గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2010, సోమవారం

ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.


శ్రీ గురుభ్యో నమ:
భక్త బంధువులారా! 
లోక బంధువైన ప్రత్యక్ష దైవం మన సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన  మాఘమాసం రాబోతున్న సందర్భంగా ఆ లోక బంధువును ఆయురారోగ్య ఐశ్వర్యముల కొఱకు కొలవ దలచుకొన్నవారు పఠించుట కనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో, 
మకుటం లేని మహా కవి రాజు, లబ్ధ ప్రతిష్ఠులు, విశ్రాంత సంస్కృత కళాశాలాధ్యక్షులు, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ప్రియ శిష్యులు అయిన 
శ్రీ మానాప్రగడ శేషశాయి హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావంతో కలం నుండి జాలువారిన కవితాస్రవంతి 
 "మకుటం లేని మహా శతకం" గా
అనేకమంది మహా పండితుల, కవుల మన్నన లందుకొన్నది ప్రసన్న బాస్కరము అనే ఈ శతక రాజము.ఇది కేవలము నియమిత పరిధిగల పుస్తకాలలోనే ఉండిపోవడం అనేకమంది పాఠకులకు అలభ్యంగా ఉంది. ముందుగా మాగురు దేవులైన శ్రీ మానాప్రగడ శేషశాయి పాదారవిందములకు ప్రణమిల్లుతూ, . . . ఆసక్తిగల ప్రతీ ఒక్కరికీ ఈ మహనీయుని రచన అయిన " ప్రసన్న భాస్కరము"  పఠన యోగ్యంగా ఉండటం కొఱకు ఆంధ్రామృతంలో 13 భాగాలుగా  ప్రచురిస్తున్నాను. ఇది 3/13వ భాగము. ఉదార స్వభావులైన పాఠకులెల్లరు సరస హృదయులై పఠించఁగలందులకు మనవి. ధన్య వాదములు. 

జైహింద్.
ప్రసన్న భాస్కరము

రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.
25.మెడలు మలంచి, దూకుడుగ మీఁదికి సాగి, ధృత ప్లుతిన్ బడ

