోన నిల్పి, య
క్షీణ దయాంబురాశివని చేరుదు నిన్ వర జానకీపతీ! ౫.
చం. నినుఁ గనినంతలోననె మనీషులుగా మనసాధ్యమౌనయా
మనుజులకెన్న, నీమహిమ మానవతన్ గలిగించుచుండుటన్,
ఘనతను గొల్పిభక్తుల ప్రకాశము పెంచెడి దైవమీవెయై
మనుజులఁ గావవచ్చితివి, మాన్య దయామయ! జానకీపతీ! ౬.
చం. కరివరదుండ వీవనుచు గౌరవమొప్పగ విష్ణుమూర్తిగా
నిరుపమ భక్తిఁ గొల్చెదను, నేనె కరిన్, మకరిన్, దలంప, న
న్నరయుచు నేమి చేసెదవొ? యార్తిని బాపుచు నెట్లు కాతువో?
పరమ దయాపరుండ! వరభావనఁ గొల్పుచు, జానకీపతీ! ౭.
ఉ. పాపపు భావనల్, మరియు పాపపు కార్యములన్ మనంబున
శ్రీపతి! నీకె సాధ్యమగు చేరగనీయక మమ్ము నిల్పగన్,
శ్రీ పరమేశ్వరీ సహిత శ్రీనిధి వీ విది చేయఁ జాలవో?
కోపమె లేని నిన్ గొలుతుఁ గోమల దేహుఁడ! జానకీపతీ! ౮.
ఉ. నీవొనరించి సృష్టి, మహనీయులనీ ధర నిల్పి, నీ ప్రభన్
జీవనశైలి, నిర్మల ప్రసిద్ధగుణోద్ధతి వ్రాయఁ జేసి, స
ద్భావసమృద్ధిఁ గొల్పునటు వాసిగ చేసిన నీకు నీవె యో
ధీవర! సాటి యౌదువు, మదిన్ నిను నిల్పెద, జానకీపతీ! ౯.
ఉ. మంగళ రూపా జానకికి, మాన్యమహోదయ! నీకు నెల్లెడన్
మంగళమౌత, నిన్ గొలుచు నీ వరభక్తులపాళికిన్ సదా
మంగళమౌత యంచిచట మాన్య సుపూజ్యులు పార్వతీశివుల్
మంగళ వాక్సుధాస్రవము మన్ననఁ గొల్పిరి, జానకీపతీ! ౧౦.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.