గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 8/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
85.పట్టితి నీ పదమ్మును బ్రభాకర! సాకర! రక్తి మీఱఁ జే 
బట్టి మలంచరా మసక బారిన చూపు సరైన దారికి 
క్కట్టు తొలంచి, భక్తి మెయి కప్పుర పారతు లందఁ జేతు. నీ
చుట్టును చాయనై తిరిగి పోలుదు ! నీ దయ వాల నా పయిన్.
86.పట్టితి నీ పదమ్ములు కృపాకర! వీడకు పట్టి నన్న యో!
పుట్టుచుఁ జచ్చుచున్ దిరిగి పుట్టుచు నెన్ని పురాకు లాయెనో!
యెట్టి తలంతఁ గుందితినొ! యేడుపు వేదన తోడు గాఁగ నా
మట్టు మఱుంగెఱుంగు పరమాత్మవు నీవె గదా! మహోదయా?
87.చెదర ననూరు రాగములు చిందిన కందుల గింజలై దిశల్
కదలిన కందిరీగలయి, కారిన లక్క ద్రవమ్ములై, తుదల్
మెదలిన పొన్ను దమ్ములయి, మీదికిఁ బొంగిన పుట్ట తేనెలై
గుదులెఱ చీమలై గుబులు కొన్న మెఱుంగులునై నభః స్థలిన్!
88.కవి, అరుణారుణ ద్యుతుల కాతువు సృష్టి లతాంత పేశల
చ్ఛవి పొలుపార! అంతమును సల్పుదు వుగ్ర లయాగ్ని లీల! కూ
ర్తువు నవ సృష్టి! నీ కిది ఋతు ప్రియ కారక మైన తీపి! నీ
చవి నెఱుగంగ నా తరమ? సర్వ చరాచర శాసన ప్రభూ!
89.కమలమునై కనుల్ పులుము, గాటపుఁ జీఁకటి నోప లేక మి
త్రము మమతానురాగములు దవ్వులు గాఁగ వియోగ వేదనన్
గుములుదుఁ, దేర్పవా? తరణీ! కోమల పల్లవ దివ్య దీధితుల్
గుములు గుముల్ సరాసరులు గూరిచి చూతువు నా విలాసముల్!
90.ఆసకు మేర లేదు. మరియాదకు, మంచికి దారి లేదు, వి
శ్వాసము సున్న, వన్నె చెడి సన్నగిలెన్ సమతానురాగముల్,
గాసిలె సర్వ ధర్మములు, కాంతి చెడెన్, దెగినట్టి దండలో
పూసలయో! ప్రజల్ చెదరి పోవుదురే! యిటులట్టులిచ్చమై! 
91.సాదుల నెగ్గు లాడితినొ? సల్పితినో గురు నింద? మాన మ
ర్యాదలు మంటఁ గల్పితినొ? ఆరని పాపము కయ్యలోన ఈ
మాదిరి కూరుకొంటి దెస మాలి,  ప్రభూ! పశువై, హతాశమై
రోదమునన్ పొనర్తు, రసరూప రవీ! దయ నుద్ధరింపవే!
92.పేదల నాదుకో నిలుచు వేలుపు నీవు వినా మఱొక్కఁ డీ
మేదిని లేఁడు, ఆర్తి నను మించిన దీనుఁడు లేడు, ప్రోచి, మ
ర్యాద గడించుకో! వెలుఁగు మంతటఁ జల్లని దైవ మంచు, ఛా
యా దయితా! విశేష మహిమా! కరుణారుణ కాంతి పుంజమా!
93.కర్మ కధీనమై కదలుగా ప్రతి జీవియు సృష్టి లోన, నీ
మర్మ మెఱుంగ లేక,  పెనుమాయ యెదో మిను మీదఁ బడ్డటుల్
ముర్ముర ఘోష సల్పు, వెఱపుంగను ఆర్తిఁ దలంచి, కానఁడే!
కర్మ బలీయమన్న నుడి జ్ఞానము, శర్మద! కామిత ప్రదా!
94.నీవు సదా ప్రసాద గుణ నిర్భర కాంతులు చల్లి సేమమున్
జీవుల కెల్లఁ గూర్తువని చెప్పుదు,రిప్పటికిన్ నిరూఢి! నీ
వా విను వీధిఁ , దామ రసమా, మను నీ పడియన్, భళా! నవుల్
ప్రోవులు రేకులై విరియుఁ బుణ్య ఘృణీ! నను బ్రోవ భారమా!
95.పడగల కాల నాగు పయిపై పొర లూడిచి బుస్సు మంచు న
ల్గడలను కాటు వేసినటు క్రమ్మెను చీఁకటి, మూర్ఛ వోయె జీ
వుడు, తొలి సంజ యేర్పడున? పున్నెము దేవుడు భాస్కరుండు క
న్పడునని వేగి వేగి, అరుణమ్ము జపించు, సరోజ సుందరా!
96.ముడుచుకు పోయెఁ దమ్మి కను ముంగల గుంపులు గుంపు లేనుఁగుల్
నడచిన యట్లు చీఁకటులు నల్దెసఁ గ్రమ్మి హరించె సర్వ మీ
యడుసునఁ గూరుకొన్న మము నాదటఁ జేరిచి కూర్చు చుట్ట మె
వ్వఁడు మఱి నీవు దక్క? శృతి పార చరన్మృదు పాద సారసా!



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.