ల్పడి బిగిలాగు కళ్ళెముల రాపున నెత్తురు గారు మోముతో
వడి వడి సాగు సూర్య రథ వాజులు వ్యాయత కాయముల్ సిరుల్
జెడిఁ గురిపించి క్షేమమున సాకుచు మాకుఁ బ్రసన్న్మయ్యెడున్!
26.పిచ్చుక కుంటు సల్పు జడిపింపులకుల్కి, క్షణ ప్రకంపనో
త్పుచ్ఛములై, రుషారుణిత ముగ్ధములై సకిలించి దూకు బల్
పచ్చని గుఱ్ఱముల్ కిరణ భాసురముల్, పరమార్థ సార సం
పచ్చయముల్ మనోజవ సమమ్ములు మాకుఁ బ్రసన్నమయ్యెడున్!
27.స్యందనమేక చక్ర, మల సారథియా, తొడ లేని వాఁడదే!
పొందిక లేనిదా తెరువు, పూన్చిన గుఱ్ఱములా అవేడు! ఏ
మందుము! గమ్యమెంతకుఁ దెమల్చఁగ రానిది! జూల్ కదల్పకే
పొందెను లక్ష్య! మా తురగ పుణ్యము మాకుఁ బ్రసన్నమయ్యెడున్!
28.విభుఁడు సమర్ఘ్య పాద్య కర వీర సుగంధిల కుంకుమాంకిత
ప్రభల వెలుంగు దైవత, మపాంపతి, తూరుపు పువ్వు బోణికిన్
సొబగు జిలుంగు మేల్ముసుగు, చుట్టపు మేరువు సర్వ సృష్టికిన్
శుభకరుఁ డబ్జ వల్లభుఁడు సూర్యుఁడు మాకుఁ బ్రసన్నుడయ్యెడున్!
29.సౌర సమర్ఘ్య పాద్య పరిషన్నతి పూర్వక శాంతి మంత్ర ము
క్తా రచితార్క మండల ముఖమ్మున పువ్వులు గుంకుమాక్షతల్
సారెకుఁ జల్లి నిన్ గొలువ జల్లులు, జల్లులు! భోగ భాగ్యముల్
ధారలు ముంగిటన్ గురిసి, తన్పుదువే! వినవేల నా మొరల్?
30.అరుణ రుచి ప్రసారము, లనంత శుచిస్మిత సుందరమ్ము, లీ
శ్వరములు, దేహ మానసిక సర్వ రుజాంతకముల్, సరోరుహా
దరములు, దుఃఖ నాశములు, ధర్మ నిరూపణముల్, త్రి లోక సం
చరణము లర్క దీధితులు, చయ్యన మాకుఁ బ్రసన్నమయ్యెడున్. 
31.అరుణములైన నీ వెలుఁగు లబ్జహితా! కనమేని, రొంపిలోఁ
బురువులు వోలె ఈ తిమిర పుంజములోఁ బడి యీదులాడి, యే
తెరువును గాన కేడ్చెదము దేవర! నీవు దయామయుండవే్!
దరిసెనమిచ్చి మన్నయన తామరసమ్ములు విందు గొల్పవే!
32.గురు బుధ శుక్ర గోళములకుం బరిపూరకమై, సమస్త భూ
సుర పితృ పుణ్యలోకముల చుట్టు వెలుంగయి, వెల్గు పుట్టు కూ
పిరి యయి, పుణ్య వాసనలు విందులు వెట్టెడి దేవ పాదపం
బరుణ గభస్తి మండలము హాయిగ మాకుఁ బ్రసన్నమయ్యెడున్!
33.గృహముల కెల్ల నీవ కద రాజ పదమ్మును గంటి! నీ అను
గ్రహమది యేల నాపయిని రాదు? నినున్ గను దృష్టి లేక నేఁ
దహ తహ పొంది బల్ వెతలఁ దక్కితి, స్రుక్కితిఁ జేరఁ దీసి ప్ర
త్యహమును నిన్ గనంగఁ పరమాన్నములన్ దనియింపఁ జూడవే.
34.వెలుఁగుల పూల మండపము, వేలుపు లేలిక వాలి కొల్చు కో
వెల, రవ దివ్వె మిన్నులకు విందులు గొల్పెడి సత్ర శాల, వ
న్నెల హరివిల్లు, పున్నెములు మించిన మేలిమి బాల భాను మం
డలము నవోదితారుణిమ నా కనుఁదోయిఁ బ్రసన్నమయ్యెడున్!
35.వెలుగుల తోడ వెన్నెలలు విందు లొసంగెడు కన్నటంచు, నీ
వెలుఁగులు మూర్తి మత్రయము, విందు లటంచు సృజించుటాది శ
క్తులకు నిదానమంచు, జన కోటికి కోటి వరాల జల్లులై
వెలయు నటంచు విందు! అరవింద సఖా! కను విందు సేయరా!
36.వెలుఁగుల పూల వాసనలొ! వేలుపు మేటి యలల్ మెఱుంగులో!
వలపుల పద్మినీ రమణి వాలిక కన్నుల తీపి చూపులో!
తలపుల రవ్వ కెంజిగులొ! దైవత ధేనువు తీపి పాల ధా
రలొ!విను వీధి సాగె రవి రమ్య విభూషణ కాంతి సంతతుల్! 

Print this post

2 comments:

Satya Narayana Sarma చెప్పారు...

మాన్య మహోదయా,
మీరు పంపిన లింకుననుసరించి,ప్రసన్న భాస్కరము ౩/౧౩ లోని పద్యములను పఠించి ఆనంద భరితుడనైనాను. అత్యధ్బుతమైన వర్ణన. ఏ పద్యమునకు అదే సాటి.ఇటువంటి గొప్ప రచనను మాకు పరిచయం చేసినందులకు మీకివే నా ప్రణామములు.త్రిలోక చక్షువైన కర్మ సాక్షి మీకు అనంత శుభములు కలుగ జేయాలని ప్రార్ధిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శర్మగారూ! మీకు ఆనందం కలిగించే పని చేయఁ గలిగాననే సంతోషం మీ వ్యాఖ్య వల్ల కలిగింది. ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.