గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2024, గురువారం

మూకపంచశతి .... కటాక్ష శతకము02/10 . 11 నుండి 20వ శ్లోకము వరకు పద్యానువాదము. పద్య రచన .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

 11. యాన్తీ సదైవ మరుతా మనుకూలభావమ్‌

భ్రూ వల్లి శక్రధను రుల్లసితా రసార్ద్రా

కామాక్షి! కౌతుక తరంగిత నీలకంఠా

కాదంబినీవ తవ భాతి కటాక్షమాలా. 

తే.గీ.  దేవతలకనుకూలమై తేజరిల్లు

నీ కటాక్షమాలేంద్రచాపాకరమ్మె,

నిత్య శృంగారరసముచే నియతిఁ దడిసి,

కౌతుకమునొప్పు శివునొంది భాతి గాంచె.

అమ్మా కామాక్షీ! నీ యొక్క కడగంటి చూపులవరుస ఎల్లప్పుడును దేవతలకే ఆనుకూల్యమును పొందుచున్నదయి, కనుబొమలనెడి యింద్రధనువుచే ప్రకాశించినదై శృంగార రసముచే తడిసినదై, కుతూహలముప్పొంగిన శివుఁవుడు కలదై, మేఘమాలవలె ప్రకాశించుచున్నది.

తా|| అమ్మవారి కటాక్షమాలిక మేఘమాలిక వలె ప్రకాశించుచున్నది. ఇట్లనుటకీ క్రిందివి హేతువులు. మేఘమాలిక గాడ్పులకనుకూలముగా చలించును. కటాక్షమాలిక దేవతలకనుకూలముగా చలించును. మేఘమాలిక పైన ప్రకాశించినది. జలముచే తడిసినది. కటాక్షమాలిక ఉల్లాసముగలది. దయారసముచే తడిసినది. మేఘమాలిక శక్రధనువు గలది. కటాక్షమాలిక భ్రూవల్లి కలది, మేఘమాలికను చూచి నెమలి కుతూహలము చెంది యుండును. కటాక్షమాలికను చూచి శివుడు కుతూహలము చెంది యుండును. ఈ శ్లోకమున శేషానుప్రాణితమైన ఉపమాలంకారము కలదు. అది శివుడు, నెమలి; భ్రూవల్లి, శక్రధనువు, అను ఉపమేయోపమాన ధర్మముల బింబ ప్రతిబింబ భావముతో కూడియున్నది. కటాక్ష భ్రమరములకు పోలిక స్వతస్సిద్ధము. కటాక్ష మేఘమాలికల కౌపమ్యము స్ఫురింపజేయుటకు శ్లేషయను బింబ - ప్రతిబింబ భావము నిట నాశ్రయింపబడినవి. 

తే.10 . 01 . 2024.

12. గంగామృసి స్మితమాయే తపనాత్మజేవ 

గంగాధరోరసి నవోత్సల మాలికేవ 

వక్తుప్రభాసరసి శైవల మండలీవ 

కామాక్షి! రాజతి కటాక్ష రుచిచ్చటా తే. 

ఉ.  నీ కడగంటి చూపు గణనీయపు వెల్గు ప్రసారమెన్నగా

శ్రీకరమందహాసమను చెల్వగు గంగను సూర్యపుత్రినాన్

శ్రీకరకంఠు రొమ్మున వసించు నవోత్పలహారమట్టులన్

శ్రీకరమౌముఖాంభసిని చెల్గెడు శైవలమట్లు వెల్గెడున్.

తా|| అమ్మవారి కటాక్ష రుచి చ్చట చిరునవ్వు అనెడి ఆ గంగ యందు యమున వలె, తెల్లనైన శివుని యురమున అప్పుడే పూచిన నల్లకల్వల మాల వలె ముఖ కాంతి సరస్సునందు నాచు వలె ప్రకాశించుచున్నది. 

13. సంస్కారతః కిమపి కన్దలితా న్రసజ్ఞ(జ్ఞా) 

కేదా రసీమ్ని సుధియా ముపభోగయోగ్యాన్‌ 

కల్యాణ సూక్తిలహరీ కలమాంకురా న్నః 

కామాక్షి! కన్దలయతు త్వదపాంగమేఘః. 

తే.గీ.  నీదగు కటాక్షమేఘముల్ శ్రీద! నా సు

ధల రసజ్ఞతన్ నాల్కకేదారమునను

భావనన్ జిత్రముగ మొల్చు భవ్యభోగ్య

సూక్తిఝరి వరిన్ మొలిపించు చూచి మరల.

