సోదరీ సోదరులారా!
మనము పొందే ఆనందానికైనా విషాదానికైనా మూలకారణం ఎవరంటారు? ఎవరో ఎందు కవతారండీ! మన మనసే కదా ఆలోచిస్తే. ఎలాగంటారా?
మార్గం మధ్యలో ఒక ప్రమాదం మన కంట పడిందనుకుందాం. ఏమిటీ? ఏక్సిడేంటా! అయ్యో పాపం ఎవరూ పోలేదు కదా? అని రెండు మాటలు అందరితో పాటు అనేసి మన పని మీద మనం వెళ్ళిపోతాం. ఇంతలో ఆ ప్రమాదానికి గురయిన వ్యక్తి మనకు అత్యంత సన్నిహితుడనో, లేక బంధువనో, లేక కుటుంబ సభ్యుడనో తెలిసిందనుకోండి. వేంటనే ఆఘ మేఘాలమీద అక్కడికి పరుగు పెడతాం.
చూచారా ముందు మన స్పందనకీ, తరువాత మన బంధువని తెలిసిన తరువాత మన స్పందనకీ ఎంత తేడా ఉందో?
కారణం ఏమంటారు? కేవలం మన మనసే కదాండీ? కాదన గలరా?
అందుకే ఈ విషయంలో మన పూర్వీకులు ఒక చక్కని లోకానుభవ పూర్వకంగా చెప్పిన శ్లోకం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడండా శ్లోకాన్ని.
శ్లో:-
మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో:
బంధనా విషయాసక్తం ముక్త్యై నిర్విషయగ్ స్మృతమ్.
క:-
మనిషికి బంధము మోక్షము
మనసువలన కలుగుచుండు. మది విషయమునన్
తనియక నిలచిన బంధము.
తనియుచు నిర్ విషయమైన ధర మోక్షమిడున్.
భావము:-
ప్రాణులకు బంధ మోక్షములకు మనస్సే కారణము. ఆ మనస్సు సవిషయమైనచో బంధముం జేయును. నిర్విషయమైనచో మోక్షముం జేయును.
ఆముక్తమాల్యదలో ఇదే శ్లోకార్థం చొప్పిస్తూవ్రాసిన పద్యం కూడా తిలకించండి.
ఆ:-
ప్రాణికోటి కెల్ల బంధంబు మోక్షంబు
చేరుటకును మనసు కారణంబు
విషయ సంగియైన విను బంధ కారి, ని
ర్విషయ మైన, ముక్తి విభవ కారి.
చూచారు కదండీ. మన మనసు తామరాకు మీద నీటి బిందువు లాగా ఉంటే చిదానందంగా ఉండవచ్చును కదా? మరి అది మనకు సాధ్యమౌతుందంటారా? మీరూ ఆలోచించండి.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.