గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 11/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
121.చీఁకెటు వూచు నీ వెలుఁగు చిందు దువార? మదెట్లు చూచు ఆ 
లోక మహాద్భుతారుణిమ? లోల రవీ! లలితోల్లసచ్ఛవీ! 
నీ కరుణా కటాక్ష సరణింబడి చెప్పితి, నేమి తప్పుగా
నా కను జోతి! యెంచక గుణప్రియ లక్షణ! గారవింపవే!
122.అంధుడనై చరింపఁగలనా భువి? భాస్కర! లుప్త ధర్మ కా
మాంధుడనై భరింపఁగలనా జని? నిర్మల ధర్మ తేజ! యీ
బంధము రొంపిఁ బాపుట కుపాయము కల్గునే? లొక బాంధవా!
స్పంద మనోహరారుణము చాయ వినా, జగదేక పావనా!
123.లోనఁ దలంతు నీ సహజ రూపము నిచ్చలు చండ రశ్మి! క
న్నానునె నిన్నుఁ జూడ, నిగమాంత చరన్నిజ తేజ! శర్వ ఫా
లానలమా! విరించి వెలుఁగా! హరి చక్రమ! నీ శుభ ప్రభా
స్థాన మదేమి? యే మెఁఱుఁగ జాలని జీవన తత్వ వేదమో!
124.పదిసదుపాయముల్గఱపి,బాగుపడుండిఁక మంచిత్రోవలోఁ
బదఁడని నీ వనంగ, అది పట్టక యిట్టటు తూలు వారి నె
వ్విధమునఁ జూచెదో  వెలుగువేల్ప! తమస్సుఁ దొలంచవా? వెలుం
గు దెస మఱల్చవా?  మకర కుండల భూషణ! కాంతి పోషణా!
125.పదముకొఱంతభావమదిపట్టదుమున్నరసమ్ముసున్నయే
కుదురు గుణమ్ము లేదు,  పలుకుంజెలి లాలన తక్క,  చెప్ప నై
నది పయి మిన్నులందని మహా గహన ద్యుతి రూప మెట్లొ నా
కొదవ సహించి, నీ వెలుఁగుఁ గోవెల దివ్వె భజింపనీయవే!
126.చిలిపిగఁ చంటి పాప చిటి చేతులతో అల మింటి మీఁది జా
బిలిఁ దన ఆట కోసమయి పిల్చిన యట్టులు, వేల్పు మిన్నలే 
తలఁప నశక్యమైన నిను దైవత మౌళి మయూఖ మాలికా
విలసిత పాద పీఠుని రవీ! కను చాయ మెలంగఁ గోరుటల్.
127.సీ:- గోమయ పిండ సంకుల ధూమ శిఖి శిఖా సంతాన మరణాంశు సరణిఁ దోఁప,
ఆల పా, లేరు ప్రా లలవోక చెలుములై పరమాన్న సౌభాగ్య భరము గొలుప,
పసుపు చాయకుఁ దోడు పలుకు కుంకుమ పురం ద్రీ పూజనము రవి తేజుఁ దెలుప, 
బ్రహ్మ పదార్క పత్ర స్నాన దీధితి జన్మ జన్మల యలసటఁ దొలంగ, 
గీ:- మాఘ సిత సప్తమీ మహా మహిత వేగ చటుల సప్తాశ్వ రథ చక చ్చకిత సర్వ
లోక భాస్కర! నిన్నుఁ గొల్చుటలు మాకు సాధ్యమటె? లీల నీ సుదర్శనము దక్క!
128.కొనుమయమాప్రణామములుకోటిసమీప్సితకాంతిమండలా!
వినుమయ మా మొరల్ వినుత వేదవధూ నవ రత్న కుండలా!
కనుమయ నీదయా నయనకాంతులతోఁగను పండువౌనటుల్.
అనదనయా!మహోదయ!మహాద్యుతి!యేలుమయా!రసాకృతీ!
129.శరణు మహా ప్రభూ! భువన సంచరణా! కిరణైక భూషణా!
సుర నర సిద్ధ మౌళి మణి శోభిత దివ్య పదారవింద! భా
స్కర! ప్రణతి ప్రియా! తులిత కాంచన వర్ణ! సముచ్చలత్ ప్రభా
భరణ! శుభంకరా! శరణు! పాప తమస్సు హరింపరా! రవీ!
130.తొలఁగునె జన్మజన్మముల దోసముచీఁకటి? లోకబాంధవా!
కలుగునె పాడి పంటలు, వికాసము? నీ కరుణారుణ ప్రభల్
వెలుఁగునె వీడు వాకిలి మణి స్ఫుట మంజు మయూఖ మాలికన్
జలజ విలాస హాస రుచి! సప్త తురంగమ మంగళ ద్యుతీ! 
131.కాంతికరా! సరోజ మణి కాంతులు బంతులు వెట్టు నీదు శు 
ద్ధాంత రహస్యముల్ దెలియునా? యొక పాటికి, లేక నే గరు
త్మంతుఁడనా? వినీతి హనుమంతుఁడనా? సిత కాంతియైన ధీ
మంతుఁడనా? విలాస మహిమా! జయ మంగళ రంగ దీపికా!
132.పొలుపుగ నిన్దలంచి,మునుముంగల రంగులమ్రుగ్గు భానుమం
డలము రచించి, కుంకుమ పినద్ధ జలమ్ముల పళ్ళెరమ్ములో
లలి అరుణ ప్రదక్షిణ పురస్సర దండ నమస్క్రియా విధిన్
దెలుపుచుఁ బువ్వు నుంచెదము దీప్తి కరా! తిమిరమ్మునార్పరా!


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.