తా|| అమ్మా! సంస్కారము వలన రసజ్ఞకేదారముల యందు మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన మా వాక్కులనెడి వరి మొలకలను నీ కడగంటి చూపనెడి మేఘము మొలకెత్తించు గాక! లేక, అమ్మా! నా నాలుకయనెడి పొలము నందు సంస్కారము వలన మొలకెత్తిన విద్వదుపభోగ్యములైన శోభ వాక్కలమాంకురము లనే కటాక్షమేఘము మరల మొలకెత్తించుగాక. 

14. చాంచల్యమేవ నియతం కలయన్‌ ప్రకృత్యా 

మాలిన్య భూశ్ఫుతి పథాక్రమ జాగరూకః 

కైవల్యమేవ కిము కల్పయతే నతానాం 

కామాక్షి! చిత్రమపి తే కరుణా కటాక్షః. 

తే.గీ.  కరుణనొప్పెడి జనని! నీ కంటిచూపు

కలితమాలిన్య, విడువదు కదలికలను,

శ్రుతిపథాక్రమవర్తి, నిన్ జూచి కొలువ

వినుతకైవల్యమిచ్చును, వింతకాదె?

తా|| కామాక్షి దేవి దయగలచూపు చాంచల్యమును విడువదు. కాటుకను (మాలిన్యమును) ధరించును. చెవిచేరు మార్గమును (వేదమార్గమును) అతి క్రమించినది. ఐనను నమస్కరించు వారికి జీవేశ్వ రైక్య రూపకైవల్యమునే ఇచ్చుట వింతచిత్రము. 

15. సంజీవనేజనని చూతశిలీముఖస్య 

సమ్మోహనే శనికిశోరక శేఖరస్య 

సంస్తమ్భనే చ మమతాగ్రహచేష్టితస్య 

కామాక్షి! వీక్షణ కలా పరమౌషధం తే. 

ఉ.  నీదగు దృష్టిపాతము గణింపగ లేశమెయైనగాని, యో

శ్రీద! మరున్ సజీవునిగ చేయును, మారునివైరి కెన్నుచున్

మోదముతోడ మోహమును బుట్టగఁ జేయు, మమత్వమన్ గ్రహ

మ్మౌదల చేయు దౌష్ట్యముల నంతము చేయును శాంభవీసతీ!

తా|| అమ్మా! కామాక్షీ దేవీ! నీదృష్టిపాతము లేశమైనను మన్మథుని సంజీవింప జేయును. శివుని సమ్మోహింప జేయును. మమతాగ్రహము యొక్క వికృత చేష్టలను స్తంభింప జేయును. 

16. కామద్రుహో హృదయ యన్త్రణ జాగరూకా 

కామాక్షి! చంచలదృగంచల మేఖలా తే 

ఆశ్చర్యమమ్బ! భజతాం ఝటితి స్వకీయ 

సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్. 

తే.గీ.  శివుని హృదయమున్ బంధింపఁ జేయఁ గల్గు 

నీదు కడగంటిచూపులు నేర్పుమీర

భక్తి సంబంధులగువారి బంధనములు

తృంచి వేయునో కామాక్షి! యెంతవింత?

తా|| అమ్మా! ఓ కామాక్షి దేవీ! చంచలములైనను నీ చూపులు శివుని హృదయమును బంధించి వేయుటకు సమర్ధములు కాని భక్తుల బంధనములన్నింటిని సంబంధ మాత్రము చేతనే ఛేదించి వేయ గలవనుట ఎంత విచిత్రము! 

17. నీలోజ్పి రాగమధికం జనయన్పురారే 

ర్లోలోజ్పి భక్తి మధికాం ద్రఢయ న్నరాణామ్‌ 

వక్రో2పి దేవి నమతాం సమతాం వితన్వన్‌ 

కామాక్షి! నృత్యతు మయి త్వదపాంగ పాతః.

శా.  అమ్మా! నీ కడగంటి చూపు నలుపే యైనన్ భవున్ రాగిగా,

నెమ్మిన్ జేయును, చంచలంబెయయినన్ నిల్పున్భక్తి భక్తాళిలో,

క్రమ్మంజేయు సమత్వభావమును వక్రంబయ్యు నీమూడిటిన్

సమ్మానంబుగ నిమ్ము నాకునుమహేశానీ! కృపాంభోనిధీ!

