గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జనవరి 2010, శనివారం

అమ్మా! జగజ్జనని! కొమ్మాశ్వధాటిఁ మది, మమ్ముంగృపంగనగదే?


ఆంధ్రామృతాస్వాదనా లోలులారా!
సంస్కృత ఛందమున అశ్వధాటి అను వృత్తము సుప్రసిద్ధము. చదువుటకు ఇంపుగా నుండి, తాదాత్మ్యతను కలిగించుననుటలో సందేహము లేదు. ఆవృత్తములో మన జగదంబను ప్రర్థింతము.
అశ్వధాటి:-
శ్రీకామితార్థములనేకంబులన్ గనుచుమాకీయగా నిలిచితే!.
నీకేమియివ్వగను మాకున్నదిచ్చటను?లోకేశ్వరీ!  ప్రియముతో
లోకుల్ నినుం గనుచు లోకేశునే మరచి నీకాళ్ళనే బ్రతిదినం
బేకాగ్రతన్ గొలుచు. మాకున్ గనంబడుమ! శ్రీ కాళికా! భగవతీ!
అశ్వధాటి:-
మందార ధామమున సౌందర్య రాశివయి ముందున్న భక్త జనులన్
డెందమ్మునన్ నిలిపి, బంధమ్ములన్ గొలిపి యందమ్ముగా జగతిలో
విందౌచు మా కనుల ముందున్ గనంబడుచు నిందుండ  నీ ప్రకృతిగా,
అందాల తల్లిగ, పసందాల చెల్లిగ, మరందాలనే చిలికెదే!
అశ్వధాటి:-
ఓ పార్వతీ! వినుమ! పాపాలలోకమున మాపాల నీవు కలుగన్
పాపాలనే గనక, శాపాలనే పడక, కోపాగ్నిపాలవక, నీ
రూపాలనే మదిని దీపింపగా నిలిపి, నీ పూజలే సలుపుచున్
ధూపాలతో ప్రథిత దీపాలతోగృహము రూపింపఁగా నగునుగా?
ఆ జగన్మాత కరుణంజేసి అశ్వధాటిత్రయము రూపుదిద్దుకొన్నదని సవినయముగ మనవి చేసుకొనుచున్నాను.
జైహింద్. Print this post

1 comments:

కథా మంజరి చెప్పారు...

అశ్వధాటి ఛందమునందు మీ రచన తురగము వలె పరువులెత్తినది. ధన్యోస్మి !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.