గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము నందలి 6 వ పద్యము నుండి 10వ పద్యము వరకు..... రచన .. చింతా రామకృష్ణారావు... గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి

 జైశ్రీరామ్.

6. శిక్షార్హులీ ధర వశించుచు వ్రేచుచుండన్   

శిక్షింపవేమిటికి. శ్రీకర చిద్విభాసా.

రక్షింప నిన్ మది నిరంతరమున్ నుతింతున్.  

నిక్షేపమీవెకద నిస్తుల సూర్యదేవా.  


7. ఆరోగ్యమిచ్చెడిమహాత్ముఁడ వీవె కాదా.  

మా రోగముల్ తొలఁగ మమ్ము గనంగలేవా. 

కోరంగ నేల నను కూర్మిని జూచు నిన్నున్ 

భారంబొ నేను సురవందిత సూర్యదేవా. 


8. జీవాళికాదరవు చింతన చేయ నీవే.  

భావింప మా తరమ వర్ధిలు నీదు తేజం

బో వందనీయ. పరమోద్ధతి కొల్పు దీవే. 

భావింతు నిన్ సతము భాగ్యద సూర్యదేవా.   


9. నీ నామ రూపముల నే కన లేను దేవా.

మౌనంబుగా మదినె మన్ననఁ జేయనిమ్మా

దీనావనా సుగుణ తేజసమిమ్ము మాకున్.  

జ్ఞానోజ్వలా! సతము కావుము సూర్యదేవా. 


10. ఆదిత్య దైవమ! గ్రహాధిప వందనంబుల్.

నీ దివ్య శక్తిని పునీతమగున్ జగంబుల్.

సాధారణోష్ణము సుసంపద. చాలు మాకున్.  

మోదంబుతో కనుమ పూజ్యుఁడ.సూర్యదేవా.  


రచన .. చింతా రామకృష్ణారావు.

గానము .. శ్రీమతి బీ.సుశీలాదేవి భాగవతారిణి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.