గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2010, ఆదివారం

పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 2 వ భాగము.




ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము (2 వ భాగము)

పాదోzస్య విశ్వ భూతాని, త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుష:, పాదోzస్యేహాభవా త్పున:, తతో విష్వ ఙ్వ్య క్రామత్, సాశనానశనే ఆభి, తస్మాద్విరాడజాయత, విరాజో అధిపురుష:, సజాతోzత్యరిచ్యత, పశ్చాద్భూమి మధో పుర:. ౨.  
ప్రతిపదార్థము:- 
విశ్వ భూతాని = ఎల్ల భూతములును  
పాదోzస్య = ఈ పరమాత్మ యొక్క నల్గవ భాగము. 
త్రిపాదస్యామృతం = ఈ పరమాత్మయొక్క మిగిలిన మూడు భాగములు నాశము  కానిదియైన
దివి (అవతిష్ఠేతి) = స్వప్రకాశమగు స్వరూపమునందు(ఉండును). 
త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుష: = ముప్పాతిక స్వరూపము కల పూర్ణుఁడగు పరమాత్మ.
(సంసారమ్ = శరీర స్పర్శ లేనిపర బ్రహ్మము) ఊర్ధ్వమున ఉత్కర్షముగ నుండెను.
పాదోzస్యేహాభవా త్పున: = ఈ పరమాత్మ యొక్క పాతిక భాగము ఈ మాయను మరల చెందెను.
(అహం = నేను, ఇదం = ఈ, కృత్స్నం = సమస్తమైన, జగత్ = ప్రపంచమును, 
ఏకాంశేన = ఒకభాగముతో, విష్టభ్య = ఆవరించి, స్థిత: = ఉన్నాను,)
తతో విష్వ ఙ్వ్య క్రామత్ = పిమ్మట దేవ తిర్యగాది రూపములతో చేతనా చేతనముల గూర్చి అంతటనువ్యాపించెను..
తస్మాద్విరాడజాయత = ఆ పరమాత్మ నుండి బ్రహ్మాండ దేహము పుట్టెను.
విరాజో అధిపురుష:(అజాయత) = విరాట్ దేహమునకు మీదను పురుషుడు (పుట్టెను).
సజాతోzత్యరిచ్యత = పుట్టిన ఆ విరాట్ పురుషుఁడు అతిక్రమించినవాడాయెను.
పశ్చాద్భూమిమ్ (ససర్జ) = అనంతరము భూమిని, (సృష్టించెను)
అధో (తేషాంపుర:(ససర్జ) = భూమి సృష్టికి వెనుక ఆ జీవులకు దేహములను సృష్టించెను
దండాన్వయము:ఎల్ల భూతములును ఈ పరమాత్మ యొక్క నల్గవ భాగము. ఈ పరమాత్మయొక్క మిగిలిన మూడు భాగములు నాశము కానిదియు స్వప్రకాశమగు స్వరూపమునందు(ఉండును) ముప్పాతిక స్వరూపము కల పూర్ణుఁడగు పరమాత్మ. (సంసారం=శరీర స్పర్శ లేనిపర బ్రహ్మము) ఊర్ధ్వమున ఉత్కర్షగ నుండెను. ఈ పరమాత్మ యొక్క పాతిక భాగము ఈ మాయను మరల చెందెను. (నేను ఈ సమస్తమైన ప్రపంచమును ఒక భాగముతో ఆవరించి ఉన్నాను.) పిమ్మట దేవ తిర్యగాది రూపములతో చేతనా చేతనముల గూర్చి అంతటను వ్యాపించెను. ఆ పరమాత్మ నుండి బ్రహ్మాండ దేహము పుట్టెను. విరాట్ దేహమునకు మీదను పురుషుడు పుట్టెను. పుట్టిన ఆ విరాట్ పురుషుఁడు అతిక్రమించినవాడాయెను. అనంతరము భూమిని సృష్టించెను. భూమి సృష్టికి వెనుక ఆ జీవులకు దేహమును సృష్టించెను.
సీ:-
జీవులు పరమాత్మ పావు భాగము కాగ
ముప్పావు భాగమా పూర్ణు డలరు.
ముప్పాతికగ నున్న పూర్ణుడా పరమాత్మ
ఊర్ధ్వము నుత్కర్ష నుండె జగతి.
మరల పాతిక విష్ణు మాయ గాగ, పిదప.
దేవ తిర్యగ్రూప భావ మొంది,
బ్రీతిని చేతనాచేతనంబులు గొల్పి,
మించుచు తానె వ్యాపించె నతఁడు.
గీ:-
పుట్టె బ్రహ్మాండ దేహ మాదిట్టనుండి.
పురుషు డుదయించె హరిదేహమునకు పైన
నట విరాట్ పురుషు డధికు డగుచు మించి
భూమి సృష్టించె, దేహ జీవులను జేసె. 2.
వివరణ:-
తన శక్తి కంటె అతిశయమగు జగత్తు కన్న నెక్కువ వాఁడయిన యా పరమాత్మకు ఈ భూతము లన్నియు నొక పాతిక భాగముగ నున్నవి.  తక్కిన ముప్పాతిక రూపమును నాశ రహితమై స్వప్రకాశ స్వరూపమునందున్నది. ముప్పాతిక స్వరూపమైన పరమాత్మ అజ్ఞాన కార్యమగు జన్మ జరా మరణాది రూపమున దేహము కంటె బైట నుండు వాడై దాని సంబంధమైన గుణ దోషములచే స్పృశింపఁబడక సర్వోత్కృష్టముగ నుండెను. మిగత పాతిక భాగము సృష్టి సంహారముల చేత మాయను పొందు చున్నది.  మాయను పొందిన వెనుక దేవ తిర్యగాది రూపములతో నానా విధమయి  చేతనా చేతనములలో వ్యాపించి యుండెను.  ఆ పరమాత్మ వలన విరాట్టును పుట్టెను.  ఈ దేహములను ఆధారము చేసుకొని పరిపూర్ణుడగు పరమాత్మ పురుష స్వరూపుడైన జీవుడాయెను.  ఇట్లు జీవించిన విరాట్టువిరాడ్వ్యతిరిక్తమైన దేవతిర్యఙ్మనుష్యరూపుడాయెను.  ఈ ప్రకారము దేవాది జీవ భావమును పొందిన తరువాత భూమిని సృజించెను.  భూమిని సృజించిన వెనుక ఆ దేవాది జీవులకు సప్త ధాతువులతో గూడిన దేహముల సృజించెను. 
ఇది 2 వ భాగము. (స శేషం)
జైహింద్. 



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.