మేలిమిబంగారం మన సంస్కృతి….సూక్తిమౌక్తికాలు
1. శ్లో. గజాననం భూత గణాధి సేవితమ్ - కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్న - మామి విఘ్నేశ్వర పాద పంకజమ్.
తే.గీ. శ్రీగజానను, జీవాళి సేవలు గొను,
ఘన కపిత్థజంబూఫలఖాదికి, నుమ
కంటివెలుగైన, దుఃఖముల్ కాల్చునట్టి
యాత్మ గణపతి పదములకంజలింతు
క. గజ వక్త్రు, పార్వతీసుతు,
విజయదు, జంబూ కపిత్థ ప్రియ ఫల ఖాదిన్,
భజియించి, వాని పదములు
నిజమనముననిలిపి చేతు నేర్పున ప్రణతుల్.
భావము: గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖ వినాశ కారకుడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను.
2. శ్లో. అంగం
గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం
వృధ్ధో యాతి గృహిత్వా
దండం
తదపి న
ముంచత్యాశాపిండం.
గీ. తనువు చిక్కు, తల నెఱియు, దంతతతియు
ఊడు, నడువ దండముఁ గొను, వడుకుచుండు
నట్టి వృద్ధత్వమొందియు నతులమైన
యాశ వీడదు, పెఱుగుచుండదియె వింత.
భావము. శరీరము కృశించి, చిక్కి ముడతల పడినను, తల పూర్తిగా నెరసి పోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసియైనను, ముసలి తనం వచ్చి కర్రను పట్టుకుని గాని నడువలేక పోయినను ఆశమాత్రము అతనిని వదలదు.
3. శ్లో. అంజలిస్తాని పుష్పాణి
వాసయంతి కరద్వయం ౹
అహో సుమనసాం ప్రీతిర్వామదక్షిణయో: సమా౹౹
తే.గీ. కరములన్ జేరు పుష్పముల్ కలుగఁ జేయు
రెండు చేతులకున్ దావి మెండుగటులె
మంచివారిని చెడువారనెంచకుండ
ప్రేమగా జూతురందరిన్ ధీమహితులు.
ఆ. దోసిటగల పూలు వాసన కలిగించు
రెండు చేతులకును నిండుగాను.
సుజనులట్టులుండు, చూపరు భేదంబు.
కుడిని యెడమ నొకటె కూర్మి చూపు.
భావము. చేతిలో ఉన్న పువ్వులు భేదం లేకుండా రెండు చేతులను
సుగంధ భరితంగా చేస్తాయి. అలాగే సహృదయులు చెడ్డవారని,
మంచివారని బేధం లేకుండా సమంగా ప్రేమిస్తారు.
4. శ్లో. అ కరుణత్వ
మకారణ విగ్రః
పరధనే పరయోషితి
చ స్పృహా
సుజన బంధు
జనే ష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధ
మిదం హి
దురాత్మనాం.
తే.గీ. దయయె లేకుండు. కలహించు భయములేక.
పరుల ధన, స్త్రీల నాశించు. పరవశించు.
కారణము లేక ద్వేషించు ఘనుల, మిత్ర
వరుల, దుష్టుని. సహజాత మరయ నిదియె.
భావము. దయాగుణము లేక పోవుట, అ కారణముగా అందరితో కలహించుట, పరుల ధనమును స్త్రీలను కోరుకొంటూ వాటితో పరవశించుట, గొప్ప వారిని, మిత్రులను కారణము లేకుండానే ద్వేషించుట మొదలగు యిటువంటి గుణములు దుర్మార్గులకు పుట్టుకతోనే వచ్చును.
5. శ్లో. అకర్తవ్యేష్వసాధ్వీవ తృష్ణా ప్రేరయతే జనం
తమేవ సర్వ పాపేభ్యో లజ్జా మాతేవ రక్షతి.
ఆ. సాధ్వి కాని వనిత చందమౌనత్యాశ.
చేయరాని పనులు చేయఁ జేయు.
కన్నతల్లి యట్లు కాపాడు సల్లజ్జ,
చెడును చేయనీక నడుపు చుండు.
భావము. దుష్ట స్త్రీ వలె , అత్యాశ - మానవులను చేయరాని పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. లజ్జ (సిగ్గు) మాత్రం కన్నతల్లి వలె వారిని సమస్తపాపాలనుండి (చెడు పనులు చేయనీయకుండా) కాపాడుతుంది.
6. శ్లో. అకామాన్ కామయతి యః, కామయానాన్ పరిత్యజేత్
బలవంతం చ యో ద్వేష్టి తమాహుః మూఢచేతసమ్.
క. ఇష్టపడని వారినిష్టపడుచు, తన
నిష్టపడెడివారినిష్టపడక,
బలునితోడ వైరములు పెట్టుకొని చెడు
మూర్ఖుడెపుడు. కనుడు పూజ్యులార!
భావము. ఎవడు తనను ఇష్టపడనివారిని ఇష్టపడతాడో, ఎవడు తనను ఇష్టపడేవారిని వదలుకుంటాడో, ఎవడు బలవంతునితో వైరం పెట్టుకుంటాడో వానిని మూఢాత్ముడు అంటారు.
శ్లో. అకాలే కృత్యమారబ్ధం కర్తుర్నార్థాయ కల్ప్యతే
తదేవ కాల ఆరబ్ధం మహతేஉర్థాయ కల్ప్యతే.
క. సమయము గని పనులు మనము
సముచితముగ సలుప సుఫల చయము కన నగున్
సమయము విడి సలుపు పనులు
సముచిత ఫలమొసగవు కద! సమయము కననౌన్.
భావము. సమయంకాని సమయంలో ప్రారంభించిన పని కర్తకు ప్రయోజనాన్ని కల్పించదు. అదే పనిని సరియైన కాలంలో ప్రారంభిస్తే అతనికి గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
శ్లోll అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.70
తే.గీll పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము:- ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధమ్. అసాధుమ్ సాధునా జయేత్.
జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేనచాஉనృతమ్.
గీ. కోపమును శాంతిచే గెల్చుకొనగవచ్చు.
సాధువృత్తినచే గెల్తుమసాధుతతిని,
పిసినితనమును దానాన పెకల వచ్చు.
నృతముతోడనె గెలుతుమనృతమునిలను.
గీ. కోప విరహిత బుద్ధిచే కోపి మనసు,
సాధు గుణమున దుష్టునసాధు మతిని,
లోభినీవిని, మరియు నీ లోని సత్య
మున నసత్యమున్ విజయించి ముక్తి గనుడు.
భావము. శాంత స్వభావముతో క్రోధమును జయింప వచ్చును. సాధు స్వభావముతో అసాధుస్వభావమును జయింప వచ్చును. పిసినిగొట్టుతనమును దానముతో జయింప వచ్చును. అబద్ధమును సత్యముతో జయింప వచ్చును.
శ్లో. అక్షరద్వయ
మభ్యస్తం “నాస్తి నాస్తీ”తి యత్పురా
తదిదం “ దేహి దేహీ
”తి విపరీతముపస్థితమ్.
ఆ. నాస్తి నాస్తి యని యనాథులకీయమి
నాటి లోభితనము నేటి ఫలము.
దేహి దేహి యనుచు దేవురింపఁగ వచ్చు.
దాన ధర్మబుద్ధి దైవ గుణము.
భావము. పూర్వం “నాస్తి, నాస్తి ” అనే రెండక్షరాలు నేర్చిన ఫలితంగా ఇపుడు “దేహి,దేహి” అనవలసిన విపరీత స్థితి ఏర్పడింది ! (పూర్వం ఎవరికీ దానం చేయకపోవటం వల్ల , ఇపుడు యాచించే స్థితి సంక్రమించింది.
గణేశ శ్లోకం:
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ప్రతిపదార్థము:
అగజ = పార్వతీ దేవి యొక్క;
ఆనన = ముఖము అనెడి;
పద్మ = కమలమునకు (ప్రకాశింపఁ జేసెడివాఁడగు),
ఆర్కం = సూర్యుడయినవానిని;
గజ = ఏనుగు;
ఆననం = ముఖము కలవానిని;
అహః నిశం = పగలు; రాత్రి;( ఎల్ల వేళలా)
భక్తానాం = భక్తుల కొఱకు;
అనేక = చాల;
దం = ఇచ్చువాడగు (వరములు);
ఏక = ఒకే;
దంతం = దంతము కలవాడగు;
తం = అట్టి వినాయకుని;
ఉపాస్మహే = ఉపాసింతుము.
క. అగజ ముఖాంబుజ దినకరు,
ప్రగణిత గజముఖుని, సతము భక్తుల కోర్కెల్
జగమున నొసగెడి మహితుని
సుగుణదుఁడగు నేకదంతు, శుభదు భజింతున్.
గీ. యజ్ఞవాటిక కింటికి,అఖిల పుణ్య
క్షేత్రములకు,వృద్ధులు, గురు, శిశుల, గర్భ
వతుల, రాజుల దేవులన్ వట్టి చేతు
లనిల గనగ పోరాదంద్రు వినయ మతులు
భావము.(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగింపఁ జేయు సూర్యుఁడువంటి వానిని, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని ఉపాసింతుము.
శ్లో:-
అగ్నిదో గరదశ్చైవ
శస్త్రోన్మత్తో ధనాపహః
క్షేత్ర దార
హరశ్చేతాన్
షడ్విధా నాతతాయినః
.
తే:-
అగ్ని విషములు బెట్టెడి అధముల, మఱి
ఆయుధంబునజంపెడి అశుభ పరుల,
క్షేత్ర దారల హరియించు కౄరుల, గని
ఆతతాయిగ చెప్పగ నర్హమగును.
భావము:-
ఇంటికి కాని, సంసారములో కాని అగ్గి పెట్టే వారినీ, పరులపై విష ప్రయోగము చేసే వారినీ లేదా విషము గ్రక్కే వారినీ, ఆయుధముతో దాడి చేసే వారినీ, భూములనపహరించే వారినీ, భార్య నపహరించే వారినీ, ఆతతాయిలు అని అన వచ్చును.
శ్లో. అగ్నిహోత్రం
గృహం క్షేత్రం
, గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం
దైవతం గురుమ్ .
ఆ. అగ్ని కడకు, స్వగృహ, మారాధ్యదైవమ్ము
సన్నిధులకు, గురుని సన్నిధికిని
క్షేత్రములకు, వృద్ధ, శిశువుల చూలింత
వట్టి చేత పోకు ప్రభులఁ జూడ.
గీ. వట్టి చేతుల పోరాదు వసుధపైన
అగ్నికార్యంబు, స్వగృహంబు, నఖిల క్షేత్ర
ములు, గురున్, గర్భిణిన్, వృద్ధు, భూపు, దైవ,
బాల దర్శనార్థము పోవుచో. భవ్యులార!
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి, సమర్పించ వలెను.
శ్లో:-
గురుం వా,
బాల, వధ్వౌవా,
బ్రాహ్మణంవా బహు
శృతం.
ఆతతాయిన మాంతవ్యం
హంత్యాదే వవిచారయన్.
తే:-
గురువు, బాల వధువనక, గొప్ప వేద
విదుడు బ్రాహ్మణుడనకుండ కౄరముగను
ఆతతాయైన చంపగ నర్హమయ్య.
యోచనేమియు లేకయే. నీచు లంచు.
భావము:-
ఆతతాయి అయితే అట్టి వారు గురువవ వచ్చును, బాలులవ వచ్చును, స్త్రీ లవ వచ్చును, అనేక వేదముల నెఱిగిన బ్రాహ్మణు లవ వచ్చును, అటువంటి వారిని విచారణ చేయనక్కర లేకుండానే హతమార్చ వచ్చును
శ్లో. అజరామరవత్
ప్రాజ్ఞో విద్యామర్థం చ
సాధయేత్,
గృహీత ఇవ కేశేషు
మృత్యునా ధర్మమాచరేత్.
