యార్లగడ్డ ద్రౌపది వివాదం
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్రౌపది నవలనకు కేంద్ర సాహిత్య అవార్డు తీవ్ర వివాదానికి దారి తీసింది. తెలుగు సాహిత్య లోకం ఆ నవలను అవార్డుకు ఎంపిక చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ నవలకు ఉత్తమ గ్రంథ పురస్కారం ఇచ్చి కేంద్ర సాహిత్య అకాడమీ తన విలువల వలువలను ఊడ్చేసుకుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్ వెలిదండ నిత్యానందరావు వ్యాఖ్యానించారు. అడుగడుగునా అసభ్య శృంగారం గ్రంథం నిండా పరుచుకుందని ఆయన ఆరోపించారు. గ్రంథానికి ఔచిత్యం, ఉదాత్తత లోపించిందని విరుచుకుపడ్డారు. పరాశరుడు, వ్యాసుడు వంటి మహా మునులను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కాముకులుగా చిత్రీకరించారని, గ్రంధానికి ఔచిత్యం, ఉదాత్తత లోపించిదని ఆయన విమర్శించారు. గ్రంథం అడుగడుగునా అసభ్య శృంగారం, ప్రతి రెండు మూడు పుటలకోసారి బిగికౌగిలి హత్తుకోవడం, వక్షోజాలను బలంగా అదమడం వంటి అనౌచిత్య, అసహ్య, అసాంప్రదాయిక వికృత కాముక భావజాలాల విన్యాసం చోటుచేసుకుందని ఆయన తప్పు పట్టారు.
అవార్డుకు ఎంపిక చేయడానికి తెలుగులో పలు ఉదాత్త రచనలుండగా యార్లగడ్డ ద్రౌపది నవలను ఎంపిక చేయడాన్ని తెలుగు సాహిత్య లోకం తప్పు పడుతోంది. పౌరాణిక ఇతివృత్తాలపై విమర్శలు పెట్టాల్సి వచ్చినప్పుడు హేతుబద్దత అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అటువంటి హేతుబద్దత ఏదీ ద్రౌపది ఇతివృత్తానికి లేదని అంటున్నారు. సదాశివ యాది, కొలుకలూరి ఇనాక్ అస్పృశ్యగంగ వంటి పుస్తకాలు ఎన్నో అవార్డుకు అర్హమైనవి ఉన్నాయని వాదిస్తున్నారు.
ద్రౌపది పాత్ర చిత్రణ కూడా ఎబ్బెట్టుగా ఉందని, ద్రౌపది వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా యార్లగడ్డ రచన ఉందని అంటున్నారు. మహా భారతంలో వ్యక్తిత్వం ఉండి, స్వతంత్రంగా వ్యవహరించిన స్త్రీ పాత్ర ద్రౌపది అని, ఆ ద్రౌపది పాత్రను కూడా చులకన చేసే వ్యాఖ్యలు రచనలో ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే, వివాదం చెలరేగిన చాలా రోజుల వరకు యార్లగడ్డ నోరు మెదపలేదు. ఆ తర్వాత తన రచనలో తప్పేమీ లేదని, తాను ద్రౌపది పాత్రను కించపరచలేదని ఆయన ఇటీవల వివరణ ఇచ్చుకున్నారు. Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.