గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జూన్ 2022, సోమవారం

నైతే సృతీ పార్థ జానన్యోగీ ..|| 8-27 || . వేదేషు యజ్ఞేషు తపఃసు .. || 8-28 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

 జైశ్రీరామ్.

 || 8-27 ||

శ్లో.  నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన|

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున.

తే.గీ.  పార్థ! యీ రెండు మార్గముల్ పరమయోగి

యెరిగి భ్రమియింప డీవింక యెరిగి యన్ని

కాలములలోన యోగివై ఘనత నిలువు

మహిత మార్గమ్ము దీనిని మరువబోకు.

భావము‌.

పార్ధా! ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత 

అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి అగుము.

|| 8-28 ||

శ్లో.  వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరం స్థానముపైతి చాద్యమ్.

తే.గీ.  వేద యజ్ఞ తపో దాన విధుల చేత

పుణ్యఫలమేది కల్గు తత్ పుణ్య ఫలము

నధిగమించు నిది కనంగ నరసి యోగు

లందుదురు దీనినే ముక్తి నందగోరి. 

భావము.

వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప 

బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీనిని ఎరిగిన యోగి 

ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందు కుంటాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.