క. జరయును, మరణము లేనటు
ధర విద్యా ధనములందెదరు కనఁ బ్రాజ్ఞుల్.
మరణము దరి కొనినటులుగ
చరియింతురు ధర్మములనుసరణీయమెదే.
గీ. ముసలితనమును మృతియునుపొందననుచు
ధనము విద్యయు సాధించి మనుట శుభము.
మృత్యు ముఖముననున్నట్లు నిత్యమునిలను
ధర్మవర్తన మెలగుట ధర్మమర్తయ.
ఆ. ముసలితనము, మరణము తనకు లేనట్లు
ధనము విద్య లరసి గొనుత నరుడు.
మృత్యువమరుటెఱిగి నిత్యంబు ధర్మము
చేయుచుండుటొప్పు. చేయుడయ్య.
గీ. మరణమన్నది లేనట్టి మహితునివలె
ప్రాజ్ఞుఁడాస్తిని విద్యను పడయవలయు
మృత్యు వొందుట ముందున్న సత్యమనుచు
ధర్మ మొనరించగావలె మర్మము విడి.
గీః- ముదిమి మరణము లేనట్లు ప్రోగు చేయు
ధనము, విద్యయు ప్రాజ్ఞులు ధరణిపైన.
కేశమును పట్టె మృత్యువన్ ధ్యాస గలిగి
ధర్మ మాచరింపగ తగు ధన్యత గన.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే ఆలోచనతో - విద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు పోవటానికి సిద్ధంగా ఉందనే ఆలోచనతో ధర్మాన్ని ఆచరించాలి.
శ్లో. అజ్ఞానాత్ యది వా మోహాత్ కృత్వా కర్మ విగర్హితం
తస్మాద్విముక్తి మన్విచ్ఛన్ ద్వితీయం న సమాచరేత్.
గీ. జ్ఞాన హీనత చేతనో కామ, మోహ
మదములను చేసి, దుష్కృత్య వ్యధను పొంది,
మదిని చింతించు వారలు మరల నటుల
భావము. అజ్ఞానంతో గానీ, మోహం వల్ల గానీ ఒక నింద్యమైన పనిని చేసి, దాని నుండి విముక్తి పొందదలచిన వారు అలాంటి పని మరొకసారి చేయకూడదు.
శ్లో: అజ్ఞానా
దథవా జ్ఞానాదుత్తమః
శ్లోకనామ యత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో
యథా உనలః (భాగవతము 6-2-18)
గీ: గడ్డి మేటునె యగ్గి తా కాల్చినట్లు
తెలిసి హరి యను భక్తుల,తెలియకుండ
హరిని పలికెడి భక్తుల దురిత తతిని
కాల్చివేయును. హరినామ ఘనత గనుమ.
భావము: అగ్ని ఏ విధముగా గడ్డి మేటిని దగ్దింపజేయునో అట్లే ఎవరు తెలిసి గాని, తెలియక గాని ఉత్తమః శ్లోకుడగు భగవంతుని నామమును కీర్తించుదురో వారి సమస్త పాపరాశి భస్మీ భూతమగును.
శ్లో. అతి
కామాత్ దశగ్రీవః – అతి
లోభాత్ సుయోధనః,
అతి దానాత్
హతః కర్ణః,
– అతి సర్వత్ర
వర్జయేత్.
ఆ.వె. కామ లోభ దాన కర్మంబు లమితమై
రావణ కురుపతులు నీవి కర్ణు
డిలను చంపఁబడిరి. మెలగుట మంచిది
మితిని మీరకుండ క్షితిని జనులు.
భావము. మితి మీరిన కామముచే రావణాసురుఁడును, మితి మీరిన లోభ గుణముచే సుయోధనుఁడును, మితిమీరిన దానగుణముచే కర్ణుఁడును భూమిపై చంపఁ బడిరి. కావున ఏ విషయములోనూ మితి మీరి ప్రవర్తించుట మంచిది కాదు.
శ్లో. అతి
పరిచయా దవఙ్ఞా, సంతతగమనా
దనాదరో భవతి
మలయే భిల్ల
పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం
కురుతే.
గీ. చనువు పెఱుఁగ నలక్ష్యము సంభవించు.
నిరత మేగ ననాదరణీయులవరె?
జీర్ణ గంధపు మ్రానుల చేత వంట
భిల్ల వనితలు చేయరే? విరివి చేసి.
భావము. పరిచయము ఎక్కువయినకొద్దీ అలక్ష్యభావము పెఱుగును. అస్తమాను వస్తూ పోతూ ఉంటే అట్టివారిపై అనాదర భావము పెఱుగును. మలయ పర్వతములపై లభించెడి చందనదారువు మనకెంతో అపురూపమైనది. అట్టి మంచి గంధపు చెట్టు కర్రను అక్కడ నివసించే కోయ స్త్రీ వంట కట్టెలుగా ఉపయోగించుచుండును కదా!
శ్లో. అతి
రమణీయే కావ్యే పిశునోన్వేషయతి
దూషణాన్యేవ.
అతి సుందరేపి
వపుషి వ్రణమేవహి మక్షికా
నికరః.
క. దుష్టుఁడు నిరతము తప్పుల
నిష్టంబుగ వెదకుఁ గృతుల నేర్పడు గుణముల్
స్పష్టంబుగ కనుట మదికి
కష్టంబగు. కనగ మక్షికాన్యాయమిదే.
భావము. ఈగ అందమైన శరీరముపై వ్రాలుటకిష్టపడదు. సరికదా వ్రణములపై వ్రాలుటకే ఎంతో ఇష్టపడును. అటులనే అతి రమణీయ కావ్యమున దుష్టుఁడు దోషముల కొఱకే అన్వేషించును. గుణములున్నను గ్రహింపనేఱడు కదా!
శ్లో. అతి రూపోద్ధతాత్ సీతాஉతిగర్వా ద్రావణో హతః,
అతిదానాద్బలి ర్బద్ధశ్చాతి సర్వత్ర వర్జయేత్.
క. అతి గర్వముచే రావణు
డతి సౌందర్యమున సీత, యతి దానముచే
క్షితి బలియును, బాధ పడిరి.
అతి అన్నిట విడువ వలయు నరయుఁడు సుజనుల్.
భావం. ఆపూర్వమైన సౌదర్యం వల్ల సీత ఇక్కట్ల పాలైంది. మితిమీరిన గర్వంవల్ల రావణుడు నిహతుడైనాడు. పరిమితి లేని దానంవల్ల బలి చక్రవర్తి బంధింపబడ్డాడు.
కనుక అతి అన్నివేళలా విడిచిపెట్టవలసిందే.
శ్లో. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్.
గీ. ఆత్మనెఱుఁగఁగ జిజ్ఞాసనలరు సుమతి
బ్రహ్మ విద్యలో నిపుణుని, భక్త సులభు
ననుపమాన దయాపరు నరసి వానిఁ
శిష్యుఁడై తాను గురువును చేర వలయు.
భావము. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక ఉత్తముఁడైన గురువును సమీపించాలి.
శ్లో. అదండ్యాన్ దండయన్ రాజా ,దండ్యాంశ్చైవాప్యదండయన్
అయశో మహదాప్నోతి నరకం చైవ గచ్ఛతి.
క. దోషిని శిక్షింపక ని
ర్దోషిని శిక్షించుటరయ దోషాన్విత మీ
దోషము చేసిన నరకము.
ధ్యాసఁ గలిగి మెలఁగుట మన ధర్మము. కనుడీ.
భావము. నిర్దోషులను దండించి,దండింప దగినవారిని దండింపని రాజు గొప్ప అపకీర్తిని పొందటమే కాక,నరకానికి పోతాడు.
శ్లో. అదృష్టపూర్వా బాహవః సహాయాః సర్వే పదస్థస్య భవంతి వశ్యాః
అర్ధాద్విహీనస్య పదచ్యుతస్య భవంతి కాలే స్వజనోపి శత్రుః
గీ. రెండు చేతులా గడియించు చుండువాని
కండగానుందురందరూ. అట్లు కాక
వట్టి చేతుల నుందుమా ఒట్టు రారు
దరికినొక్కరూ నిజమిది.మరువరాదు.
భావము. అదృష్టం మనకి కలసి వచ్చినంతసేపూ
రెండుచేతులా సంపాదిస్తున్నంతసేపూ బయటివాళ్ళు అందరూ మన అడుగులకు మడుగులొత్తుతారు.
అర్ధవిహీనస్య అంటే డబ్బు లేనప్పుడు పదవి పోయినప్పుడు అదే స్నేహితులు బంధువులు శత్రువులుగా మారిపోతారట... దీనినే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు భజగోవిందం లో ఇలా చెప్తారు.
శ్లో. అద్రోహః
సర్వభూతేషు కర్మణా మనసా
గిరా
అనుగ్రహం చ దానం
చ శీలమే
తత్ప్రప్రశన్యతే (మహాభారతం అను. 124-66)
(మహా భారతము - వన పర్వము - ౨౯౭ - ౩౫.)
తే.గీll
త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు
తే.గీ. కరణములు మూటిచే వైరి కాక యుంట,
దయను వర్తిలుచుండుట ప్రియము తోడ,
దాన సద్గుణౌఁడుచునీ ధరణి నుంట
శీలవంతుల లక్షణ జాలమరయ.
గీ. జీవ కోటిపై విద్రోహ చింత లేక,
దయకు రూపముగా నిల్చి, దాన విరతి
కలిగియుండుట శీలంబుగా గణింత్రు
బుధులు. కనుడయ్య విజ్ఞాన పూర్ణులార!
తే.గీll త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భావము. ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు, దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.
శ్లో. అధీత్య చతురో వేదాన్
సర్వశాస్త్రాణ్యనేకశః|
బ్రహ్మతత్వం న జానాతి
దర్వీ సూపరసం యథా||
తే.గీ. బ్రహ్మ తత్వంబు నెఱుఁగని వారు నాల్గు
వేదములనెఃత చదివినన్ విలువ లేదు.
శాస్త్రములనెన్ని నేర్చినన్ జ్ఞాని కాడు.
పప్పుచారున గరిటయట్లొప్పు కనగ.
భావము. వేదములను బాగుగా చదివినప్పటికీ,సర్వశాస్త్రములను అనేకమార్లు అద్యయనం చేసినప్పటికీ పరబ్రహ్మతత్త్వమును అర్ధం చేస్కొని వాడు పప్పు లేక చారు యందలి గరిటె లాంటివాడగుచున్నాడు.
శ్లో. అనంతరత్న
ప్రభవస్య యస్య
హిమం న
సౌభాగ్య విలోపి జాతమ్
l
ఏకో హి
దోషో గుణ
సన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ll
కు.సం. 1-2
తే.గీ. రత్నరాశులు కల హిమాలయము కీర్తి
మంచు పోకార్పఁగా నేరదెంచి చూడ.
దోషమొకటైనగుణములఁ జేసి మాయు.
మచ్చలవి చంద్ర కాంతిలో మఱఁగిపోవె.
భావము.
చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజములకు నిలయమైన హిమవత్పర్వతములో మంచు నిండియుండట యనే ఒక దోషము లెక్కింప దగినది కాదు. అనంత గుణరాశిలో ఒక్క దోషమున్నను అది గుణములలో కలిసిపోవును.
శ్లో. "అనన్తరత్నప్రభవస్య యస్య,
హిమం న
సౌభాగ్యవిలోపి జాతమ్,
ఏకో హి
దోషో గుణసన్నిపాతే,
నిమజ్జతీందోః కిరణే ష్వివాంకః"
(కుమారసంభవము.)
క. గుణ సంహతినొకదోషము
కనఁబడు. గుణంబు చెడదు. ఘనతనె యొప్పున్.
కనఁబడు వెన్నెలె. యందన
కనుమరుగగు గాదె మచ్చ? కాంచఁగ మనకున్.
భావము.
సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలిసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు. ఉదా- సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ.
