జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్లో:-ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా!
పాపాపహ స్వమను జాపాను లీల జనతాపాపనోద నిపుణా!
నీ పాలయా; సురభి ధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం!
రూపాధికా శిఖరి భూపాల వంశ మణి దీపాయితా భగవతీ!
సీ:-
వ్యాసాదులైన శాపాయుధులకు స్వర్గ
పథ పాద ధూళిచే ప్రబలు తల్లి;
పాపాపహరమంత్ర పఠన పరవశుల
తాపత్రయము బాపు తల్లి దుర్గ.
కడిమి వనమునందు కారుణ్య వల్లియై
కలయ వసించు మాకన్న తల్లి;
ముర సుగంధము శిరమున ధూపముగ పొంది;
వెలయు శిరోజాల విశ్వ జనని;
గీ:-
సుందరీ మణి. హిమశైల నందన మణి.
భగవతీ మాత పదముల భక్తిఁ గొలుతు
దురిత కూపమ్ము నుండి నన్ దరికి చేర్చి;
ఉద్ధరించుత దయను తా నొప్పిదముగ.
భావము:-
శాపాయుధులైన వ్యాసాది మహర్షులకు స్వర్గానికి నిచ్చెనలైన పవిత్ర పాద ధీళి కలదీ; పాపాపహరణ చేయు తన మంత్రమును జపించడంలో తన్మయులైన భక్తుల యొక్క తాపత్రయమును తొలగించు నిపుణత కలదియు; కడిమి వనంలో నివసించునదియు; మురయను సుగంధద్రవ్య ధూపము వేయఁ బడిన శిరోజములు కలదియు; మిక్కిలి సుందరమైనదీ; పర్వత రాజైన హిమవంతుని వంశమున మణి దీప మయినటువంటిదియు; అయిన భగవతి నన్ను దురిత కూపమునుండి ఉద్ధరించును గాక!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.