గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జూన్ 2022, సోమవారం

న మాం దుష్కృతినో మూఢాః ..|| 7-15 || . చతుర్విధా భజన్తే మాం.. || 7-16 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

 జైశ్రీరామ్.

|| 7-15 ||

శ్లో.  న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|

మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః.

తే.గీ. మూఢులున్, దుష్కృతులు, నధములును, మాయ

చేత జ్ఞానము లేనట్టి ఛిద్రమతులు, 

నసుర భావ భరితులౌ నరాధములును,

నన్ను సేవింప జాలరు క్రన్నన భువి.

భావము.

దుర్మార్గులు మూఢులు, మాయ చేత జ్ఞానం నశించిన వారు, 

అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు 

నన్ను సేవించరు.

 || 7-16 ||

శ్లో.  చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున|

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ.

తే.గీ.  ఆర్తు, డర్థార్థి, జిజ్ఞాసు, వవని జ్ఞాని,

యనెడి నలువురు సేవింతు రనితరమగు

భక్తితో నర్జునా! నన్ను, శక్తికొలది,

నీవు గ్రహియింపుమిద్దియు నిండుమదిని.

భావము.

భరత కుల శ్రేష్టుడైన ఓ అర్జునా! ఆర్తుడూ, జిజ్ఞాసువూ, అర్ధార్ధీ, జ్ఞాని 

అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.