శ్లో:- అనంత శాస్త్రం
బహు వేదితవ్యం
- స్వల్పశ్చ కాలో బహవశ్చ
విఘ్నాః.
యత్ సారభూతం
తదుపాసితవ్యం - హంసో యథా
క్షీరమివాంబు మిశ్రమ్.
గీ:- ఎఱుగఁ దగు శాస్త్రములు పెక్కులిహమునందు.
కాల మల్పము కావున కలియుగమున,
హంస నీటిని విడి పాలనరయునట్లు,
సారమున్నట్టి శాస్త్రముల్ చక్క గొనుడు.
గీ:-
శాస్త్ర మెఱుగ ననంతము సమయ మల్ప
మధిక మాటంకములు కాన హంస యెట్లు
పాలుమాత్రమె గ్రహియించి ప్రబలు? నట్ల
మంచి మాత్రమె గ్రహియించి మహిమ గనుడు.
భావము:- శాస్త్రములు అనంతముగ నున్నవి. తెలియ తగినది చాలా ఉన్నది. కాలమా స్వల్పముగా నున్నది. విఘ్నములా అనంతముగా కలుగుచునే ఉండును.కావున హంస ఏ విధముగా పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచి వేయునో అదే విధముగా మనము కూడా కావలసినంతమట్టుకు సారభూతమైన దానిని స్వీకరించ వలెను.
శ్లో. అనిత్యాని శరీరాణి, విభవో నైవ శాశ్వతః ౹
నిత్యం సన్నిహితో మృత్యుః, కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹
కం. నిత్యంబు కాదు దేహము,
నిత్యంబులు కావయ ధరణిని విభవంబుల్,
మృత్యువు చేరువనుండును,
నిత్యముధర్మార్జనంబు నెరపఁగవలయున్.
భావము. మన దేహాలు శాశ్వతము కావు. నాశనం పొందుతాయి. అటులనే మన వైభవాలు కూడా శాశ్వతం కావు. చావు ఎపుడు మనకు దగ్గరగా ఉంటుంది. కావున ధర్మమును సంగ్రహించుట మన కర్తవ్యము.
శ్లో. అనిర్వేదః
శ్రియో మూలమనిర్వేదః పరం
సుఖమ్,
అనిర్వేదో హి సతతం
సర్వార్థేషు ప్రవర్తకః.
క. ఉత్సాహమె శ్రేయస్కర
ముత్సాహమె సుఖము గన మహోత్కృష్టంబు
న్నుత్సాహమె నడుపు మనల
నుత్సాహము వీడవలవ రుత్తమపురుషుల్.
భావము. అనిర్వేదమే శ్రేయస్సుకి మూలం, పరమ సుఖం. అనిర్వేదమే మానవుణ్ణి అన్ని కార్యములలోను ముందుకు నడిపిస్తుంది. అనిర్వేదమే అన్నింటిని సఫలం చేస్తుంది.
(నిర్వేదము అనే పదమునకు వ్యతిరేకపదము అనిర్వేదము. నిర్వేదము లేకపోవుట అనగా ఉత్సాహముగా ఉండుట.)
ఏంత సేపటికీ సీతమ్మ జాడ తెలియలేదని స్వామి హనుమ కించిత్ నిర్వేదానికి గురి అవుతాడు. నిరుత్సాహానికి లోనవుతాడు. అంతలోనే తేరుకోని పై మాటలు అంటాడు.
श्लॊ. अन्नदानम् महादानम् विद्यादानमतःपरम् !
अन्नॆन क्षणिकातृप्तिर्यावज्जीवम् च विद्यया !!
శ్లో. అన్నదానం
మహా దానం,
విద్యా దానం తతః
పరమ్.
అన్నేన క్షణికా తృప్తిః,
యావజ్జీవంచ విద్యయా.
గీ. అన్నదానంబు ఘనతరమెన్ని చూడ.
అంతకన్న విద్యాదాన మధిక తరము.
అన్నమున కల్గు సంతృప్తి యా క్షణమునె.
విద్య శాశ్విత తృప్తిని వెలయఁ జేయు.
భావము. అన్నము మహా ఘనతరమైన దానము. విద్యా దానము అంతకంటెను ఘనతరమైనది. అన్నదానము కలిగించే తృప్తి తాత్కాలికమైనదే. విద్యాదానము కలిగించే తృప్తి జీవితమంతయు ఉండును.
శ్లో. అన్నపూర్ణే సదాపూర్ణే!
- శంకర ప్రాణవల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం! - భిక్షాం దేహీ చ పార్వతీ!
తే.గీ. అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!
శంకరప్రాణ వల్లభా! సరసిజాక్షి!
జ్ఞాన వైరాగ్యములు మాలుఁ గలుగఁ జేయ
పార్వతీ! భిక్షనొసగుమ, ప్రణుతులమ్మ!
భావము. అన్నపూర్ణాదేవీ! ఓ సదాపూర్ణ స్వరూపిణీ! దేవతలచే
ప్రశంసింపఁబడు ఓ తల్లీ! శివంకరుఁడయిన శంకరుని ప్రాణేశ్వరీ!
నాకు హ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు భిక్షను ప్రసాదించుమమ్మా!
శ్లో. అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేஉపి చోదయే
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్.
గీ. అల్ప దోషంబు మన్నింపనగును కనుమ,
అభ్యుదయమల్పమున్నచో నరసి పొగడు,
మేలు చేసిన వారిని మెచ్చుకొనుచు
గౌరవించుము. పొందుము గౌరవంబు.
భావము. చిన్న పొరపాటును క్షమించాలి. అల్పమైన అభ్యుదయానికైనా సంతోషించాలి. మహోపకారం చేసిన వారిని గౌరవించాలి.
శ్లో. అపరాధో న మే உస్తీతి నైతద్విశ్వాస కారణం
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి.
క. అపరాధము చేయని నా
కపరాధము చేయరితరులనుకొనఁ దగదోయ్.
నెపమెన్నక చేతురు మీ
కపరాధముదుశ్చరితులహర్నిశలు కనన్.
భావము. నాయందు అపరాధమేమియు లేదు, నాకేమి భయమని సజ్జనుడు ఏమరుపాటుగా ఉండుట తగదు. గుణవంతులకైనా క్రూరులవల్ల భయం కలుగుతుంది.
శ్లో. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరి ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మయద్ధరేః.
గీ. తనదు ధర్మము విడనాడి యనవరతము
కృష్ణు తలచునతడు ద్వేషి కృష్ణునకును.
ధర్మ సంస్థాపనార్థియై తనకు తానె
యెన్ని జన్మలనెత్తెనాపన్నబంధు.
తే.గీ.ll
చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.
తే.గీ.ll చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.
భావము. తాము చేయవలసిన కర్మలను ఆచరింపక “కృష్ణా, కృష్ణా ” అంటూ కూర్చునేవారు - హరిద్వేషులు, పాపులు అవుతారు. హరి - ధర్మకార్యాచరణకే అనేక జన్మలను(అవతారాలను) ధరించాడుకదా.
శ్లో. అపృష్టో உపి హితం బృయాత్, యస్య నేచ్చేత్ పరాభవం,
ఏష ఏవ సతాం ధర్మో, విపరీత మతొஉన్యథా.
క. ఇతరుల మంచిన కోరిన,
సతతము హితమును తెలుపుచు చక్కగ నడుపున్
క్షితిపై సద్గుణ గణ్యులు.
మతిమంతుల మార్గ మిదియె, మహితంబిదియే.
భావము. ఎవరికి పరాభవము జరగకూడదని కోరుకుంటావో, వానికి హితమును అడుగక పోయినను చెప్పాలి . ఇదియే సత్పురుషుల ధర్మం. అడుగలేదు కదాని హితమును చెప్పక ఊరకుండిన అది అధర్మము.
వివరణం: శ్రీమద్రామాయణం
లో విభీషణుడు అన్నగారైన రావణునికి ఇదే విధంగా ధర్మం చెప్పాడు. వాడు మృత్యువునే ఆశ్రయించాడు. రావణుడు మృత్యువునకు యెదురువెల్తున్నట్టి వాడు, అట్టి వాడు మృత్యురూపుడే కావున వాడు విడిచిపెట్టదగినవాడు. కావున విభీషణుడు అమృత స్వరూపుడైన రాముణ్ణి ఆశ్రయించాడు.
శ్లో. అభివాదయేత్ వృధాంశ్చ, దద్యాచ్చైవాసనం స్వకమ్,
కృతాంజలి రుపాసీత, గచ్ఛతః పృష్ఠతోన్వియాత్.
గీ. పెద్దవారిని కనుగొన్నఁ బ్రీతితోడ
వందనము చేసి యాసనమందు నిలిపి,
ప్రీతితోడుత పలికి విఖ్యాతి మెలఁగ
సంతసింతురు వారు. నిన్ సన్నుతింత్రు.
భావము. వృద్ధులకి నమస్కరిచడం, నీ ఆసనమును వారికి ఇయ్యటం, అంజలి బద్ధుడవైయుండి, వారు వెళ్ళునప్పుడు వెనుకనే కొంత దూరము సాగనంపాలి.
శ్లో:- అభ్యాసానుసారీ విద్యా
- బుద్ధిః కర్మానుసారిణీ.
ఉద్యోగానుసారిణీ లక్ష్మీః - ఫలం
భాగ్యానుసారిణీ.
గీ:- ఎంత అభ్యాసమును చేయ నంతె విద్య
కర్మకొద్దియె బుద్ధియు కలుగు నిజము.
లక్ష్మి ఉద్యోగమును బట్టి లభ్యమగును.
భాగ్యమును బట్టి కలుగును ఫలము కనుఁడు.
భావము:- చేసిన అభ్యాసముకొద్దీ విద్య ప్రాప్తించును. బుద్ధి యనునది మన కర్మననుసరించి ప్రవర్తించును. చేయుచున్న ఉద్యోగము కొద్దీ ధనము ప్రాప్తించును. మనము పొందే ఫలితాలు మన భాగ్యముననుసరించియే యుండును.
జరామరణములు లేని వానివలె విద్యను ధనమును సంపాదించవలెనని చెప్పుకొన్న దానికి తగినట్టుగా నిరంతర అకుంఠిత సాధనతో విద్యనభ్యసించ వలెనే గాని, అలసత్వము పనికి రాదు. అప్పుడే కోరుకొన్న విద్యను పరిజ్ఞానమును పొందగలుగుదుము.
ఎవరెన్ని విధములుగ చెప్పినను మన ప్రవర్తన మన బుద్ధిననుసరించియే యుండును అట్టి బుద్ధికి మూలము మన నుదుట వ్రాయబడిన కర్మయే కాని వేరు కాదుకదా!
మనము చేసెడి ఉద్యోగమును బట్టియే ఆదాయము కూడా ఉండును. చిన్న ఉద్యోగమునే మనము చేయ దలంచినచో చిన్న ఆదాయమునే మనము పొందుట జరుగును. పెద్ద ఉద్యోగము చేయ గడంగితిమేని ఆదాయము కూడా పెద్దగనే ఉండును కదా!
మనమెంత కష్టించి పనిచేసినను దాని వలన వచ్చెడి ఫలితము మన యోగముపై ఆధారపడి యుండును. మనకెంత భాగ్యము చేరవలెనని వ్రాసి యున్నదో అంత ఫలమే మనకు చేరును. ఇందునిమిత్తము విచారించినను ప్రయోజనముండగు కదా! కర్మణ్యేవాధికారస్తే - మా ఫలేషు కదాచన. అన్నడు కృష్ణుఁడు భగవద్ గీతలో . అది మనము మరువరాదు కదా!
శ్లో. అమృతం
చైవ , మృత్యుశ్చ
ద్వయం దేహే ప్రతిష్ఠితం
మోహాదాపద్యతే మృత్యుః , సత్యేనాపద్యతేஉమృతమ్.
(ఆది శంకరులు)
క. మృత్యువు నమృతము కనపడు
సత్యము. మన దేహమందె సహవసియించున్
మృత్యువు మోహము వలనను
సత్యముచే నమృత శక్తి సరసత నిలుచున్.
