ఆంధ్రామృతాస్వాదనా లోలులారా!
సంస్కృత ఛందమున అశ్వధాటి అను వృత్తము సుప్రసిద్ధము. చదువుటకు ఇంపుగా నుండి, తాదాత్మ్యతను కలిగించుననుటలో సందేహము లేదు. ఆవృత్తములో మన జగదంబను ప్రర్థింతము.
అశ్వధాటి:-
శ్రీకామితార్థములనేకంబులన్ గనుచుమాకీయగా నిలిచితే!.
నీకేమియివ్వగను మాకున్నదిచ్చటను?లోకేశ్వరీ! ప్రియముతో
లోకుల్ నినుం గనుచు లోకేశునే మరచి నీకాళ్ళనే బ్రతిదినం
బేకాగ్రతన్ గొలుచు. మాకున్ గనంబడుమ! శ్రీ కాళికా! భగవతీ!
అశ్వధాటి:-
మందార ధామమున సౌందర్య రాశివయి ముందున్న భక్త జనులన్
డెందమ్మునన్ నిలిపి, బంధమ్ములన్ గొలిపి యందమ్ముగా జగతిలో
విందౌచు మా కనుల ముందున్ గనంబడుచు నిందుండ నీ ప్రకృతిగా,
అందాల తల్లిగ, పసందాల చెల్లిగ, మరందాలనే చిలికెదే!
అశ్వధాటి:-
ఓ పార్వతీ! వినుమ! పాపాలలోకమున మాపాల నీవు కలుగన్
పాపాలనే గనక, శాపాలనే పడక, కోపాగ్నిపాలవక, నీ
రూపాలనే మదిని దీపింపగా నిలిపి, నీ పూజలే సలుపుచున్
ధూపాలతో ప్రథిత దీపాలతోగృహము రూపింపఁగా నగునుగా?
ఆ జగన్మాత కరుణంజేసి అశ్వధాటిత్రయము రూపుదిద్దుకొన్నదని సవినయముగ మనవి చేసుకొనుచున్నాను.
జైహింద్.
Print this post
భీమవరంలో సామాన్యజనానికి అసామాన్య బోధ గొలుపుచున్న అల్లూరి వంశస్థ బ్రహ్మమమ్మ.
-
జైశ్రీరామ్.
ఐం. క్లీం. సౌ. నుత బీజవర్ణ కలితాం ఐశ్వర్య సంధాయినీమ్,
ఐం. క్లీం. సౌ. జగదేక రక్షణచణాం ఆరోగ్య సంవర్ధినీమ్,
ఐం. క్లీం. సౌ. వరపాదపద్మయుగళాం ఆర...
1 రోజు క్రితం
1 comments:
అశ్వధాటి ఛందమునందు మీ రచన తురగము వలె పరువులెత్తినది. ధన్యోస్మి !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.