తా|| అమ్మా! నీ క్రీగంటి ప్రసారము నల్లనిదయ్యును శివునకు రాగమును (ఎజ్జదనమును) కలిగించు చున్నది. అది చంచలమయ్యును మనుష్యులలో నధికముగా భక్తిని దృఢీకరింప చేయుచున్నది. మరియునది వంకఱయైనను నమస్కరించు వారలలో సమభావమును విస్తరింపజేయుచున్నది. అది నా యందు రాగమును కలిగించి భక్తిని దృఢమొనరించి సమభావమును విస్తరింప జేయుగాక. 

18. కుంఠీకరోతు విపదమ్మమ కుంచిత భ్రూ 

చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః 

రక్షో పకార మనిశం జనయన్‌ జగత్యాం

కామాక్షి! రామ ఇవతే కరుణాకటాక్షః 

తే.గీ.  సునత భ్రూకుటి రామాస్త్రమును కలుగుచు

శ్రిత విదేహ భవానురాగతతిని కలిగి

క్షితిని పాలించెడి దయాన్వితపు చూపు

నీది, యాపదలుబాపి నన్ సతీ! యాదుకొనుత.

తా|| వంచిన భ్రూకుటియనెడి (రామాస్త్రముతో)విల్లుతోనొప్పునది, ఆశ్రయింపబడిన విదేహ భవానురాగము కలది, అగు భూమిని యెల్లప్పుడు రక్షించుటయనునీయొక్క దయగల చూపు రామునివలె నాయొక్క ఆపదను నశింపజేయుగాక.

అమ్మా! కామాక్షీ దేవీ! నీ కరుణా కటాక్షము రాముడే. రాముడు వంచిన ధనువు గలవాడు. నీకటాక్షము వంచిన కనుబొమలుకలది. కటాక్షము సంసారులలో దేహానుభవానురాగ రాహిత్యమును కలిగించునది. రాముడు విదేహరాజ పుత్రిక యందు ప్రేమను పొందినవాడు. కటాక్షము జగవును రక్షించుట యనునుపకారమొనరించునది. రాముడు జగద్రక్షణోపకారమొనర్చిన వాడు. ఈ విధముగ శ్రీరామ స్వరూపమైన నీ కటాక్షము నా ఆపదను నశింపజేయుగాక! 

19. శ్రీ కామకోటి శివలోచన శోషితస్య 

శృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే 

ప్రేమామ్భసార్ద్ర మచిరాత్ప్రచు రేణ శంకే 

కేదార మంబ తవ కేవల దృష్టిపాతమ్‌. 

శా.  కామాక్షీ! శివలోచనప్రభలచే కాముండు శుష్కించ నా

కాముండున్ మొలకెత్తగా తగినటుల్ కంజాక్షి! నీ కంటి చూ

పే మాన్యంబగునట్టి ప్రేమఁ గురిసెన్, విఖ్యాతమౌ నీదు స

త్ప్రేమార్ద్రంబగుదృష్టిపాతపొలమున్ బ్రీతిన్ మదిన్ గాంచెదన్.

తా|| శ్రీ కామకోటి పీఠాధిష్టాత్రివైన యో తల్లీ! శివుని కంటి వేడిచే నెండింపబడిన శృంగార బీజరాశి (మన్మథుడు) తిరిగి మొలకెత్తుటకు ఆత్యంత ప్రేమార్ద్ర మైన య యేకైక దృష్టి పాతమే పొలమయినదని యెంచు చున్నాను. 

20. మాహాత్మ్య శేవధిరసా తవ దుర్విలంఘ్య 

సంసార వింధ్యగిరి కుంఠన కేలి చుంచుః 

ధైర్యాంబుధి మ్బశుపతే శ్చులుకీ కరోతి. 

కామాక్షి! వీక్షణ విజృంభణ కుంభజన్మా.

తే.గీ.  అమ్మ! కామాక్షి! నీవీక్షణమ్మనియెడి

జృంభణాగస్త్యుఁడీభవసాగరమను

వింధ్యగిరి దాటి వచ్చి యావేల్పు శివుని

ధైర్య సంద్రమున్ జేఁబట్టి త్రాగెనమ్మ!

తా|| అమ్మా! కామాక్షీ! నీ వీక్షణ విజృంభణాగస్త్యుడు సంసారమనెడి వింధ్యగిరిని దాటి వచ్చి, శివుని ధైర్యమను సముద్రమును బుడిసిట బట్టుచున్నాడు.

11 - 01 - 2024

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.