తే.గీll
నిత్యమమృ తము మృత్యువు నిశ్చితముగ
దేహమున నుండు దేహికి. దేహికుండు
మోహమునమృత్యువబ్బును.మోహి కాక
సత్యదర్శికి యమృతంబు సంభవించు.
భావము. అమృతము, మృత్యువు ఈ రెండూ మన శరీరంలోనే ఉన్నాయి. మోహం వల్ల మృత్యువు , సత్యం వల్ల అమృతత్వము కలుగును.
శ్లో. అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
గీ. అతఁడు నావ్యక్తి. నావ్యక్తి యితడు కాడ
నుచు పలుకుదురజ్ఞానులనుపమ గతిని.
విశ్వవిజ్ఞాతలందరున్ విశ్వజనుల
నెల్లరిని తన వారిగా నెన్నుదురయ.
క:-
నావారా? పైవారా?
ఏవార?లటంచు హీను లెంతురు ప్రజలన్.
భూవలయ సంస్థిత ప్రజ
నావారని తలతు రెపుడు నయత నుదారుల్.
భావము. వీడు నావాడు, వీడు పరుడు అనే పరిగణన అల్పమనస్కులకు ఉంటుంది. ఉదార ప్రవర్తనగలవారికి మాత్రం ఈ ప్రపంచమే ఒక కుటుంబం.
శ్లో: అయం
హి కృత
నిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ
స్వస్త్యయనం హరేః (భాగవతము 6-2-7)
క: హరి యను నామోచ్చారణ
హరియించును పాతకముల నసదృశ ఫణితిన్.
హరియే కనబడు లోపల,
హరియే కనిపించు బయట హరి భక్తులకున్.
భావము: సమస్త పాపములను నశింపజేయుటయే హరి నామము యొక్క ప్రప్రథమ ధర్మము.
దానికి ప్రమాణం ఏమనగా
అజామిళుడు అవసానకాలమందు "నారాయణ" శబ్దము ముమ్మారు ఉచ్చరించి కోటి కోటి జన్మలలో చేసిన పాపరాశులనుండి ముక్తిని బొంది భగవత్సాన్నిధ్యము జేరెను. ఇది కోరు మనవుడు సాధన చేయ వలెను
కళ్ళు మూసినప్పుడు ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ దైవాన్ని చూడగలిగితే సాధన సార్ధకమైనట్లే.
శ్లో. అయమేవ పరోధర్మః, ఇయమేవ విదగ్ధతా
ఇదమేవ హి పాండిత్యం, యదాయాన్నాధికో వ్యయః.
క. మితముగ వ్యయమును చేయుటె
యతులిత సద్ధర్మమును, మహన్నిపుణతయున్.
క్షితి పాండిత్యమునదియే
సతత మితవ్యయపరులకు సౌఖ్యంబబ్బున్.
భావము. ఆదాయాన్ని మించి వ్యయం చేయకూడదు అనేదే శ్రేష్ఠధర్మం. అదే నైపుణ్యం.అదే పాండిత్యం.
శ్లో. అర్థానామార్జనం
కార్యం, వర్థనమ్ రక్షణం
తథా,
భక్ష్యమాణో నిరాదాయః సు
మేరురపి హీయతే.
క. ఆర్జింప వలయు ధనమును,
ఆర్జించిన దాని పెంచి, యరయుచు సుఖమువ్
వర్జించి రక్ష సేయుక,
ఆర్జన విడి తినిచునున్న హరియించుకుపోన్.
భావము. ధనమునార్జించుట కర్తవ్యము. ఆ ధనమును వృద్ధి చేయుట రక్షించుట అవసరము. సంపాదించకుండా ఉన్నది తింటూ కూర్చున్నచో మేరు పర్వతమైననూ తరిగిపోవును.
శ్లో. అరాచకే హి లోకే உస్మిన్ సర్వతో విద్రుతే భయాత్
రక్షార్థ మస్య సర్వస్య రాజాన మసృజత్ప్రభుః.
గీ. రాజు లేనట్టి రాజ్యాన ప్రజలు జడుచు
కాన రాజ్యంబుఁ గావగ జ్ఞాన భరితు
రాజుగా చేసె రక్షింప ప్రజలనెల్ల.
ఎంత దయనీయుడోకదా యీశ్వరుండు!
భావము. రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలు అన్నివిధాలా భయంతో విచలితులౌతారు. అందుకే లోకమంతటినీ రక్షించటానికి దైవం రాజును సృష్టించాడు.
శ్లో. అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే
ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః.
గీ. అతిథిదేవుఁడు పాత్రుడై యలరు చున్న
శతృవైనను మన్నించి చక్క గనుము.
నరకవచ్చిన వానిపైకరుణ జూపి
నీడ నిచ్చునువృక్షము నిరుపమముగ.
భావము. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి. తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా.
శ్లో. అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
గీ. అశుభములు నాశనంబౌత, యఖిల దురిత
భయములిల నాకు నశియించి. పరమ శాంతి
కలుగ చేయుత గ్రహములు కరుణ జూచి,
మంగళంబులు కూర్చుత మహితముగను.
భావము. అరిష్టములు నశించు గాక. పాపములు, భయములు తొలగు గాక, నాకు శాంతి, శుభము కలుగు గాక, గ్రహముల యనుగ్రహము నాకు కలుగు గాక. గ్రహములు నాకు మంగళప్రదులగుదురు గాక.
శ్లో. అర్థాతురాణాం న గురు ర్న బంధుః,
కామాతురాణాం న భయం న లజ్జా,
క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం,
విద్యాతురాణాం న సుఖం న నిద్రా.
క. ధన రతులకు గురు, బంధులు
ననయము కామాతురులకునన భయ, లజ్జల్.
పెనుక్షుధులకు రుచి, పక్వము,
ఘన విద్యార్థికి కునుకు సుఖములుండవుగా.
భావము. ధనదాహం గలవాడికి గురువు లేడు, బంధువూలేడు. కామాతురునికి భయము, సిగ్గూ లేవు. ఆకలితో సతమత మౌతున్నవాడికి రుచి లేదు, ఉడికినదా, లేదా ? అనే ప్రశ్నయు లేదు. విద్య కొఱకు ఆతురత పొందువానికి సుఖము, నిద్రా లేవు.
శ్లో. అర్థానామార్జనే దుఃఖ మార్జితానాం చ రక్షణే
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధి గర్థం దుఃఖభాజనమ్॥
గీ. ధనమునార్జింపగా దుఃఖమనుభవమగు.
దాని దాయంగ దుఃఖము ధరణి పైన.
పెంచ, వెచ్చింప దుఃఖము, భీతిఁ గొలుపు
దుఃఖ దాయిని ధన వాంఛ దూరమగుత.
క. ధన సంపాదన దుఃఖము.
ధన రక్షణ దుఃఖమయము ధన మొచ్చు నెడన్,
ధనమది ఖర్చగు వేళను
మనకౌనది దుఃఖ ప్రదము. మది గనుడయ్యా.
భావము. ధనము సంపాదించునప్పుడు దుఃఖం. సంపాదనను కాపాడుకొనేప్పుడు దుఖం. సంపాదించినది వృద్ధి కాలేదని దుఃఖం. ఉన్న ధనం ఖర్చయి పోతోందని దుఃఖం. కావున దుఃఖ కారకమైన ధనము నింద్యము.
శ్లో. అర్థేన కిం కృపణహస్త గతేన తేన ?
రూపేణ కిం గుణ పరాక్రమ వర్జితేన ?
జ్ఞానేన కిం బహుజనైః కృత మత్సరేణ?
మిత్రేణ కిం వ్యసనకాల పరాఙ్ముఖేన ?
గీ. లోభియైనట్టి ధనికుచే లాభమేమి?
సుగుణ, ధైర్య విహీనుని శోభ యేల?
కలిత విద్వేష పూర్ణుని జ్ఞానమేల?
సమయమప్పుడు నిలువని సఖ్యుఁ డేల?
భావము. లోభి చేతిలో ఉన్న ధనం వల్ల ఏమి ప్రయోజనం ? సద్గుణము, పరాక్రమము లేని వాని అందము వల్ల ఏమి ప్రయోజనం ? ఎందరియందో ద్వేషం పెంచుకొనే వాని జ్ఞానం వల్ల ఏమి ప్రయోజనం ?ఆపద సమయంలో ముఖం చాటుచేసే స్నేహితుని వల్ల ఏమి ప్రయోజనం ?
శ్లో. అలసస్య కుతో విద్యా ? అవిద్యస్య కుతో ధనం ?
అధనస్య కుతో మిత్రం ? అమిత్రస్య కుతస్సుఖమ్ ?
గీ. బద్ధకిష్టులు విద్యలఁ బడయునెట్లు?
విద్యలేకున్న ధనలక్ష్మి వెలయునెట్లు?
ధనము లేకున్నమిత్రాళి దరియునెట్లు?
మిత్రహీనుండు సుఖముగ మెలగునెట్లు?
గీ. బద్ధకిష్టికి సద్విద్య పట్టువడదు.
విద్య లేకున్న ధనమెట్లు పెరుగు మనకు?
ధనము లేకున్న మిత్రులు దరికి రారు.
మిత్ర తతి లేక సుఖమెట్లు మిగులు మనకు?
భావము. బద్ధకము కలవానికి విద్య ఎక్కడిది ? విద్య లేని వానికి ధనం ఎక్కడిది ? ధనం లేని వానికి మిత్రుడెక్కడ ? మిత్రుడు లేని వానికిసుఖమెక్కడ ?
శ్లో. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ
బహువచన మల్పసారం యః కథయతి విప్రలాపీ సః.
క. తేలిక పదముల తోడనె
మేలుగ భావంబు తెలుపు మేధావి కనన్.
చాలగ పలుకును, భావము
తేలదు కన వదరుబోతు. తెలియఁ బలుకుడీ!
క. తక్కువ పలుకుచు భావము
నెక్కువ కనఁజేయు మహితుఁడెచ్చటనైనన్.
ఎక్కువ పలుకుచు భావము
తక్కువ కనఁజేయు వదరు ధరణిని కనగా.
భావము. కొద్దిపాటి తేలికమాటలతో ఎవడు అందంగా మాట్లాడుతాడో వాడే నిశ్చయంగా మాట్లాడటం తెలిసినవాడు. ఎవడు సారహీన విషయాలను అతిగా మాట్లాడుతూ చెప్తాడో వాడు వదరుబోతు.
శ్లో. అవిధేయో
భృత్యజనః
శఠాని మిత్రాణి నిర్దయః
స్వామీ
వినయరహితా చ భార్యా
మస్తకశూలాని చత్వారి.
గీ. మాట విననట్టి పనివాడు, మదిని మెలగి
మోసగించెడి మిత్రుఁడు, భూమిపైన
దయయె లేనట్టి యజమాని, ప్రియము లేని
మాట విననట్టి భార్యయు మదికి బాధ.
భావము. మాట వినని పనివాళ్ళు, మోసం చేసే మిత్రులు, దయలేని యజమాని, వినయం లేని భార్య - ఇవి నాలుగు తలనొప్పులు.
శ్లో. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న విందతి
ససంతోషస్తథా నిత్యం త్రీణి శిక్షేత్ గార్ధభాత్.
క. నిరతము బరువును మోయుట,
వెరవక వేడికి చలికిని బ్రీతి మనుటయున్,
గరపును గాడిద మనలకుఁ
జరియింపఁగ వలయు నటుల చక్కగ మనమున్.
భావము. విశ్రాంతి లేకుండా భారం మోయుట, చలి ఎండలకు చలించకుండా వుండుట, నిత్యము సంతోషముగా నుండుట, ఈ మూడు లక్షణములు మనము గాడిద నుంచి నేర్చుకొనవలెను.
శ్లో. అవ్యాకరణమధీతం , భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణం
భేషజమపథ్య సహితం త్రయమిదమకృతం వరం న కృతమ్.
