కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసము నుండి కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్ప వృక్షము నందలి భావుకతను వివరిస్తున్న 28 భాగాలింత వరకూ తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం 29వ భాగము చూద్దాం.
విశ్వనాథ భావుకత. 29 వ భాగం.
నిరంతర చాంచల్య శీలయైన మనస్సు నందు విషాదము రేపుతున్న సంఘర్షణ అవధులు లేనిది. ఒక ప్రమాదం ఎదురైనప్పుడు దానికి తానే కారకుడనని భావించుకొనే దు:ఖ చేతస్కునికి కలుగుతున్న భావ పరంపరల్లో ఇది ఒక అవస్థా విశేషము.
సీత రావణుని చేత తీసుకు పోబడినది అని కొనప్రాణంతో ఉన్న జటాయువు రామునికి ముందుగానే చెప్పి యున్నాడు. ఆ తరువాత రామ లక్ష్మణులు ఆ తల్లిని వెదుకుతూ తిరుగుతున్నారు. ఇప్పుడు రాముడు ఏమనుకొంటున్నాడంటే " సీతాపహరణ వృత్తాంతం తెలియకపోయినా బాగుండును. నన్ను వెదుక్కుంటూ సీత అరణ్యములోనికి పోయినదేమో అని మనస్సును మభ్య పెట్టుకొని యుందును కదా!" అని విచారిస్తున్నాడు.
అత్యద్భుత సౌందర్యోపేతమైన పంపా సరస్సును చూచి శ్రీరాముడు సీతా విరహ వ్యథను మరచినాడు. ఆవిస్మృతి క్షణ కాలమే. ఎంత మరచిపోవుద మనుకొన్నను అ యమ్మ ఎడబాటు రామునకు దుస్సహముగా ఉన్నది. `ఇంత ఆలస్యము చేసానని సీత నాకోసము అడవుల్లో వెదకాడానికని వెళ్ళి ఉంటుంది`. అని క్షణ కాలం ఆత్మను మరిపించుకోడానికి కూడా పాపం రామునికి అవకాశం లేకపోయినది. ప్రతిక్షనం ఆయన సీతా మార్గణ వ్యగ్ర మనస్కుడు అవుతున్నాడు.
దు:ఖావస్థ బహు విచిత్రమైనది. సూక్ష్మ దృష్టితో చూచినచో అది యొక్క సంసృష్టి. అనగా అనేక భావ సమ్మిళితము. ఇది దు:ఖావస్థననుభవించిన వానికే తెలియు రహస్యము. మహా కవుల భవము లన్నియు పాఠకులకు అనుభూతులై ఉండ వలెనని లేదు. తత్తద్భావముల యందు పఠితలు ఉదాశీనులై యుండ వచ్చును. తప్పు లేదు. వైరాగ్య భావ హృదయుడు శృంగార వర్ణనా విముఖుడు కావచ్చును గదా!
విశ్వనాథ తన స్వీయ ప్రజ్ఞచే మానవ లోకము లోని దు:ఖావస్థల యొక్క బహు సూక్ష్మాంశములను దర్శించెను. కల్ప వృక్షము లోనిఈ విధమైన వర్ణనలు మరి ఎక్కడా కన్పించవు.
శ్రీరాముని యందు కన్పించు ఈ సీతా వియోగ వ్యథ తిలతండుల న్యాయమున వ్యక్తాంశములను, క్షీర నీర న్యాయమున అవ్యక్తాంశములను స్ఫురింప చేయును. (నువ్వులు బియ్యము కలిపినచో రెండూ వేరు వేరుగా కనఁబడును. పాలు నీరు కలిసినచో అవి రెండూ వేరు వేరుగా కనఁబడవు.) అట్లే రస భావముల యందు తద్వర్ణనలందును సంసృష్టి ఉండును.
విశ్వనాథ పద్యము ఇది:
ఇంతాలస్యము చేసినాననుచు దాఁ నేమైన నాకోసమే
కాంతారంబున యందు నన్ వెదకగా క్ష్మాపుత్రి యేతెంచెనా
ప్రాంతారణ్యములందు నామె కనగా రక్షో దురాచార వృ
త్తాంతంబాత్మను మభ్యపెట్టుకొన కాసంతైన వీలీయకన్. {వి.రా.క.వృ.కి.కాం.నూ.29.}
యామామనుగతా మందం పిత్రా ప్రస్థాపితం వనం
సీతా ధర్మం సమాస్థాయ క్వను సావర్తతే ప్రియా. (వాల్మీకి రామాయణం)
(నేను దురదృష్టము వలన తండ్రి చేత అడవులకు పంప బడ్డాను. కాని సీత ధర్మాన్ని పాటించి నా వెంట వచ్చినది. ఇప్పుడామె ఎక్కడ ఉన్నదో!!)
"క్వను సా వర్తతే ప్రియా" అను వాల్మీకి వాక్కును విశ్వనాథ `ఆత్మను మభ్య పెట్టుకోడానికి వీలు లేకుండా రావణ దురాచార స్మృతి రామునికిమనశ్శల్యము వలె ఉన్నదని` వివర్తించినాడు.
(బులుసు వేంకటేశ్వర్లు, 9949175899)
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.