గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2010, శనివారం

ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 10/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 
జైహింద్. 
ప్రసన్న భాస్కరము 
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. 
109.లోచన మర్యముండఖిల లోకము చూడఁగ నంచు వేదమా 
లోచన మందఁ జేసె, నది రూఢి గదా! మఱి యేల ప్రోజ్జ్వల
ద్రోచి! ముసుంగు వేసి, కను లోపముగాఁ జలియింతు విట్టు? తం
డ్రీ !  చనునే యతిక్రమణ లీలలు సాధు పథానువర్తికిన్?
110.పరమ దాయాళుఁడర్యముఁడు, భానుఁడు, సారస వల్లభుండు, భా
స్కరుఁడు,తమో హరుండు, రవి, కాంతి కరుండు, తమిస్ర లోక భీ
కరుఁ డరుణారుణ ప్రభలఁ గ్రాలెడు వేలుపు నాకుఁ జుట్టమై
వఱలుత! నేత్ర దోష భవ బంధ విమోచన పుణ్య దీప్తితో! 
111.పరమ దయాళువైన భగవంతుని నిత్యత వే వెలుంగులై
దరిసెన మిచ్చినన్ తెలియదా? కనుదమ్ములు విప్పికోవటే?
అరుణ మెఱుంగదా? సలుపదా కుసుమార్ఘ్య జల ప్రదానముల్?
హరహర! జీవి బాగు పడునా? పది లక్షల జన్మ లెత్తినన్!
112.చూచుచు నుండగాఁ గనులు చుట్టుకు పోయె నిదేమి? తీవ్ర రో
చీ! చిఱు చీకటుల్ ముసరె, జీవము వాడెనయో! వివర్ణమై
తోఁచె జగత్తు! ఈ బెదురుతో నడయాడు టదెట్లు? వెన్నెలల్
పూచిన వెల్గులన్ బఱపి ప్రోవుమయా! కరుణా రసోదయా!
113.దినమణి, లోక బాంధవుడు, దివ్య కృపా కిరణుండు, పాప భం
జనుఁడు, సమగ్ర దర్శనుఁడు, సత్తెపు వేలుపు, సర్వ సాక్షి, పా
వనుఁడని, వేద శాస్రములు వాకొను, నా కను చూపు లోపమా?
వినునది దోషమా? నిలుపు వే వెలుఁగై నను తేర్చి నీ కతల్!
114.ఆకలి దప్పు లార్ప రుచి రాన్నము లంబువు లిచ్చి, బంతి పూ
రేక వెలుంగులన్ జిలికి, రేఁ బవలీ జడ జీవ సంతతిన్
సాకెదు కన్న తండ్రి వలెఁ, జల్లని తల్లి వలెన్ బ్రభాకరా!
నీ కను చాయలన్ దెలియ నేరని చీకటి మాయ మాపవే!
115.నిన్ను వినా మఱెవ్వరిని నే శరణంచు సమాశ్రయింతు? నో
మిన్ను దొరా! ప్రసన్నుఁడవు, మించి శ్రితార్తి హరుండ! వేడనో
మిన్నుల నుండి కూడ కనుపింతువు మ్రోల! సమన భావ సం
పన్నుఁడ! వర్థిఁ గొ్ల్చుటలు  పాపమ? నా కను లోపమా ప్రభూ! 
116.మహిమా లోక దివాకరా! ద్యుతులతో మారాజువై యుండి, యీ
బహి రంతస్తిమిరంబు నార్ప నయన ప్రద్యోతనా లోకన
స్పృహఁ గోల్పోయి యెటుల్ భరింపఁ గల నీ జీవంబు,? పద్మ ప్రియా! 
బహు లోక ప్రియ జీవనా! శ్రిత జన ప్రారబ్ధ నిర్మూలనా!
 117.నిను గనినంత  నీ ప్రకృతి నిర్భర మోదముతో చెలంగు, వే
గున ద్విజ రావముల్, తరులు కొండలు, కోనలు లేచి జోత ల
ప్పన మొనరించు, పద్మములు పాయన మిచ్చును, తేనె ధార. లు
బ్బున నడయాడు లోకము ప్రభూ! అరుణారుణ పేశల చ్ఛవీ!
118.నిను గనలేరు చండ రుచి! నీరజ గర్భ హరాదులన్నఁ జీఁ
కునకుఁ దరమ్మె? చిచ్చుమియుకుండవొ! పచ్చ పసిండి రెమ్మవో!
మిను మెడఁ దాల్చు పట్టెడవొ! మించును మించు నొయారి యంచవో!
కనికర మూని  చూపఁగదె, కంజహితా! నిజ రూపు రేఖలన్?
119.కనులున్నన్ గనదే ప్రపంచము మహా గాఢాంధ కారమ్ములో
వనమేదో, పురమేదొ, జీవన మెదో, వాగేదొ, యేదేదియున్
గనరాదే! యెటుఁ గప్పె మంచుతెర? వీకన్ జీఁకటుల్ త్రుంచి,వె
ల్గును బెంచన్ మఱి యెవ్వరయ్య నిపుణుల్? లోలార్క ! కైకో! నతుల్.
120.కనుముందే పెను చీఁకటిన్ బడి, జగత్ కల్యాణ నేత్రాబ్జ మ
ల్లన సంకోచముఁ బొందె, డిల్ల పడె సర్వ ప్రాణులున్, రాగ రం
జన చైతన్య మయూఖ మాలికలతో, సప్తాశ్వ వేగమ్ముతో,
ఇన దేవా! కననీవె దర్శనము, తండ్రీ! పద్మినీ వల్లభా!

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.