గీ. పూర్ణ విద్యను నేర్వమిన్ పోకు చదువ.
భిన్నమైనట్టి పడవలో వెళ్ళఁ బోకు.
పత్యమును చేయ లేనిచో వలదు మందు.
పూర్ణ మనమున పని చేయఁ బూన వలయు.
భావము. వ్యాకరణాన్నిసమగ్రంగా చదవకపోవటం, పగిలిన పడవతో నదిని దాటాలనుకోవటం, పథ్యం లేకుండా ఔషధాన్ని సేవించాలనుకోవటం అనే మూడు పనులకు అసలు సిద్ధపడకపోవటమే మంచిది.
శ్లో. అశ్వం
నైవ , గజం
నైవ , వ్యాఘ్రం
నైవ చ
నైవ చ
అజాపుత్రం బలిం దద్యాద్దేవో
దుర్బలఘాతక: !
క. బలియివ్వరు అశ్వంబును
బలియివ్వరు గజము వ్యాళ వ్యాఘ్రంబులిలన్
బలియిత్తురజంబు నహో!
బలహీనునె బలి యొనరుచు పరమాత్ముండున్
భావము. లోకంలో ఎంతో బలం ఉన్న గుఱ్ఱాన్నికాదు, ఏనుగును కాదు, పులిని కానేకాదు , కేవలం బలం లేని ఒక మేకపిల్లను బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలురనే హింసిస్తాడు కాబోలు !
శ్లో:- అశ్వత్ధ
మేకం, పిచుమంధ
మేకం, స్య
గ్రోధమేకం, దశ పుష్ప
జాతీం.
ద్వే ద్వే
తధా దాడిమ
మాతులింగే పంచామ్ర వాపీ
నరకం న
యాతీ. ….వరాహ పురాణం
తే.గీ. రావి, నిమ్మ, మఱ్ఱి, ప్రాతుమొక్కొక్కటి,
రెండు లుంగుషములు, రెండు దాడి
మముల నామ్ల ద్రువులు మహినైదు పూజాతి
చెట్లు పదియు పెంచ చెలఁగు సుగతి.
భావము. ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
శ్లో. అసంపన్నః కథం బంధుః ? అసహిష్ణుః కథం ప్రభుః ?
అనాత్మవిత్ కథం విద్వాన్ ? అసంతుష్టః కథం సుఖీ ?
గీ. పేద యింటికి బంధువుల్ పోదురొక్కొ?
ఓర్పు లేకున్న రాజెట్టులుర్వినేలు?
కనక పండితుల్ దైవమున్ ఘనులగుదురె?
తుష్టి లేకున్నసుఖములు తోడ నున్నె?
భావము. సంపన్నుడు కాకపోతే బంధువెలా అగును ?(సంపన్నులకందరూ బంధువులమని చెప్పుకుంటారు ) ఓర్పు లేనివాడు రాజెట్లగును? పరమాత్మ స్వరూపం తెలియనివాడు విద్వాంసుడెట్లగును? సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడగును?
శ్లో. అసహాయః సమర్ధోపి తేజస్వీ కిం కరిష్యతి?
నిర్వాతే జ్వలతే వహ్నిః స్వయమేవోపశామ్యతి.
ఆ.వె. పరుల తోడు లేక బలవంతుఁడైనను
చేయ లేడు పనులు చేవ చూపి.
గాలి తోడు లేక ఘనమైన యగ్నియు
నారిపోవుఁ గాదె దారి లేక.
భావము. శూన్యంలో అగ్ని తనంతట తానే ఉపశమిస్తుంది, కారణం తనకి తోడుగావుండవలసిన గాలి, ఆమ్లజని తగినంత మోతాదులో దొరకక తనంతతానే ఆరి పోతుంది. అలాగే ఎంతటి సమర్ధుడైనా తేజోవంతుడైనా ఇంకొకరి సహాయం లేకపోతే ఏమీ చేయ లేడు.
శ్లో. అసాధ్య
సాధక స్వామిన్
అసాధ్యం తవ కిం
వద?
రామదూత కృపాసింధో మత్కార్యం
సాధయ ప్రభో!
ఆ. సాధ్యమవని దానిసాధించెదవు నీవు.
సాధ్యమవనిదేది సరస! నీకు.
రామ దూత! కృపను రాజిల్లుదువునీవు.
నాకు జయము కొలిపి నన్నుఁ గనుమ.
భావము. అసాధ్యాన్ని సుసాధ్యం చేయ సమర్థుఁడవైన ఓ శ్రీమ దూతవైన ఓ హనుమంతుఁడా! నీకు అసాధ్యమేమున్నది చెప్పుము. నీవు కృపా సముద్రుఁడవు. నా పనులన్నిటినీ నాకు సుసాధ్యము చేయుమని ప్రార్థించుచున్నాను.
శ్లో:- అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం!
హిమాలయే హర శ్శేతే! హరి శ్శేతే మహోదధౌ!
ఆ:- సార హీనమైన సంసారమందున
సార మయము అత్త వారి యిల్లు.
హరుడు హిమ గృహమున, హరి పాల కడలిని
నిండు మనముతోడ నుండెఁ గాదె!
భావము:- సార హీనమైన యీ సంసారమునందు అత్తవారిల్లే (మామగారిల్లే) సారవంతంగా ఉంటుంది. అందుకే గదా పరమ శివుడు తాను తన అత్తవారిల్లైన (మామగారిల్లైన) హిమాలయ పర్వతముపై కైలాసమున నివసించుచున్నాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా తన అత్తవారిల్లైన(మామగరిల్లైన) పాల కడలలోనే నివసిస్తున్నాడు? ఎంత సారవంతమైనవి కకపోతే అలా ఉంటారు?
శ్లో. అసారే
ఖలు సంసారే
సుఖభ్రాన్తిఃశరీరిణామ్౹
లాలాపానమివాఙ్గుష్ఠే
బాలానాం స్తన్య విభ్రమః.
క. వ్రేలును చీకుచు తానది
పాలని భ్రమియించు బిడ్డ పగిదిని మనమున్
పేలవమగు సంసారమె
మేలనిభ్రమియింతుముకద మిధ్యాజగతిన్.
భావం:- ఎటువంటి సారమూ లేని ఈ ప్రపంచంలో ఏదో ఏదో సుఖం ఉందని
మానవులు భ్రాంతి పడుతూ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటూ ఉంటారు .
అది ఎలాంటిది అంటే బొటనవేలు నోట్లో పెట్టుకుని తన లాలాజలాన్నే
చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకునే పసిపిల్లవాడి భ్రాంతి వంటిది.
ఇక్కడ మెలిక ఏమిటంటే ఆవిధంగా భ్రాంతి పడిన పిల్లవాడిని చూసి తల్లి
కాసేపటికి వాడి ఆకలి తెలుసుకుని పాలు ఇస్తుంది . కానీ మానవుడు ఒకసారి
ఈ జన్మ వృధా చేసుకుంటే ఇక మానవ జన్మ అసంభవం.
శ్లో. అస్థిరం జీవనం లోకే అస్థిరం ధనయౌవనం,
అస్థిరం దారపుత్త్రాది ధర్మః కీర్తిర్ద్వయం స్థిరమ్॥
గీ. అస్థిరంబిల జీవన మస్థిరములు
ధనము, యౌవనము, సుతులు, ధర్మ పత్ని,
స్థిరము ధర్మంబు, కీర్తియు, పరమ పథము
చేరు మార్గంబులివ్వియే ధీరులకిల.
భావము. ప్రాణము, ధనము, యౌవనము, భార్యాపుత్రాదులు
సర్వము అస్తిరమైనవే, ధర్మము, కీర్తి ఈ రెండే స్థిరమైనవి.
శ్లో. అహన్యస్తమయాంతాని, ఉదయాంతా చ శర్వరీ
సుఖస్యాంతం సదా దుఖం, దుఖస్యాంతం సదా సుఖమ్.
క. ఉదయం బస్తమయంబున
నుదయంబున నస్తమయమునొందెడుచ్యుతి. స
న్మధుర సుఖాంతము దుఃఖము
వ్యధభరదుఃఖాంతము సుఖ మరయుఁడు నిజమున్.
భావము. పగలు– సూర్యాస్తమయంతో, రాత్రి – సూర్యోదయంతో అంతమౌతాయి. సుఖము పిదప ఎప్పుడూ దుఃఖము, దుఃఖము పిదప ఎప్పుడూ సుఖమును ప్రాప్తించుట తథ్యము.
శ్లో:- అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్.
చం. విమల యహింసయున్ మరియు
వెల్గెడి యింద్రియ నిగ్రహంబు,భూ
తములెడ నంతులేని దయ, తాల్మియు, శాంతి, తపంబు, ధ్యానమున్,
ప్రముదము గొల్పు సత్యమను భాసిలు పుష్పచయంబు, వీటితో
సుమధుర భావనన్ హరిని శోభిలఁ గొల్చిన ప్రీతి చెందెడున్.
భావము:- అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మకై
తపించుట, పరమాత్మ ధ్యానము, సత్యనిరతి అనే ఎనిమిది విధములైన పుష్పములతో హరిని ఆరాధిస్తే
చాలా సంతోషిస్తాఁడు హరి.
శ్లో:-
అహింసా సత్యమస్తేయం
అకామ క్రోధ లోభతా
భూత ప్రియ హితేహాచ
ధర్మోయం సార్వ వర్ణికః.
ఆ:-
హింస వీడి, పరమ హితము, సత్యము బల్కి,
ధ్యాస పరుల సొమ్ము కాస పడక
కామ క్రోధ లోభ కలుషిత మవకుండ
ప్రాణి కోటి మంచి బడయుతనుత!
భావము:-
హింస చేయకుండుట, సత్యమే పలుకుట, ఇతరుల ద్రవ్యమున కాశ పడకుండుట, కామ క్రోధ లోభములను జయించుట, సమస్త ప్రాణుల హితమునే మనసా వాంఛించుట, ఇవి యన్నియు అన్ని కులముల మనుజులునూ సర్వదా ఆచరించు చుండ వలసినట్టి సాధారణ ధర్మములు సుమా.
శ్లో. ఆకాశాత్
వాయు ప్రభవః,
శరీరాత్ సముచ్చరన్, వక్త్రముపైతి నాదః।
స్థానాన్తరేషు ప్రవిభజ్యమానో వర్ణత్వమాగచ్ఛతి యః స
శబ్దః॥
గీ. వాయువాకాశమునఁ బుట్టి పలుకఁబడును
దేహమందుండి, వక్త్రాన దివ్య నాద
మగుచు, స్థానములను బట్టి యగును వర్ణ
ముగను. శబ్దమందురు దాని నిగమ విదులు.
భావము. ఆకాశమునుండి వాయువు ప్రభవించును. శరీరమునుండి ఉచ్చరింపఁబడి, ముఖముద్వారా ద్వనిరూపమున వెల్వడును. స్థానాంతరములనుండి విభజింపఁబడినవి అక్షరములుగా ఏదైతే వెలువడుచున్నవో అదియే శబ్దము.
శ్లో:-
ఆగమార్థంతు దేవానాం - గమనార్థంతు రాక్షసాం
కురు ఘంటా రవం తత్ర - దేవతాహ్వాన లాంఛనం.
గీ:-
దేవతల రాక కొఱకని తృప్తిఁ గొలుప,
రాక్షసుల పోక కొఱకు, పరాకు లేక
గంట వాయించు టొప్పును, గర్భ గుడిని,
దేవ తాహ్వాన పద్ధతి తెలియఁ దగును.
భావము:-
పూజా సమయంలో మనం పూజించే దేవతలు అక్కడికి రావడం కొఱకు, మన బాహ్యాంతర ప్రదేశాల నుండి రాక్షసులు పోవడం కొఱకు, గంట మ్రోగించ వలెను. దేవతల నాహ్వానించు లక్షణము ఇదేసుమా.
