గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2024, సోమవారం

కాళిదాసు కృత దేవీ అశ్వధాటిDevi Aswadhati 05 వివరణ.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్లో:-
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే.
అంబా కురంగ మద జంబాల రోచిరిహలంబాలకా దిశతుమే
శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాదిత స్తనభరా!
సీ:-
కంబు సన్నిభమైన కంఠంబు కల తల్లి;  
వీణ దాల్చిన మృదుపాణి జనని.
బింబోష్ఠయు' కదంబ విపిన సంచారియు; 
ఇంద్రాది సుర వంద్య . యీశు రాణి.
కస్తూరి ప్రభ యుక్త కాల వర్ణ శిరోజ. 
కమనీయ కాంతుల కల్పవల్లి.
శశిబింబమును బోలు షణ్ముఖపీడిత 
స్తనభరంబుననొప్పు చక్కనమ్మ.
గీ:-
మాతృ దేవత దుర్గమ్మ మహిమ గొలిపి;
శుభము లిచ్చుత. ఎనలేని సుఖము లిడుత.
శాస్త్ర సు జ్ఞాన సంపద చక్క నొసగి
కాచు గావుత నన్ను సుజ్ఞాన మాత.
భావము:-
కంఠము యొక్క ఆకారము చేత శంఖముతో మిక్కిలి పోలిక కలదీ; లేత సొరకాయను పోలిన వీణతో కూడి యున్నదీ; దొండ పండు వంటిఅధరము కలదీ; కడిమి తోటలో వినమ్రులై నమస్కరిస్తున్న వజ్రాయుధుడైన ఇంద్రాది దేవతల సమూహము కలదీ; కస్తూరి యొక్క పంకము యొక్క కాంతి గల వ్రేలాడుతున్న కురులు కలదీ; కుమార స్వామి యొక్క చంద్ర బింబము వలె మనోహరమైన ముఖముతో;పీడింప బడిన కుచ భారము కలదీ అయిన మాత్రు మూర్తి పార్వతీ దేవి నాకు శుభాన్ని; సుఖాన్ని; శాస్త్ర సంపదను; ఈ జన్మములో ప్రసాదించు గాక!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.