శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా!
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో,
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి
"మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము" పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా ప్రచురిస్తున్నాను. ఇది 7/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు.
జైహింద్.
ప్రసన్న భాస్కరము
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.
జైహింద్.
ప్రసన్న భాస్కరము
రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.
73.చీఁకటి లోనఁ జిక్కు వడి, చీదరలం గని కోలుపోయితిన్
నా కను చూపు! వేయి కిరణంబుల వేలుపవే! వరాళి వే
చే కొనుఁడంచుఁ దేనియలు చిన్కుదువే! తనివారఁ జూతువే!
నా కను చూపు! వేయి కిరణంబుల వేలుపవే! వరాళి వే
చే కొనుఁడంచుఁ దేనియలు చిన్కుదువే! తనివారఁ జూతువే!
సాకవె వెల్గులన్ జిలికి చక్కగ! పల్లవితారుణ ద్యుతీ!
74.చీకటి కోన లోనఁ బడఁ జేసె నిసీ! యిటుఁ జూచు చుండఁగా.
నే. కను! లెట్లు నమ్మ వలె నీ దురితంబు? మఱెవ్వ రార్చువా
రీ కను సేగి? నీ వొకఁడవే దెస మాలిన వారి సాకఁగా!
లోకము చుట్టమన్న నుడి రూఢి గదా! దయ చేసి ప్రోవవే.
75.ఇరులు విదల్చినావు, కరుణించి జపా ప్రసవారుణాంశువుల్
చరచర రాల్చినావు, శృతి సార రస ప్రియ గీతికా రుతుల్
బిరబిర విన్చినావు, రుచి పేశల కీర ముఖోద్గతమ్ముల
బ్బురముగ వెల్గు పూల్ విరియఁ బూచె దెసల్! రస రమ్య జీవనా!
76.అరిది కఠోర తాప శిఖివా? అరుణారుణ సౌర రేఖవా?
చర దమృతాంశు రమ్యతర చంద్రికవా? హృదయాబ్జ బంధు భా
స్కరుఁడవ? దుస్సహంబయిన కాంతివ? పువ్వుల బంతివా ? ప్రభూ!
దరిసెన మిచ్చి, నీ పరమ తత్వముఁ దెల్పఁగదే? ప్రభాకరా!
77.ఆరని మంట రేఁగు సెగవా? కడుఁ జల్లని నీటి బుగ్గవా?
హారి హిరణ్మయాంగ రుచివా? శుచి కుండల శంఖ చక్ర కే
యూర విభూషణ ద్యుతివ? ఉగ్ర సుదర్శన కాంతి రేఖవా?
వారిజ వల్లభా! తెలుపవా నిజ వృత్తము? నీకు మ్రొక్కెదన్.
78.ఆరని లోతు నీటి కొలనా? వెలుగుల్ వెద జల్లు ముద్ద మం
దారమ? మిన్ వెలంది మెడఁ దాల్చిన వెన్నెల పద్మ రాగమా?
జీరగ నేడు వర్ణములు చిందిన మంజు మహేంద్ర చాపమా?
సౌర మహా ద్యుతీ! అరయఁ జాలుదునే? భవదీయ రూపమున్.
79.ఎవరికిఁ జెప్ప నీ తిమిర? మెట్టుల నన్ బిగిఁ జుట్టుకొన్నదో!
అవశుడనై, యెటుల్ వెలుఁగు లానక, కంపన బడ్డ కాకినై
నవసి, లబో దిబో యనుచు, నా కను జోతిని నిన్నుఁ గంటినో
రవి! కరుణా కటాక్షములు రక్తిమెయిన్ బ్రసరింపఁ జూడవే!
80.ఎటుల సృజించినావు తరణీ! ననుఁ జీఁకటి కోన లోన? బల్
కటికఁదనమ్ము! వెల్గు పొడ గానని యీ తిమిరంపు రొంపి సం
కటమగు త్రోవ నేఁ గడవఁ గల్గుదునా? పదిమంది మంచికో
రుట లగునా? తలెత్తి యిలలో మనఁ గల్గుదునా వలంతినై?
81.ఎంత విచిత్ర మీ సకల సృష్టిని చేతుల లేవ నెత్తి, లా
లింతువు తల్లి వోలె లవలీ మృదులారుణ రేఖ లద్ది, పో
షింతువు కామ్య ధర్మ మధు శీకరమై చెలువార ప్రేమ వ
ర్షింతు వచింత్య వైభవము, లేత లెఱుంగరు నీ ప్రభావమున్!
82.ప్రతి హృదయమ్ములో మెదలు పచ్చన వెచ్చన లీవె! తర్పణ
క్రతువుల కీవె లో వెలుఁగు, కాలము కొల్చుట కీవె దిక్కు! ఈ
కుతకుత లాడు లోకమునకున్ చలివెల్గువు నీవె! దివ్య దీ
ధితి! సకలానుశాసన కృతీ! సము లెవ్వరు నీ కహర్పతీ!
83.ఎవఁడు సముండు నీకు రవి? యిత్తువు సంపద యేన్గు పాడి! వే
ఱెవరి ప్రసక్తి లేక కురిపింతు వెలుంగులు వర్ష ధారగా!
తొవ చెలి నీ సముండె? శిబి తూఁగునె? ఆ బలి పోలునే? కలం
త విడచి మించిరే ధరణి దాతలుగా? మఱి నీవె నీవుగా!
84.తాత జపించె రామ యను తామర బందుగు కోవ ముత్యమున్
బ్రీతి మెయిన్ నినుం గొలుతు వెల్గుల రాయని నేను నేరుగా
ఏ తొలి నాటి పున్నెమొ! త్రయీ మయ కాంతి యిటుల్ వెలార్చెఁ, దం
డ్రీ! తరణీ! కృపాభరణ! నీ కిరణమ్ముల నద్ది సాకవే!
2 comments:
మంచి మంచి పద్యాలు. చదవటానికి చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని చిరు సలహాలు. వీలయితే పాటించగలరు.
1. ఒక పద్యానికీ రెండో పద్యానికీ మధ్య ఒక లైను విడిచిపెడితే అందంగా చూడటానికి బాగుంటుందని నా భావన.
2. పద్య ఛందస్సుని కూడా పద్యం మొదట్లో వ్రాస్తే కొత్తవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. పద్యంలోని నాలుగు వరుసలూ ఒకచోటనుండే ప్రారంభమయితే పద్యం చూడటానికి అందంగా ఉంటుందని నా అభిప్రాయం.
4.యతి స్థానాన్ని పూర్వం ప్రింటుచేసే పద్యాలలో వలె ఓ చుక్క (డైమండు ఆకారంలో )తో గుర్తు పెడితే పద్యాలను వ్రాయటం అభ్యసించాలనుకునే నా బోంట్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. వీలయితే , అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనుకుంచే పాటించగలరు.
ఆర్యా! నారసింహా! మీరు చక్కని సూచనలు చేసారు. చాలా సంతోషం. ధన్య వాదాలు.
మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.