శ్లో. ఆచినోతిహి
శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి
స్వయం ఆచరతే యస్మాత్తస్మాదాచార్య
ఉచ్యతే.
క. శాస్త్రంబులనుసరించుచు,
శాస్త్రాంబులు బోధఁ జేసి, చక్కఁగ ప్రజలన్
శాస్త్రంబులాచరింపఁగ
శాస్త్రజ్ఞులు చేయుదురిల సత్యాచార్యుల్.
భావము. శాస్త్రము ఆకళింపు చేసుకొని వారు ఆచరించుచుారి బోధనల ద్వారా యితరులను ఆచరింప చేసేవారేఆచార్యులు అని చెప్పఁబడినది.
శ్లో. ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్య దుఃఖ రోగాణి బంధన వ్యసనాని చ.
గీ. దేహికపరాధతరులబ్ధ దీన ఫలము
లిలను దారిద్ర్య దుఃఖములేల్చు రోగ
బంధనములువ్యసనములుబాధఁ గొలుపు.
దేహి యపరాధ దూరుడై తిరుగ వలయు.
భావము. జీవులయొక్క "స్వయం కృతాపరాధం" అనే వృక్షానికి - దారిద్ర్యం,దుఃఖం , రోగాలు , బంధన ప్రాప్తి , వ్యసనాలు అనేవి ఫలాలు.
శ్లో. ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్యచ కర్మణః
క్షిప్ర మక్రియ మాణస్య కాలః పిబతి సంపదః.
గీ. ఇవ్వ దలచిన వెంటనే యిచ్చుట తగు.
పుచ్చుకొననెంచ వెంటనే పుచ్చుకొనుడు.
కాలహరణంబు చేసిన కాలగతిని
ధనము హరియింపఁబడవచ్చు తలచిచూడ.
భావము. తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా అది వెంటనే చేసేయాలి. అలాకాక అప్పుడో ఇప్పుడో అనుకుంటే కాలం ఆ సంపదని మింగేస్తే ఆ మీదట ఇవ్వటం ఉండదు, పుచ్చుకోవడము ఉండదు.
శ్లో|| అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్వేన శుద్ధ్యతి|
విద్యాతపోభ్యామాత్మాచ బుద్ధిః ఙ్ఞానేన శుద్ధ్యంతి||
గీ. నీటి చేతను దేహము, నెమ్మి మనసు
సత్వ గుణమున శుద్ధి యౌన్ సత్యమిదియె.
తపము, విద్యల నాత్మయు, తనరు బుద్ధి
జ్ఞానమున శుద్ధి పొందును సరసులార!
భావము. నీటిచేత అంగములు, శరీరము శుద్ధినొందును. సత్వగుణముతో మనస్సు శుద్ధిని పొందును. విద్యచేత, తపస్సు చేత ఆత్మ శుద్ధి కలుగును. ఙ్ఞానముచేత బుద్ధి శుద్ధిని పొందును.
శ్లో. ఆదౌ చిత్తే తతఃకాయే సతాం సంపద్యతే జరా
అసంతాతు పునః కాయే నైవ చిత్తే కదాచ న.
గీ. సుజన పాళికి వార్ధక్య శోభ మదికి
చిన్నతనమునె వచ్చును మన్ననముగ.
వరసు చేతనె పాపికి వచ్చు ముదిమి.
జ్ఞానమున రాదు వృద్ధత, కానరేల?
భావము. సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది. దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యంరాదు.
(పెద్దరికం రాదు).
శ్లో|| ఆద్భిర్గాత్రాణి
శుధ్యన్తి మనస్సత్యేన శుధ్యతిl
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిః
జ్ఞానేన శుధ్యతిll
తే.గీ. శుద్ధి చేయును దేహమున్ శుద్ధ జలము.
సత్యమది శుద్ధి మనమును సరిగ చేయు,
జ్ఞాన మది బుద్ధికిన్ శుచిఁ గలుగఁ జేయు,
ఆత్మశుద్ధిని తపమదే యమరఁ జేయు.
భావము. "జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచే బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ పరిశుద్ధమగును".
శ్లో. ఆపదర్థం
ధనం రక్షేత్,
దారాన్ రక్షే ద్ధనై
రపి,
ఆత్మానం సతతం రక్షేత్,
దారై రపి
ధనై రపి.
గీ. ఆపదల్ బాప ధనము నీ వరసి కాచు.
ధనము వెచ్చించి కాచుమీ దారనెపుడు.
నిన్ను కాపాడు కొనుము నీ వనితరగతి.
ధర్మమును కాచు మెన్నడు ధరణి పైన.
భావము. ఆపత్కాలము కొఱకై ధనమును భద్రపఱచుకొనవలెను. ఆ ధనములను వ్యయము చేసియైనను భార్యా పుత్రాదులను సంరక్షించుకొనవలెను. ధనము, కుటుంబము యీ రెండింటితోనూ తనను యెల్లప్పుడూ కాపాడుకొంటూండవలెను.
శ్లో. ఆమరణాంతాః ప్రణయాః, కోపాః తక్షణ భంగురాః
పరిత్యాగాశ్చ నిశ్శంకాః భవంతి హి మహాత్మనామ్.
క. మహితుల ప్రణయమనంతము.
మహితుల కుపితము క్షణంబె మాయును పిదపన్.
మహితుల త్యాగమశంకిత
మహితులకును హితులు వారలమరులు తెలియన్.
భావము. మహాత్ముల స్నేహాలు మరణపర్యంతాలు. కోపాలు తక్షణమే నశించి పోతాయి. వారి త్యాగాలు ఏమాత్రమూ శంకలేనివిగా ఉంటాయి.
శ్లో:- ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపి నాథ నమోస్తు తే.
తే.గీ:- ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:- ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.
శ్లో. ఆయుర్విత్తం
గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ , నవ గోప్యా
మనీషిభిః.
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప రాదు.
గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,
మానమును సంగమంబవమానము మరి
దానమును, మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము ,
అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను.
శ్లో. ఆయుషం
క్షణ ఏకో೭పి సర్వ యత్నైర్నలభ్యతే!
నీయతే తద్వృథాయేన ప్రమాదః
సుమహానహో!!
క. గడచిన క్షణమును వెనుకకు
నడుపఁగ మన వశమగునొకొ?. నడువఁగ వలయున్
వడివడి సమయము వెనుకనె.
నడువకునికి హితమొదవదు. నడువుడు వడిగా.
భావము: ఆయుర్దాయము ఒక్క క్షణము (వ్యర్థముగా) గడిచిపోయినను ఎన్ని ప్రయత్నములు చేసి అయినను దానిని తిరిగి వెనుకకు తీసుకొని రాలేము. (ఎంతటి మహానుభావులకయినను) సమయము వ్యర్థము అయినచో గొప్ప ప్రమాదము కలుగ చేయును కదా! అహో ఎంతటి ఆశ్చర్యకరమయిన విషయమిది!
కావున కాలము వ్యర్థము చేయక కాలముతో పాటుగా మనము కూడా మెలకువతో అప్రమత్తముగా నడువవలెను.
శ్లోకము:-
ఆరోగ్యం విద్వత్తా
స
జ్జనమైత్రీ మహా
కులే జన్మ
స్వాధీనతాచ పుంసాం
మహదైశ్వర్యం వినాప్యర్థైః.
తేటగీతి:-
అరయ నారోగ్య విద్వత్తు లమరి యుండి,
సరస సన్ మైత్రి, సత్కుల జననమంది
ఇంద్రియాల జయించిన యింటి కాపు ,
పేదవాడయ్యు ధనికుండు పృథివి పైన.
ఆరో గ్యము, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత, ఇంద్రియ నిగ్రహము ఇవి వున్న వాడు పేదవాడయ్యును ధనికుడే సుమా!
శ్లో. ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
పాత్యతే తు క్షణేనాధస్తథాత్మా గుణదోషయోః.
గీ. కొండ పైనుండి పడిపోవు బండ త్రోయ,
కొండపైకది చేర్చుట కుదురు నెటుల?
మంచి మాయును క్షణములో మలిన గతిని.
మంచి గడియ్తింప కష్టము. మంచి కనుఁడు.
గీ. పర్వతము పైకి శిల మోయు పగిది, మంచి
నరయు టెన్నగ కష్టంబు నరుని కిలను.
పర్వతము నుండి త్రోయగ పణుకు వోలె.
సులభముగ చేరు మదు లందు మలిన బుద్ధి.
భావము. ఒక పెద్ద శిలను పర్వతాగ్రం మీదికి చేర్చటానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేయాలి. దానినే నేలమీదికి జార్చటానికి ఒక్క తోపు తోస్తే , క్షణం చాలు. అలాగే సద్గుణాలు సాధించటానికి ఎంతో సాధన కావాలి. పతితుడు కావటానికి ఏ శ్రమా అవసరంలేదు !
శ్లో. ఆలస్యస్య
కుతో విద్యా?
అవిద్యస్త కుతో ధనం?
అధనస్య కుతో మిత్రమ్?
అమిత్రస్య కుతః సుఖమ్?
తే.గీ. సోమరికి విద్య లభియించునేమిగతిని?
ధనమవిద్యనెటులమరు తరచి చూడ?
ధనములేకున్న మిత్రులన్ దనరుటెట్లు?
మిత్రహీనుడు సుఖమెట్లు మేదినిఁగను?
భావం:-
సోమరికి చదువెక్కడిది. చదువులేని వాడికి ధనమెక్కడిది? ధనం లేని వాడికి మిత్రులెక్కడ? మిత్రులు లేని వాడికిసుఖమెక్కడ?కాబట్టి సుఖం కావలెనన్నచో మిత్రులుండవలెను. మిత్రులుండవలెనన్నచో ధనం ఉండవలెను. ధనం ఉండవలెనన్నచో చదువుండవలెను. చదువుండవలెన్నచో సోమరితనము ఉండకూడదు. అనగా సోమరితనమును పారద్రోలవలెను.
శ్లో. ఆశయా
బధ్యతే లోకే కర్మణా
బహుచిన్తయా |
ఆయుః క్షీణం
న జానాతి
తస్మాత్-జాగ్రత జాగ్రత
||
आशया बध्यते
लोके कर्मणा
बहुचिन्तया ।
आयुः क्षीणं
न जानाति
तस्मात्-जाग्रत जाग्रत
॥
ఆ.వె. పాప పుణ్య ఫలిత బహుచింతనములచే
నాశఁ దగులు లోక మనవరతము.
గడిచిపోవు వయసు పొడనైనఁ గనలేరు
కనుక జాగృతినిల మనఁగఁ దగును.
భావము. లోకులు తమ కర్మ ఫలముల చేత, అనేక చింతల చేత ఆశాపాశ బద్ధులై ప్రవర్తించుదురే కాని గడిచిపోవుచున్న్ ఆయువును చూడజాలేరు. కావున జాగ్రత్తాగా ప్రవర్తించ వలసి యున్నది.
శ్లో. ఆశా నామ మనుష్యాణాం కాచిదాశ్చర్య శృంఖలా
యావత్ బద్ధో ప్రధావంతి ముక్తా తిష్టంతి పంగువతు
గీ. ఆశ వింతైన సంకెల యవనిజులకు.
బద్ధుడైయున్ననాడు తా పరుగు పెట్టు
బద్ధముక్తుఁడై చతికిల పడును తాను.
ఆశ వింతైన త్రాడురా!.అద్భుతమిది.
