గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 9/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
97.పుడికితి వింతలో చిబుకమున్ చిటి చేతుల నద్ది, ని
ద్దురన్ బడలిన వేళ ఎంతకును నా కను గప్పిన మైక మారదే!
విడి వడదే తమస్సు! తెలివిన్ గననే! కృతమైన నేరనే!
చెడితిని! దుఃఖ మగ్నమగు జీవు నెటుల్ దయ నుద్ధరింతువో!
98.చీమల బారులై యిరులిసీ! ముసరెన్, సరిదద్రి కాననా
రామ విరూపమై చతికిలంబడె  సృష్టి!  విలుప్త దృష్టి తా
నే మెయి దిక్కు లేక విలపించె, దయోదయ భాసమాన రే
ఖా మసృణారుణ ద్యుతులఁ గావవె! లోక హితైక జీవనా!
99.ముసరిన యెఱ్ఱ చీమల గుముల్ పురుడించుచు సంజ చాయలా
కసమునఁ బ్రాకె, లోకముల కన్నెపు డెప్పుడు వాలి చూచు, నీ
దెస యనుచున్ క్షణ క్షణ ప్రతీక్షణమై ప్రజ వేఁగు చున్నదో
బిసరుహ బాంధవా! కనుల విందొనరింపుమయా! మహోదయా!
100.తామర తంపరలై తవిలి దర్శన మిచ్చిన తమ్మి పూల గా
రాము తలంచుకో, తెలియురా మన బంధమ దెన్ని పుట్టులై
యీ మధురానురాగ రుచి యేర్పడెనో! యరుణాంశు మాలి! రా
వే! మసకల్ దొలంచవె! రవీ! ప్రసరింపవె, కాంతి పుంజముల్! 
101.నీ దరిఁ జేర నా వశమ? నీ వెలుఁ గానుట కేనిఁ జాలనే!
వేద శిఖా సఖమ్ములగు వీధులలో విహరింతువే! దయా
శ్రీ దరహాస కాంతులను చిన్కులుగాఁ గురిపించి, సర్వ స
మ్మోదముఁ గూర్తువే! భువనముల్ పులకింపఁగ, వ్యోమ సుందరా!
102.నీ నిజ ధామమున్ గనఁగనే సుడిగాలిగఁ జుట్టి వచ్చి నా
నీ నిఖిల ప్రపంచ మగుపింతువదేదొ మఱింత దవ్వులో!
లొన బయల్ వెలుంగుదువు! లోకము కన్ను గదయ్య! చూడ నీ
వా? నను, మర్మమా? శ్రుతికె యౌనొకొ వేద్యము? సారస ప్రియా!
103.హాయిగ ఱెప్ప విప్పి కను లందము చింద సరోజ కొంత నీ
చాయను గోరి తుమ్మెదల సన్నయెలుంగునఁ బిల్చు చున్నదో
యీ! యిన చక్రవర్తి! తగవే ముగుదన్ వగ గూర్ప? వేగ రా
వోయి! మెఱుంగు చెక్కిలిని ఒయ్యనఁ దాకుచు లేఁత చేతులన్!.
104.తన చిఱు రేకు లల్లికయి, తా మెయిఁ జుట్టిన చేలగా తన
ర్చిన జలజంబు, నీ సవదరించిన సౌర కుటుంబ ధోరణిన్
దినకర! చెప్పఁ దోఁచు! మణి దీపముగా నెవరయ్య! యీ తమ
స్సును దెగటార్చి, వెల్గు దెస చూపుదు? రీవు వినా! శ్రితా వనా!
105.చాయను వీడవే! యెఱుపు సంజను వీడవె! తమ్మి వీడవే!
జాయల జూచి మేమె పడి చత్తు మటంచును లోక మాడు! తం
డ్రీ! యనుకోదు నీ కతలు, నిప్పులు క్రక్కుదువే! తమిస్ర మే
చాయ మెలంగనీ, తగున? సాధున కిట్టి ప్రియాప్రియత్వముల్.
106.నిగమ నిరూపణాంశువని, నిత్య హిరణ్మయ కాంతివంచుఁ గా
ల గమన హేతు భూతమని, ప్రాణ పదాంబువు పుట్టు వంచు, మి
న్జిగి జిగి వీవటంచు, రుచి సిద్ధ రసాయన మంచు, వెల్గు పూల్
చిగురుచు సౌర శాఖివని చెప్పుదురే! యెటులల్లుఁ జీకటుల్?
107.బ్రదుకిది నీవు లేక తెలవారదు, పాఱదు నీడ కూడ నీ
దు దయ వినా, దవానలము తుస్సుమనున్ గన, లోన వేడి పు
ట్టదు గద! కట్టెకేని, అకటా! వెలిఁగింతువు సర్వ సృష్టి! నీ
కిదె యుదయాగ్ని రూపణ ఘృణీ! ప్రణయాంజలి స్వీకరింపవే!
108.మిన్నుల నేడనో మినుకు మేలిమి వీవు, మృదంశ నే, సమా
సన్నులమై, పరస్పరము చాయగ బొమ్మకిటట్టులుంటి మే
కన్నటు చూచుకో వలయుఁగా! పొర లేలనయా? దివాకరా!
సన్నుతి సేతు, దోయిలిదె! సాకఁగదే! సరసీజ లోచనా!

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.