భావము. ఆశ గురించి చమత్కారంగాఇందు వర్ణింపఁబడినది. ఆశ మనిషికి ఒక ఆశ్చర్యకరమైన సంకెల వంటిదిట. ఆశ సంకెల అంటే కాదనేవారుండరు. కానీ అందులో ఆశ్చర్యం పొందటానికి ఏముంది??? సంకెళ్ళతో బంధించేది దోషి పారి పోకుండా ఒకచోట కట్టిపడేయటానికి. కానీ ఆశా సంకెళ్ళతో బంధీగా వున్న వాడు ప్రధావంతీ అంటే పరిగెడుతూనే వుంటాడట. ఎందుకు పరిగెడతాడు? తన కోరికలు ఆశలు తీర్చుకోవడానికి ప్రపంచం అంతా తిరుగు తాడు. అదే ఆశా బంధవిముక్తుడు తిష్టంతి అంటే ఒక మూల చతికిలపడి కూర్చుంటాడట. అదీ ఎలాగ అంటే పంగువతు, కుంటివాడిలా కూర్చుండిపోతాడట. ఎంత అద్భుతమైన భావం ఎంత అందంగా చమత్కారంగా వర్ణించాడో కవి.
శ్లో. ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వలోకస్య
ఆశా యేషాం దాసీ ,తేషాం దాసాయతే లోకః.
గీ. ఆస కలవారు జగతకి దాసులయ్య.
ఆస వీడిన జగతియే దాసియగును.
ఆస గొలుపును దైన్యము నరసి చూడ.
ఆస వీడిన సుఖమబ్బునసదృశమది.
భావము. ఎవరు ఆశకు దాసులౌతారో , వారు లోకానికంతటికీ దాసులౌతారు. ఎవరికి ఆశ దాసిగా ఉంటుందో , వారికి లోకమే దాస్యం చేస్తుంది!
శ్లో. “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే,
వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”
తే.గీ. భోజనమువేళ, పడుకొనఁ బోవువేళ,
దానమిచ్చునప్పుడు వస్త్ర ధారణమున,
కూర్చొనెడివేళ, పెండ్లిలో, ఘోరమైన
తగవులప్పుడు తుమ్ముట తగును, శుభము.
భావము.
కూర్చునే సమయములో, పడుకునే సమయములో, దాన సమయములో,
భోజన సమయములో, వస్త్ర సంగ్రహ సమయములో, వివాద సమయములో,
వివాహ సమయములో, ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకము.
శ్లో. ఇచ్ఛతి
శతీ సహస్రం,
సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం, రాజ్యస్థః
స్వర్గమీహతే.
గీ. నూరు కలవాడు వేయిని కోరుచుండు.
వేయికలవాడు లక్షల వేలు కోరు.
లక్ష కలవాడు రాజ్యసల్లక్మిఁో్ గోరు.
రాజ్యవంతుఁడు స్వర్గసామ్రాజ్యమడుగు
భావము. వంద ఉన్నవాడు వెయ్యి కోరుకుంటాడు. వెయ్యి ఉన్నవాడు లక్షకావాలంటాడు. లక్షాధికారి రాజ్యంకావాలంటాడు. రాజు స్వర్గంకోరుతాడు.(ఆశకు హద్దు లేదు).
శ్లోll ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన!
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !
కll చతురాస్యుఁడ! నా నుదురున
అతులిత దుష్కర్మవ్రాయి! హాయిగ వలతున్!
స్తుతియింపగ నరసికుల
మతిమాలియు వ్రాయఁబోకు. మరువకుమయ్యా!
భావము:- ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా వ్రాయుము. సహిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం వ్రాయకుసుమా! . ముమ్మాటికీ వ్రాయకు.
శ్లోll ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్.53 ( నేపాల చరిత్రమ్ )
తే.గీ. పుడమి పరమాత్మపై లసద్బుద్ధి నిలుపు.
దేశ సేవకై జీవించు ధీశుఁడవయి.
బంధు వృద్ధికి కృషి చేసి పరఁగుమిలను.
ఇదియె కర్తవ్యమని యెంచు మదిని నీవు.
తే.గీ.ll దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున
గీ. నిరతమగు దైవ భక్తిని నిశ్చలముగ
కలిగి, దేశంబుకై తాను మెలగుచుండు,
లోకులెల్లరు తన బంధు లోకమనుచు
సజ్జనుండెదతలచును సహజముగనె.
తే.గీ.ll
దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.
భావము.
భగవంతునిమీద నిశ్చల మైన బుద్ధి దేశ సేవ కొఱకు జీవంచటం పృధివి మీద బంధు వృద్ధి ఈ మూడూ మన అందరి కర్తవ్యం అని సనాతన ధర్మం చెపుతుంది
శ్లో. ఉత్తమం
స్వార్జితం విత్తమ్, మధ్యమం
పిత్రార్జితమ్.
అధమం భ్రాతరం
విత్తం స్త్రీవిత్తమధమాధమమ్.
గీ. తనదు సంపాదనము మేలు. తండ్రి ధనము
మధ్యమంబన్నదమ్ముల మాన్య ధన మ
ధమము స్త్రీధనంబులధ మాధమము తలుప,
కష్ట జీవికి సంతోష పుష్టి కలుగు.
భావము. కష్టపడి స్వయముగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తండ్రి సంపాదించిన ధనముతో జీవించుట అన్నది మధ్యమము.సహోదరుని ధనముతో జీవించుట అధాము. స్త్రీ ధనముతో జీవించుట యన్నది
అధమాధమము.
శ్లోll ఉత్తమా తత్వ చింతాచ మధ్యమం శాస్త్ర చింతనం
అధమా మంత్ర చింతాచ తీర్థ భ్రాంత్య z ధమాధమం.
గీll తత్వ చింతన శ్రేష్ఠము. తలచి చూడ!
శాస్త్ర చింతన మధ్యమ. చక్కనెఱుఁగ
మంత్ర చింతన మధమము మనుజులకును
తీర్థ చింతనయధమాధమర్థి నెఱుఁగ.
భావము:- తత్వ విచారము ఉత్తమ మార్గము. శాస్త్రచింతన మధ్యమాధికారము. మంత్రోపాసనము అధమ మార్గము. ఇక తీర్థ పర్యటనాభినివేశము అధమాధమము.
శ్లోll ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్
తే.గీll ఉత్తముని కోప మొక క్షణ ముండు. నిజము.
మధ్యమునకు రెండుఘడియల్మసలు కోప
మధమునకురాత్రి పగలుండి యంతమగును.
పాపిమరణించు వరకును కోపముండు.
తే:-
ఉత్తముడు క్షణ కోపియై యుండు నిజము.
మధ్యముని లోన ఘడియుండి మాసి పోవు.
అధమునందున రోజుండి ఆరిపోవు.
పాపి మరణించు వరకును పాయదతని.
భావము:- ఉత్తమునకు వచ్చెడి కోపము ఒక్క క్షణ కాలముండి పోవును. మధ్యమునకు వచ్చు కోపము రెండు ఘడియల కాలము మాత్రమే ఉండి పోవును. అధమునకు వచ్చుయ్ కోపమైతే ఒక రాత్రి, ఒక పగలు ఉండును. కాని పాపాత్ములకు వచ్చు కోపము మాతర్ము వారు మరణించు వరకూ ఉండును.
తన కోపమె తన శర్తువు. అన్నారు పెద్దలు. కావున మనం పై విషయం గ్రహించి శాంతాత్ములమై వర్తించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం.
శ్లో. ఉదయే
సవితా రక్తో రక్తశ్చాస్తమయే
తథా
సంపత్తే చ విపత్తే
చ మహతామేక
రూపతా.
గీ. మహితు లొకరీతినే యుంద్రు మహిని తాము
సంపదలలోన యాపన్న సమయమునను.
సూర్యుఁడుదయాస్తమయములఁ జూ డ నెఱుపు
వర్ణమునె యొప్పుచుండును భ్రమణమందు.
భావము. సూర్యుడు ఉదయించే సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అస్తమయ సమయంలోనూ ఎఱ్ఱగానే ఉంటాడు. అలాగే మహాత్ములు సంపదలలోనూ, ఆపదలలోనూ ఒకే విధంగా ఉంటారు.
శ్లో ఉద్ధరేత్ ఆత్మ న్ ఆత్మానమ్ ఆత్మానమ్ అవసాదయేత్
ఆత్మైవ హి ఆత్మానో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః
తే.గీ. తానె యుద్ధరించుకొనును తనను మనిషి.
తానె పతనహేతువగును తనకు చూడ.
తనకు మిత్రుఁడు చూడగ తానె యగును.
తనకు శత్రువు తానెగా తలచ మనిషి.
భావము. మనిషి ఉద్ధరింపబడటానికి అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువు గా, మన ని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువు గా మనలను అధోగతి పాలు చేస్తుంది.
శ్లో. ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం
క్రియావిధిజ్ఞం వ్యసనేష్వసక్తం
శూరం కృతజ్ఞం దృఢసౌహృదం చ
సిద్ధిః స్వయం గచ్ఛతి వాసహేతోః.
గీ. కనఁగ నౌత్సాహి, నేర్పరి, ఘన సుగుణుఁడు,
సత్ కృతజ్ఞుఁడు, శౌర్యుఁడు, సమత, స్నేహ
కలితుఁడైనట్టి వానికి కలుగు జయము.
కార్య సంసిద్ధి యాతని ఘనత ఫలము.
భావము. ఉత్సాహవంతుడు, పనులలో ఆలస్యం చేయనివాడు, పనిసాధించే పద్ధతి తెలిసినవాడు, చెడు అలవాట్లయందు ఆసక్తి లేనివాడు, శూరుడు, కృతజ్ఞతా బుద్ధికలవాడు, దృఢమైన స్నేహస్వభావం కలవాడు అయితే, అతనికి కార్యసిద్ధి తనంతట తానే కలుగుతుంది.
శ్లో. ఉద్యోగః ఖలు కర్తవ్యః ఫలం మార్జాలవద్భవేత్
జన్మప్రభృతి గౌర్నాస్తి పయః పిబతి నిత్యశః.
క. ఫల సాధనకై సతమును
సెలవెఱుగక పిల్లివోలె చెలగుట తగు, తా
కలుగకపోయియు ఆవును
వలసిన పాల్త్రాగు పిల్లి. భావించుడయా!
భావము. ఫలితాన్ని పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పుట్టినప్పటినుండి తనకు ఒక ఆవు లేకపోయినా, నిరంతర ప్రయత్నంతో పిల్లి ప్రతిరోజూ పాలను త్రాగుతూనే ఉంది!
శ్లో:- ఉపాధ్యాయాన్ దశాచార్యః
- ఆచార్యాణాం శతం పితా.
సహస్రంతు పితౄన్ మాతా
- గౌరవేణాతిరిచ్యతే.
గీ:- ఒజ్జలు పదుగురాచార్యుఁడొక్కని సరి
నూర్గురాచార్యులకు మిన్న నుత పితరుఁడు.
తల్లి వేయి రెట్లధికము తండ్రి కన్న.
కాన తల్లిని సేవించి కనుము ప్రీతి!
భావము:- పదొ మంది ఉపాధ్యాయుల కంటె ఆచార్యుఁడు గౌరవార్హుఁడు. నూరుగురు ఆచార్యుల కంటె తండ్రి, తండ్రి కంటె వేయి రెట్లు తల్లి పూజనీయులు.
అందు చేతనే మొదట మాతృ దేవో భవ ఆతరువాత పితృ దేవో భవ, ఆతరువాత ఆచార్య దేవో భవ అని గౌరవింపబడుతున్నారు.
కావున మనము తల్లిని నిర్లక్ష్యము చేయ కూడదు.
శ్లో. ఉపానహౌ చ వాసశ్చ ధృత మన్యై ర్న ధారయేత్,
ఉపవీత మలంకారం స్రజం కరకమేవ చ.
గీ. పాదరక్షలు, పూవులు, వస్త్రములును,
జంధ్యములు నలంకారముల్ చక్కనివని,
పరులు ధరియించు వాటిని వాడ రాదు.
కోరి దారిద్ర్యమును తెచ్చుకొనుటె యగును.
భావము. ఒకరు ధరించిన పాదరక్షలు ధరించుట, ఒకరు కట్టిన వస్త్రమును కట్టుట, ఒకరి యజ్ఞోపవీతమును ధరించుట, ఒకరు ఉపయోగించిన అలంకారములను, పూలమాలలను ధరించుట. వేరొకరి కమండలువు ఉపయోగించుట. ఇవి ఎవ్వరును చేయరాదు. ఈ విధమైన పనులు కోరి దారిద్ర్యమును ఆహ్వానించుటయే.
శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.
కం.కోరి నంతనె కోర్కెలు తీరఁ బోవు.
కోరి యత్నించ సిద్ధించు కోర్కెతీర్చు.
సుప్త సింహంబు నోటను చొచ్చునొక్కొ
మృగము లేవైన? కష్టించ మిగులు ఫలము.
భావము. ప్రయత్నంతోనే పనులు సిద్ధిస్తాయి కాని , కేవలం కోరికలతో కాదు. నిద్రిస్తున్న సింహం నోటిలోనికి మృగాలు తమంతట తాము ప్రవేశించవు కదా.(సింహం వేటాడకుండా ఆహారం లభించదుకదా)
శ్లో. ఋణమోచన కర్తారః పితుస్సంతి సుతాదయః
బంధమోచన కర్తా తు స్వస్మాదన్యో న కశ్చన.
గీ. తండ్రి ఋణ ముక్తుఁ జేయును తనయుడిలను.
భువిని సంసార బంధ విముక్తి పొంద
నెవరి యత్నము వారలే భవుని కృపను
కలిగి చేయక తప్పదు. కాంచుడయ్య.
భావము. తండ్రిని ఋణవిముక్తుణ్ణి చేయటానికి కుమారులు మొదలైన వారుంటారు. కానీ సంసార బంధవిముక్తులు కావాలంటే ఎవరికి వారే కర్తలు తప్ప వేరొకరుకాదు.
శ్లో. ఏకశ్చండ్యా, రవౌ సప్త, త్రిస్రో దద్యాత్ వినాయకః.
చతస్రం వాసుదేవస్య, శివస్యార్థ ప్రదక్షిణా!!
ఆ.వె. అమ్మవారికొకటి, యా భాస్కరునకేడు,
గణపతికిని మూడు, గౌరవముగ
విష్ణువునకు నాల్గు,విశ్వ హర్తకునర్థ
సుప్రదక్షిణములు చొప్పుఁ జేయ.
భావము. అమ్మవారికి ఒక ప్రదక్షిణము, సూర్యునికి ఏడు, గణపతికి మూడు, విష్ణువుకి నాలుగు, శివునికి అర్థ ప్రదక్షిణ చేయవలయును.
శ్లో:- ఏకేనాzపి కు వృక్షేణ కోటరస్థిత వహ్నినా
దహ్యతే తద్వనం సర్వం. కు పుత్రేణ కులం యథా.
ఆ:- చెట్టు తొఱ్ఱ నుండి పుట్టిన యగ్ని, తా
చెట్టుతోడ వనము చుట్టి, కాల్చు.
దుష్ట పుత్రకుండు దురిత వహ్నిని గొల్పి
వంశ మెల్లఁ గాల్చు పగిది నిలను.
భావము:- ఒక చెడ్డ చెట్టు తొఱ్ఱలో నిప్పు గనుక పుట్టినచో ఆ నిప్పువలన ఆ చెట్టే కాక వనమంతాకూడా కుపుత్రుఁడు వలన వంశమంతయూ దహింపఁబడు విధముగా దహింపఁబడును.
శ్లో:- ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
ఆ:- మంచి చెట్టు పూసి యెంచగా లేనంత
పరిమళంబు నింపు వనమునెల్ల.
మంచి పుత్రు డున్నమన్ననల్ కలిగించి
వంశమునకు, తాను వరలు నటుల.
భావము:- అరణ్య మంతనూ ఒక్క మహా వృక్షము పుష్పించి, సువాసనలచే సుగంధితముగా చేయుచున్నది. అట్లే ఒక్కడైననూ సుపుత్రుడు కలిగినచో వంశమున కంతకును కీర్తి చంద్రికలు పర్వు చున్నవి.
శ్లో. ఓంకార
పంజర శుకీ
ముపనిషదుద్యాన కేళి కలకంఠీమ్.
ఆగమ విపిన
మయూరీ మార్యా మంత
ర్విభావయే ద్గౌరీమ్.
తే.గీ. కలికి యోంకారపంజర చిలుక, యుపని
షద్వనవిహార కలకంఠి,సత్ప్రభాస,
ఆగమవిపిన యురగారి, యనుపమయుమ
అట్టి సజ్జన స్తుతగౌరికంజలింతు. భావము. ఓంకారమనే పంజరములో ఉండే రాచిలుకకు, ఉపనిషత్తులను ఉద్యానవనములో ఆటలాడుకొను దివ్య సుందర స్వరగాత్రము గల జగన్మాతకు, ప్రపంచ సృష్టికార్యము కొరకు నిరంతరము చేయబడుచున్న కార్యమును విశదీకరించు శాస్త్ర సముదాయమైన మహారణ్యములో విహరించు మయూరమునకు, గొప్ప సంస్కారముగల మహనీయుల అంతరంగమందు సదా భావింపబడు మాతయగు గౌరీదేవికి నమస్కారము.
శ్లో:-
కంఠస్థా యా భవేత్ విద్యా సా ప్రకాశ్యా సదా బుధైః.
పుస్తకే, పర హస్తేచ న సా విద్యా న తత్ ద్ధనం.
గీ:-
వినగ కంఠస్థమైనట్టి విద్య విద్య.
బుధులు వర్ధిల్లఁ గలుగు తత్ సుధను గలిగి.
పుస్తకమునున్న విద్య తో పొసఁగు నేమి?
పరుల నున్నట్టి ధనముతో ఫలమదేమి?
భావము:-
ఏ విద్య మనకు కంఠస్థమై యుంటుందో ఆ విద్యయే విద్య అనబడుతుంది. అట్టి విద్య వలన బుధులు ప్రకాశింతురు.
పుస్తకమునందుఁ గల విద్య వలన గాని, పరుల వద్ద గల ధనము వలన గాని మనకు ఏమి ప్రయోజనము కలుగును?
శ్లో:-కరారవిందేన పదారవిందమ్ ముఖారవిందే వినివేశయమ్ తమ్
వటస్య పత్రస్య పుటే శయానమ్ బాలమ్ ముకుందమ్ మనసా స్మరామి.
క:- కరపద్మములను గొనుచును
చరణాబ్జము; ముఖజలజముఁ జక్కగ నిడుచున్
ధరణి వట పత్ర శయనుని
దరహసితుఁని; బాలకృష్ణుఁ దలతును నేనున్.
-:భావము:-
పద్మముల వంటి చేతులతో పద్మముల వంటి కాళ్ళను పట్టుకొని ముఖ పద్మమున చేర్చుచు; వట పత్రముపై శయనించి యున్నబాల ముకుందుని
మనసారా స్మరింతును.
శ్లోకము:-
కర్కటే పూర్వ ఫల్గున్యాం
తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం
వందే శ్రీరంగ నాయకీం.
ఆటవెలది:-
కర్క టాఖ్య మైన అర్క మాసము, పూర్వ
ఫల్గునమున, తులసి వనము లోన,
పాండ్య దేశమందు ప్రభవించినట్టి మా
రంగ నాయకికిని ప్రణుతి సేతు.
శ్లో. కర్కోటకస్య
నాగస్య దయయంత్యా నలస్య
చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం
కలినాశనమ్.
క. ఇల కర్కోటక నాగు న . . .
మల నల దమయంతులను సుమతి ఋతుపర్ణున్
కొలిచిన కలిదోషంబులు
కలుఁగవు మది కొలువుఁడిక ప్రకాశము పొందన్.
భావము: కర్కోటకుడు అనే నాగు ని, దమయంతి నలుడు అను పుణ్య దంపతులని, ఋతుపర్ణుడు అను పేరుఁగల రాజర్షిని తలచుకొనినచో మానసిక రోగములు, కలి వలన కలిగెడి పీడలు తొలగిపోవును.
శ్లో. కర్తవ్యంచైవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి;
అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి.
తే.గీ. చేయవలసిన పనులను చేయవలయు
ప్రాణములు దేహమందున వరలు వరకు,
చేయకూడని పనులను చేయరాదు
ప్రాణములుపోవుచుండినన్, భావ్యమదియె.
భావము.
ప్రాణాలు పోయే వరకూ మనం ధర్మమే పాటించాలి.చేయకూడని పని చేయకూడదు.
శ్లో:-కర్మణా
జాయతే భక్తిః
భక్త్యా జ్ఞానం
ప్రజాయతే
జ్ఞానాత్ ప్రజాయతే
ముక్తిః
ఇతి శాస్త్రార్థ
సంగ్రహః.
తే:-కర్మ వలననె భక్తి తా కలుగు నిజము.
భక్తి వలననె జ్ఞానంబు ప్రభవ మందు.
ముక్తి మార్గము జ్ఞానము . ముక్తి సుఖము.
గీత శాస్త్రార్థ సంగ్రహ స్ఫూర్తి గనుడు.
మానవుడు ముక్తిని గోరితే అది నిష్కామ కర్మ మార్గము ద్వారానే సాధ్యమగును. కర్మ వలన భక్తి ప్రభవించును. భక్తి వలన జ్ఞానము ప్రభవించును. జ్ఞానము వలననే ముక్తి ప్రాప్తించును. అట్టి ముక్తి శాశ్వతానంద దాయకము. దుఃఖాతీతము. కాన మనము కూడా నిష్కామ కర్మ నాచరించుట ద్వారా భక్తి > జ్ఞాన > ముక్తులను పొందడాని కుపేక్ష యెందుకు. సత్కర్మలనాచరిద్దాం.
శ్లోll కలౌకల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినామ్
విధి క్రియా విహీనానాం హరేర్నామైవ కేవలమ్.
తే.గీll కలి యుగంబున కల్మష కలితులకును,
పాప ద్రవ్యోప భుక్కులౌ పాపులకును,
విహిత క్రియ వీడి చరియించు వెడఁగులకును
హరి ముదావహ నామము శరణమరయ.
భావము:- కలియుగంలో కల్మష చిత్తమున్న వారికి, పాప సంపాదనతో జీవిస్తున్న వారికి,వేద విహిత కర్మాచరణ లేనివారికి కేవల హరి నామమే మార్గము.
శ్లో. కవిః కరోతి కావ్యాని .. రసం జానాతి పణ్ణితః|
తరుః సృజతి పుష్పాణి .. మరుద్వహతి సౌరభమ్.
తే.గీ. కవులు చేయగ సత్కావ్య కల్పనలను
కావ్యసారమున్ బండితుల్ గాంతురెన్ని,
వృక్షములు చక్కనైనట్టి విరులు పూయ
పరిమళము వ్యాప్తిచేయును వాయువిలను.
భావము. కవి కావ్యాలను వ్రాయును. పండితుడు అందలి సారమును తెలుసుకొనును.
చెట్టు పుష్పములను పుష్పించును- వాయువు వాటి సుగంధమును వ్యాపింపజేయును.
శ్లో. కరావివ శరీరస్య , నేత్రయోరివ పక్ష్మణి
అవిచార్య ప్రియం కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే.
ఆ. దేహమునకు మేలు దేహ భాగములెట్టు
లప్రయత్నముగనె యరసి చేయు
నటులె చేయుచుండు నరసి సన్మిత్రుఁడు.
మిత్రుఁడనిన యతఁడె ధాత్రిపైన.
భావము. శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.
శ్లో. కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః
తరుః సృజతి పుష్పాణి , మరుద్వహతి సౌరభమ్.
క. కవి కావ్యము రచియింపగ
కవి హృదయము రసములెఱుగు ఘన పండితు డీ
భువి విరులను పూయ తరువు
సవిధంబుగ గాలి మోయు సౌరభమెల్లన్.
భావము. కవి కావ్యాలు వ్రాస్తే , పండితుడు రసాన్ని గ్రహిస్తాడు. వృక్షాలు పూలను సృజిస్తే, వాయువు సువాసనను వహిస్తుంది.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.